Arunachalam Giri Pradakshina - గౌతముడు పార్వతిదేవికి వివరించిన అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యం

అరుణాచల మహాత్మ్యం - గౌతముని పూర్వగాథ &  గిరి ప్రదక్షిణ మహాత్యం..

గౌతమ మహర్షి తల్లి పార్వతితో ఇట్లు చెప్పెను . పరమశివుని ఆజ్ఞ ఒకసారి కైలాసములో నాకు ప్రాప్తించినది . అదేమనగా తీర్థయాత్రలు చేయమని . శివాజ్ఞ నెరవేర్చుటకై నేను అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించితిని.

అనేక శివక్షేత్రములు దర్శించితిని . కొన్ని స్వయంభు లింగములను కూడా దర్శించితిని . శివ స్మరణతో భూమండలమంతా తిరిగి తిరిగి ఈ అరుణాద్రి లింగమును చేరుకుంటిని . ఇక్కడ సేవించు మహాపురుషులను చూచి నా తపము ఫలించెనని పర్వత రూపమున నిలిచిన ఈ లింగము మరెక్కడ లేదని గ్రహించితిని.

శివుని స్తుతించితిని . నా ప్రార్థనను విని పరమశివుడు ప్రసన్నుడై దర్శనమిచ్చి అనునిత్యము నన్ను ఈ అరుణాద్రి సన్నిధియందే ఉండి అర్చించి తపమాచరించి శివ మహాత్మ్యమును సర్వజీవులకును తెలియచేయుమని పరమేశ్వరుడు ఆనతినిచ్చెను . కావున ఈ అరుణాచలములో కనిపించే గిరి మామూలు కొండకాదు.

సాక్షాత్తు పరమశివుడు పర్వత రూపముగా నిలిచిన లింగము అని ఎరుంగవలెను . ఆనాటి నుండి గౌతమ మహర్షి శివుని ఆజ్ఞను మరువక అరుణాద్రిని విడువక అక్కడే నివశించుచుండెను.

అంత గౌరీదేవి గౌతముని పూర్వగాధ విని అరుణాచలగిరి ప్రదక్షిణ మహాత్మ్యమును తెలుపమని కోరెను . గౌతముడిట్లు చెప్పెను . పరమేశ్వరుడు నాకిట్లు ఆనతిచ్చెను.

1. నా గిరి ప్రదక్షిణ మాత్రమున సర్వ పుణ్యతీర్ధములలో స్నానము చేసిన ఫలితము కల్గును.

2. అరుణగిరి ప్రదక్షిణముచే అన్ని శాస్త్రముల పారంగతత్వము లభించును.

3.  సమస్త యజ్ఞకర్మముల ఫలితము దక్కును.

4. మానసిక వాక్కు శారీరక సంబంధించిన పాపములు నశించును.

5. అరుణగిరి చుట్టు ఎందరో సిద్ధులు , దేవతలు మరియు మహర్షుల ఆశ్రమములున్నవి.

6. ఈ గిరి అగ్నిమయమని దానిలోపల గుహ ఉన్నదని తెలిసికొనుము.

7. ప్రదక్షిణ చేయునపుడు ధ్యానించుకొనుచు మెల్లగా ప్రదక్షిణ చేయవలెను.

8.  ఎవరి చేయిని పట్టుకొనక నిండు గర్భవతివలె అడుగులో అడుగువేస్తూ ప్రదక్షిణ చేయవలెను.

9 . అడుగుల చప్పుడు కూడా వినపడరాదు.

10. దారిలో నడుచుచున్నప్పుడు మనువులు , దేవతలు , సిద్ధులు మొదలగువారు నడుచురుని గుర్తించి వారి దారికి అడ్డురాక నడువవలెను.

11. శివ నామ సంకీర్తనము చేయవలెను.

12. దారిలో బీదలకు దానము చేయవలెను.

13. నడుచువారి బాధ్యతను నేనే ( శివుడు ) చూచుకొందును.

14. అరుణగిరి ప్రదక్షిణ చేయువారి పాదములను మోయుటకు అనేక దేవతల వాహనములు పోటీపడును.

15. ప్రదక్షిణ చేసిన వారికి శివప్రాప్తి కల్గును.

16. ప్రదక్షిణ చేసినవారికి తక్షణమే వారి శరీరము వజ్ర శరీరమైపోవును.

17. ప్రదక్షిణ చేయువారికి వారు ఎంత భక్తి ప్రపత్తులతో చేయుచున్నారో అని దేవతలు అదృశ్యరూపులై గమనించుచుందురు.

18. సోమవారం ప్రదక్షిణ అజరామరత్వమిచ్చును.

19. మంగళవారం ప్రదక్షిణ సార్వభౌమత్వము నిచ్చును.

20. బుధవారము పాండిత్యమొసంగును.

21. గురువారం గురుత్వమును సంపాదించును.

22. శుక్రవారము విష్ణు పదమును పొందించును.

23. శనివారం గ్రహపీడ వదిలి జయము ప్రాప్తించును.

24. ప్రదక్షిణ చేయువారు పాదములకు దెబ్బ తగిలి రక్తము కారినచో దేవేంద్రుడు ధరించు మందార పువ్వు పొడిచే ఆ రక్తము తుడువబడును.

25. రాళ్ళు తగిలి నొప్పి కల్గిన మహాలక్ష్మి శరీరముపై పూయబడు కుంకుమ లేపనముతో తొలగింపబడును.

26. ప్రదక్షిణము చేయువారు స్వర్గములో మణిపర్వత శృంగములపై విహరించి కల్పవృక్షచ్ఛాయలో విశ్రమింతురు.

పై విధముగా గౌతముడు ఆ పరమేశ్వరుడు తనకిచ్చిన ఆనతిచే పార్వతీదేవికి ఆ అరుణాచల గిరి ప్రదక్షిణ మహాత్మ్యమును వివరించెను.

 అరుణాచలశివ.. అరుణాచలశివ... అరుణాచలశివ...స్వస్తి..

Tags: Arunachalam Giri Pradakshina route map, Arunachalam Giri Pradakshina dates 2024, Arunachalam Giri Pradakshina distance, Arunachalam giri pradakshina in telugu, Arunachalam Giri Pradakshina benefits, Arunachalam giri pradakshina benefits in telugu, Arunachalam Giri Pradakshina timings, Arunachalam Giri Pradakshina distance and time

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS