Tholi Ekadashi: తొలి ఏకాదశి ఎప్పుడో మీకు తెలుసా? జూలై 16 లేదా 17న? ఆ రోజున ఈ పనులు అస్సలు చేయొద్దు!

పంచమి, సప్తమి, దశమి తిథుల్లానే ఏకాదశి చాలా పవిత్రమైంది. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అంటూ నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి 24సార్లు వస్తుంది. అధికమాసం వస్తే మరో రెండుసార్లు కలిపి 26సార్లు వస్తుంది. వీటిలో తొలి ఏకాదశి మహా విశిష్టమైంది. మరి ఇంతటి విశిష్టమైన తొలి ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం..

ఆషాఢ మాసంలో తొలి ఏకాదశినే.. దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభ కార్యాలని నిర్వహించరు. ఈ 4 నెలలలో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు. దేవశయని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజుకి  జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. జైనులకు కూడా  చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే  ఈ రోజు నుంచి సాధువులు కూడా నాలుగు నెలల పాటు ప్రయాణం చేయరు. ఒకే చోట ఉండి దేవుడిని పూజిస్తారు.

హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలోని కృష్ణ , శుక్ల పక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. అంతేకాదు శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకం ఉంది. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢమాసంలోని ఏకాదశి రోజున  శ్రీ హరి యోగనిద్రకు వెళ్లాడని..  కార్తీకమాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు తొలి ఏకాదశి నుంచి హిందువుల పండగలు ప్రారంభం అవుతాయని విశ్వాసం.

తొలి ఏకాదశి 2024 ఎప్పుడంటే: హిందూ పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జులై 16వ తేదీ మంగళవారం రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై.. జులై 17వ తేదీ బుధవారం రాత్రి 09:02 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం.. ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జులై 17న జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, నియమ నిష్ఠలతో విష్ణువుతోపాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.

తొలి ఏకాదశి రోజు చేయాల్సిన పనులు:

  • తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.
  • పూజా మందిరాన్ని అలంకరించి శ్రీమహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.
  • ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి.. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది.
  • శ్రీ హరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి.
  • పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు:

  • ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంటే మద్య, మాంసాలకు దూరంగా ఉండాలి.
  • ఆ రోజున అన్నం తినకూడదు.
  • స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు.
  • బ్రహ్మచర్యం పాటించాలి.
  • మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు.
  • ఉపవాసం ఉన్న వ్యక్తి.. ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు.
  • గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు.

Tags: తొలి ఏకాదశి, Tholi Ekadashi, Toli Ekadashi Date, Toli Ekadashi Muhurtham, Toli Ekadashi Telugu, Toli Ekadashi 2024 Date, Toli Ekadashi 2024, Toli Ekadashi Importance

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS