అష్ట సోమేశ్వర క్షేత్రాలు - దాక్షారామం.
[నక్షత్ర పాద శివలింగాలు]
దక్షిణ కాశీగా పిలువబడే దాక్షారామం క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము స్వయంభూమూర్తి. ఇక్కడ లింగం క్రింద సూర్య యంత్రం ఉంది.
ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు చంద్రుడు ద్రాక్షారామ క్షేత్రమునకు వాయువ్యం దిశలో గల సోమేశ్వరం క్షేత్రంలో ఒక శివ లింగాన్ని ప్రతిష్టించాడు. మిగిలిన దిక్కుల యందు - "అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు" అను సప్తర్షులు మరో సప్త లింగాలను (చంద్ర యంత్రాలను) ప్రతిష్టించారు.
ఈ ఎనిమిది ప్రతిష్టలను అష్ట సోమేశ్వరాలయాలుగా పిలుస్తారు. వీటి దర్శనం పుణ్యదాయకం అని ఆర్యోక్తి.
కోలంక, దంగేరు, కోటిపల్లి, కోరుమిల్లి, వెంటూరు, సోమేశ్వరం, వెల్ల, పెనుమళ్ళ గ్రామాలలో ఈ అష్ట సోమేశ్వరాలయాలు ఉన్నాయి. ఇవి దాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి.
ఈ అష్ట సోమేశ్వరాలయాల సందర్శనం వలన చంద్ర గ్రహ దోష నివృత్తి మరియు శివానుగ్రహం కలుగుతుంది. అష్ట సోమేశ్వరాలయాలను జన్మ నక్షత్ర పాద శివలింగాలుగా పేర్కొనారు.
అష్ట సోమేశ్వరాలయాల సందర్శన ముగించి, పిమ్మట ద్రాక్షారామ లోని భీమేశ్వర స్వామిని దర్శించుకోవటం ఆచారం. 8+1=9 ఆలయాల సందర్శనతో యాత్ర సఫలం అవుతుంది. కొంతమంది ముందుగా దాక్షారామం లోని భీమేశ్వరస్వామిని దర్శించి తరువాత అష్టసోమేశ్వరాలయాలను దర్శిస్తూ ఉంటారు.
అష్ట సోమేశ్వర ఆలయాలు
1. తూర్పుదిక్కు:
ఊరు: కోలంక
మండలం: కాజులూరు:
స్వామివారు:- సోమేశ్వర స్వామి
అమ్మవారు: ఉమాదేవి
ప్రతిష్టించినది:- సూర్యుడు:
విష్ణ్వాలయం:- కేశవ స్వామి, వెంకటేశ్వర స్వామి
గ్రామ దేవతలు: ఓరిళ్ళమ్మ, కొల పిల్లమ్మ...
శ్రీ ఉమా సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం.
మేషరాశి, భరణి నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం కోలంక - సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు.
2. ఆగ్నేయం దిక్కు:
ఊరు: దంగేరు
మండలం: కె.గంగవరం
స్వామి వారు: ఉమా సోమేశ్వరస్వామి
అమ్మవారు: ఉమా పార్వతీదేవి
ప్రతిష్టించినది: కశ్యపుడు
విష్ణ్వాలయం:- వేణుగోపాల స్వామి
గ్రామ దేవతలు: కట్లమ్మ, దారలమ్మ:
శ్రీ ఉమాపార్వతీ సమేత సోమేశ్వర లింగము. ఇక్కడ కశ్యప మహర్షి ప్రథమ పూజ గావించినాడు.
మీన రాశి, ఉత్తరాభాద్ర నక్షత్రములో జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం ఈ సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు.
3. దక్షిణం దిక్కు:
ఊరు: కోటిపల్లి
మండలం: కె. గంగవరం:
స్వామివారు: ఛాయా సోమేశ్వర స్వామి
అమ్మవారు: రాజరాజేశ్వరి
ప్రతిష్టించినది: అత్రిమహాముని
విష్ణ్వాలయం: సిద్ధి జనార్ధన స్వామి
గ్రామ దేవత: ముత్యాలమ్మ
శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయా సోమేశ్వర లింగము - పావన గౌతమీ నదీ తీరాన ఉన్న ఈ ఆలయం అష్ట సోమేశ్వర ఆలయాలలో దక్షిణ క్షేత్రంగా ప్రతితీ.
ధనిష్ట, శతభిషం నక్షత్రాలలో జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం కోటిపల్లి - సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు.
4. నైరుతి దిక్కు
ఊరు: కోరుమిల్లి
మండలం: కపిలేశ్వరపురం
స్వామివారు: సోమేశ్వర స్వామి
అమ్మవారు: రాజరాజేశ్వరి దేవి
ప్రతిష్టించినది: భరద్వాజ మహర్షి
విష్ణ్వాలయం: జనార్ధన స్వామి
గ్రామ దేవతలు: దోర్లమ్మ
శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర లింగము - సోమేశ్వర స్వామి గొప్ప మహిమ గలవానిగా, నిత్యాభిషేకములతో విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్తవత్సలుడైనాడు. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి.
ధనుస్సురాశి, పుర్వాషాడ నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం కోరుమిల్లి - సోమేశ్వర లింగము నకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు.
5. పడమర దిక్కు:
ఊరు: వెంటూరు
మండలం: రాయవరం
స్వామివారు: ఉమా సోమేశ్వర స్వామి
అమ్మవారు: పార్వతీదేవి
ప్రతిష్టించినది: విశ్వామిత్రుడు
విష్ణ్వాలయం: కేశవ స్వామి
గ్రామ దేవతలు: మారెమ్మ
శ్రీ పార్వతి సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం.
తులారాశి, స్వాతి నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం వెంటూరు - సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు.
6. వాయువ్య దిక్కు:
ఊరు: సోమేశ్వరం
మండలం: రాయవరం
స్వామివారు: సోమేశ్వర స్వామి
అమ్మవారు: బాలా త్రిపుర సుందరి
ప్రతిష్టించినది: గౌతముడు
విష్ణ్వాలయం: వేణుగోపాల స్వామి
గ్రామ దేవతలు: బూరులమ్మ , బంతి బాపనమ్మ
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర లింగము (వాయువ్యం క్షేత్రం) - ఇచ్చట సోముడు (చంద్రుడు) ఒక మండల కాలము తపస్సు చేసి, ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి ఆరాధించాడు. ఆ కారణముగా క్షేత్రం సోమేశ్వరంగా ఖ్యాతి పొందినది.
కన్యారాశి, హస్త నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం సోమేశ్వరం - సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు.
7. ఉత్తర దిక్కు:
ఊరు: వెల్ల
మండలం: రామచంద్రపురం
స్వామివారు: సోమేశ్వర స్వామి
అమ్మవారు: బాలా త్రిపుర సుందరి
ప్రతిష్టించినది: వశిష్ఠుడు
విష్ణ్వాలయం: వేణుగోపాల స్వామి
గ్రామ దేవతలు: పోలేరమ్మ
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర లింగము (ఉత్తరం క్షేత్రం). ఈ గ్రామంలో శ్రీ సోమేశ్వరాలయం మరియు శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం ఒకే ప్రాంగణములో ఉంటాయి. స్ధానికులు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వరాలయమును పెద్ద దేవుడు గుడిగా పిలుస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం.
కర్కాటక రాశి & సింహ రాశి నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం వెల్ల - సోమేశ్వర లింగము నకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.
8. ఈశాన్య దిక్కు:
ఊరు: పెనుమళ్ళ
మండలం: కాజులూరు
స్వామివారు: రాజ సోమేశ్వర స్వామి
అమ్మవారు: పార్వతి దేవి
ప్రతిష్టించినది: జమదగ్ని
విష్ణ్వాలయం: రామ మందిరం
గ్రామ దేవతలు: పణుగుదాలమ్మ
శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర లింగము (ఈశాన్య క్షేత్రం) ఈ ఆలయంనందు నిత్యం శ్రీ సోమేశ్వర లింగమునకు అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. వీటితో పాటు గ్రహ అభిషేక శాంతులు నిర్వహించుతారు.
మిధునరాశి, ఆరుద్ర నక్షత్రం నందు జన్మించిన వారి నక్షత్ర దోష ఉపశమనం కోసం పెనుమళ్ళ - సోమేశ్వర లింగమునకు అభిషేక శాంతులు నిర్వహిస్తారు.
Tags: అష్ట సోమేశ్వర క్షేత్రాలు, Ashta Someshwara Temples, Draksharamam, Ashta Someswaras, Draksharama Temple, Someswara Swamy temple, Ashta someshwara temples in telugu