తిరుమలలో తలనీలాలు ఎందుకు ఇస్తారు? తలనీలాలు ఇచ్చే ప్రాంతాన్ని కళ్యాణ కట్ట అని ఎందుకంటారు..Tirumala Kalyanakatta

తిరుమలలో తలనీలాలు ఎందుకు ఇస్తారు. తలనీలాలు ఇచ్చే ప్రాంతాన్ని కళ్యాణ కట్ట అని ఎందుకంటారు..

శ్రీవారి పాదాల చెంత ఉండే ప్రసిద్ధ నది స్వర్ణముఖి. ఈ నదికి సంబంధించిన పురాణాలు, ఐతిహాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే స్వర్ణముఖి నదికి చరిత్రలో ఎంతో గొప్ప స్థానం ఉంది. స్వర్ణముఖి నదికి ఉపనది కల్యాణి నది. కల్యాణి నది ఒడ్డున శ్రీనివాస మంగాపురం ఆలయం వుంది.

పూర్వం తిరుమలకు సామూహికంగా మాత్రమే భక్తులు వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కళ్యాణీ నదీ తీరంలో కళ్యాణ కట్టలు వెలిశాయి. యాత్రికులు తమ తలనీలాలను ఈ కళ్యాణకట్టలోనే సమర్పించి కళ్యాణీ నదిలో స్నానం చేసి కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకునేవారు. కళ్యాణీ నదీ తీరంలో మంగలికట్టలు వెలిశాయి కాబట్టి వారికి కళ్యాణకట్టలు అనే పేరు వచ్చింది. తిరుమలలో మంగలి కట్టలు వెలిశాక శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ కట్టలు అంతరించాయి. అందుకే తిరుమలలోని మంగలి కట్టలకు కళ్యాణ కట్టలు అనే పేరు స్థిరపడింపోయింది.

నీలాద్రి కొండ మీద క్రూర జంతువుల సంచారం ఎక్కువగా వుండడం వల్ల తనకు చాలా యిబ్బందిగా ఉందని నీలాదేవి శ్రీనివాసుకి మొరపెట్టుకుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న స్వామివారి సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా స్వామివారి నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది.

అంతటి మనోహర రూపానికి అతి పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. వెంటనే తన నొసటిపై ఉన్న వెంట్రుకలను శ్రీవారికి అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసుడు మేల్కొని చూడగా నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుంది. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చి భక్తులు తమ తలలాలను సమర్పిస్తారని, అవి నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడట.

ఇదే కాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి..

వేంకటేశ్వరుడు బీబీనాంచారీని పెళ్ళి చేసుకొనేటప్పుడు ఆమెకొక వరం ఇచ్చాడట. ఎగువ తిరుపతికి జుట్టుతో వచ్చేవాళ్ళు తనవారని, గుండు చేయించుకున్నాక ముస్లీంలాగా తిరిగి వెళ్ళే వాళ్ళు నీవాళ్ళని ప్రేమపూర్వకంగా మాటిచ్చాడట.

తలకు ప్రధానమైనవి కురులు. కురులను సమర్పిస్తే దేవునికి తలను సమర్పించిన దానితో సమానం.

జానపద విజ్ఞానం ప్రకారం చూస్తే తల వెంట్రుకలు ఎవరికైనా అపూర్వం. తల వెంట్రుకల మీద ఎన్నో జానపద కథలు ఉన్నాయి. మనిషి అందానికి ప్రతీక తల వెంట్రుకలు. తల వెంట్రుకల సౌదర్యం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే విధానం జానపదుల్లో కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలను సంపదతో పోల్చి కేశసంపద అని అంటారు. ఆరోజుల్లో ఎంత పొడవు కురులు ఉంటే అంత విలువ ఉండేది. అందుకే ఆ రోజుల్లో మగవాళ్ళు కూడా జుట్టు పెంచి, పూలను అలంకరించుకునేవాళ్ళు.

మనిషి కురుల మీద చూపించే మమకారం మరి దేనిమీదా చూపించడు. అద్దంలో చూసుకున్నా కురులనే చూసుకుంటారు. అంత విలువైన వెలకట్టలేని కురులను శ్రీవారి మీద భక్తితో వాటిని తృణప్రాయంగా భావించి స్వామివారికి సమర్పించడం గొప్ప విషయం.

Tags: తలనీలాలు, తిరుమల, Kalyanakatta, Talaneelalu, Gundu, Kalyanakatta thirumala, Kalyanakatta, Gundu Ladies, Talaneelalu Telugu, Hair Cut

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS