తిరుపతి, తిరుమలలో జనవరి 9 న ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ : టిటిడి ఈవో
– జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు
– ఈ టోకెన్లు జనవరి 9 వ తేదీన ఉదయం 5 గంటలకు జారీ.
– మూడు రోజుల తర్వాత ఏరోజుకారోజు ముందు రోజు జారీ
– టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదు
• తిరుపతిలోని 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను తనిఖీ చేసిన టిటిడి ఈవో, అదనపు ఈవో
తిరుపతి, 2024 డిసెంబర్ 25: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్రీ శ్యామలరావు వెల్లడించారు.
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు.
తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, మునిసిపల్ గ్రౌండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ లతో పాటు తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.
కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి.
తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో శ్రీమతి గౌతమి, జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ శ్రీధర్ లతో కలిసి ఈవో తనిఖీ చేశారు.
ఈవో వెంట సీఈ శ్రీ సత్యనారాయణ, ఎస్.ఈ శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ మనోహర్, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శ్రీ శేషారెడ్డి, తదితర టిటిడి అధికారులు, పోలీసు, రెవిన్యూ అధికారులు ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Keywords : Tirumala Information, Tirumala Latest Information, Tirumala vaikunta ekadashi , vaikunta ekadashi latest information, Vaikunta Ekadashi Free Darshan Tokens upates