కపిలగోవు విశిష్ఠతను ధర్మరాజుకు వివరిస్తూ భీష్ముడు..What is the importance of Kapila cow?

కపిల గోవు విశిష్ఠత:

మహాభారతం ఇలా చెప్తోంది..

ధర్మరాజు పితామహా ! కపిలగోవు విశిష్ఠత తెలపండి అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా ! పూర్వము దేవతలకు ఆకలి వేసింది. వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతము సేవించారు. ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది.

కామధేనువు నుండి మరి కొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్ని హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లిదగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూసాడు. ఆ ఆవులన్ని ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్ని బెదిరి తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి మహేశా ! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా ! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా ! అది ఎంగిలి ఎలా ఔతుంది ! గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా ! దీనికి ఆగ్రహిస్తే ఎలా ! వాటిని కరుణించు అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు బ్రహ్మదేవా ! ఈ గోవులన్ని నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్ఠమై నవిగా భావించబడతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిలగోవులనబడే ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితి అయింది అని భీష్ముడు చెప్పాడు.

కపిల గోవు మహిమ:

శుకుడు తన తండ్రి అయిన వ్యాసుడితో తండ్రి గారూ ! కపిలగోవులకు అంత మాహాత్మ్యము ఎలా వచ్చింది అని అడిగాడు. వ్యాసుడు ఒకసారి దేవతల సంఘానికి కనపడకుండా తనను దాచమని అగ్నిదేవుడు గోవులను వేడుకున్నాడు. అలాగే అని గోవులు అగ్నిదేవుడిని దాచి పెట్టాయి. దేవతలు అగ్ని దేవుడిని వెతుకుతూ చివరకు ఆవుల వద్ద ఉన్నాడని తెలుసుకుని గోవులారా ! అగ్నిదేవుడిని దాచడం లోకములకు మంచిది కాదు. కనుక అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగారు. ఆవులు వారిమాట మన్నించి అగ్నిదేవుడు దాగి ఉన్నచోటు చూపాయి. దేవతలు అగ్నిదేవుడితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని అడిగారు. అగ్నదేవుడు తాను దాగి ఉన్న కారణంగా వాటికి ఎర్రరంగు వస్తుంది అని వరమిచ్చాడు. పైగా ఆవులలో ఎర్రటి ఆవులు శ్రేష్టమైనవని వాటిని పూజించిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. కపిలగోవును దానం ఇచ్చిన వాడు పుచ్చుకున్న వాడు కూడా పుణ్యలోకాలకు పోతారని వరమిచ్చాడు.

కపిల గోవు లక్షణములు:

శుకుడు తండ్రీ ! కపిలగోవు లక్షణము ఏమిటో వివరించండి అని అడిగాడు. వ్యాసుడు కుమారా ! సాధారణంగా కపిల గోవులకు చెవులు, ముక్కు, కళ్ళు, కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్ప వలసిన అవసరం లేదు. కపిల గోవు మీద బరువు వెయ్యరాదు. దానిని హింసించ రాదు. దానిని బలికి ఉపయోగించ రాదు. కపిలగోవును కాలితోకాని చేతితోకాని గోటితోకాని కర్రతోకాని కొట్టిన వాడు నరకానికి పోతాడు. కపిల గోవుకు వేళకు మేత నీరు పెట్టినవాడు సద్గతికి పొందుతాడు. గోవులతో పాటు, బ్రాహ్మణులు, గాయత్రీమాత, వసంతకాలము, సత్యము, బంగారము పుట్టాయని పెద్దలు చెప్తారు. దానము ఇవ్వ తగిన వస్తువులలో ఆవులు, బంగారము, భూమి శ్రేష్టమైనవి అని వ్యాసుడు తన కుమారుడైన శుకుడికి వివరించాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

Tags: కపిల గోవు, Kapila Cow, కపిల ఆవు, Kapila cow story, Original Kapila cow, Kapila cow images, Kapila Cow Visishta, Cow, Kapila Avu, Kapila Cow Story telugu, Kapila Cow Pooja

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS