ఉజ్జయిని మొదటిసారి వెళ్ళాలనుకునేవారికోసం - Ujjaini Mahakaleswar Temple Guide

ujjaini


ఉజ్జయిని మొదటిసారి వెళ్ళాలనుకునేవారికోసం

పూర్తిగా చదవండి చక్కగా యాత్ర పరిపూర్ణం చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందండి.

ఈశ్వరానుగ్రహం ఉంటే గానీ వెళ్లలేని క్షేత్రాలలో అతి ముఖ్యమైన క్షేత్రం ఉజ్జయిని..

జ్యోతిర్లింగమూ, శక్తిపీఠమూ  కలిసిన క్షేత్రాలు కేవలం మూడు ఉన్నాయి. అవి :  కాశీ , శ్రీశైలం ,ఉజ్జయిని ..

 ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగము మరియు అష్టాదశ శక్తి పీఠాలలో మహాకాళీ శక్తిపీఠమ్ కొలువై ఉన్న క్షేత్రం ఉజ్జయిని.. ఉజ్జయిని లో మహాదేవుడు మహాకాళేశ్వరుడిగా కొలువై ఉన్నాడు.. అమ్మవారు మహాకాళిగా కొలువై ఉన్నారు..

మహాకాళ జ్యోతిర్లింగ దర్శనం వివరాలు

మహాకాళేశ్వరుని దర్శనానికి వెళ్ళాలి అనుకునేవారు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకోవాలి.. ఆటో లు , కార్ లు ఆలయ ప్రాంగణానికి అరకిలోమీటర్ ముందే ఆపేస్తారు.. అక్కడి నుంచి కాలి నడకన భక్తులు క్యూలైన్ దాకా నడవాల్సి ఉంటుంది. ఫ్రీ దర్శనం క్యూ లైన్ వేరు , టిక్కెట్ దర్శనం క్యూలైన్ వేరు.. మీరు గనక ఒక్కసారి ఫ్రీ లైన్ లోకి వెళ్తే , టికెట్లు కొందాం అనుకున్న దొరకవు. కాబట్టి ఏ దర్శనాని కి వెళ్ళాలో ముందుగానే నిర్ణయం తీసుకోండి. ఉచిత దర్శనం  2 ,3  గంటలు పట్టింది మే నెలలో మేం వెళ్ళినప్పుడు.. ఉచిత దర్శనానికి చాలా ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది..  దర్శన ప్రవేశ మార్గం అని  బోర్డులు ఉంటాయి. ఆ ప్రకారం వెళ్ళాలి..

టిక్కెట్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే , 4 వ నెంబర్ గేటు వైపు వెళ్లాల్సి ఉంటుంది. సెల్ ఫోన్ పాయింట్ , చెప్పులు పెట్టుకునే పాయింట్ అన్నీ ఆ గేట్ దగ్గర ఉంటాయి.. టిక్కెట్ అయితే మనిషికి 250 rs.. 10 ఏళ్ళు లోపు పిల్లలకి టికెట్ ఉండదు.. 10 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు  250 టికెట్ తీసుకోవలసిందే.. అరగంట లోపే దర్శనం అయిపోతుంది.. సీనియర్ సిటీజన్స్ , వికలాంగులకు కూడా టికెట్ తీసేసుకుంటే , వీల్ చైర్ సదుపాయం ఉంది.. వాళ్ళే వీల్ చైర్ లో దర్శనానికి తీసుకెళ్లి , దర్శనం చేయించి , బయట మార్గం దగ్గర వరకు విడిచిపెడతారు..

ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ..మహాకాళ లింగాన్ని భక్తులు తాకేందుకు అవకాశం ఉండదు.. ఎవరయినా గర్భాలయానికి ముందు నుంచుని దర్శనం చేసుకోవాల్సిందే.. ఫోను అనుమతిస్తారు.. మహాకాళ జ్యోతిర్లింగాన్ని మనం ఫోటో  కూడా తీసుకోవచ్చు..

ఉజ్జయిని మహాకాళీ శక్తిపీఠము దర్శన వివరాలు

ఇప్పుడు మహాకాళీ శక్తిపీఠము దర్శనానికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం.. అక్కడ అమ్మవారిని గడ్ కాళీ అని పిలుస్తారు.. మహాకాళేశ్వర దేవాలయం నుంచి అమ్మవారి దేవాలయం 4.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో లో చేరుకోవచ్చు.. అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక టికెట్స్ ఉండవు.. చాలా చిన్న దేవాలయం.. గుడిముందే ఆటో అగుతుంది. విశేషమైన రోజుల్లో తప్ప , మిగతా రోజుల్లో 10 నిముషాల్లోనే  త్వరగా దర్శనం అయిపోతుంది. ఇక్కడ కూడా అమ్మవారిని ఫోటో తీసుకోవచ్చు.. అమ్మవారి గుడి చుట్టూ భక్తులు  ప్రదక్షిణ చేస్తూ ఉంటారు..

ఉజ్జయిని మంగళనాథ్ దేవాలయం

మంగళనాథ్ అంటే మంగళగ్రహం అన్నమాట. మంగళ గ్రహాన్ని అంగారకుడు ,కుజుడు అని కూడా పిలుస్తారు. పృధివీ గర్భం నుంచి మంగళగ్రహం ఉద్భవించిన ప్రదేశం గా చెబుతారు. ఈ సృష్టిలోనే ఉన్న ఏకైక దేవాలయం గా పురాణాలు అభివర్ణిస్తున్నాయి.. కుజుడు తపస్సు చేసి ప్రతిష్టించిన శివలింగం దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడి క్షిప్రా నదీ తీరంలో ఉంటుంది.. మొదటి అంతస్తులో కుజదోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయి.. రెండవ అంతస్తులో మనగళనాథ్ ని దర్శనం చేసుకోవాలి.. మెట్లు ఎక్కవలసి ఉంటుంది.. 

ప్రత్యేక టిక్కెట్ దర్శనం ఉండదు.. సర్వదర్శనం క్యూలైన్ లో వెళ్లే , దర్శించాలి. మంగళవారం , ఆదివారం ఈ దేవాలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. మిగతా రోజుల్లో చాలా సులభంగా దర్శించచ్చు.. మేము ఆదివారం దర్శించాము.. 40 నిముషాలు సమయం పట్టింది..

ఈ దేవాలయ ప్రాంగణం లోనే ఒక చెట్టు కింద పార్వతీ దేవి కుమారస్వామికి ఒక వట వృక్షం కింద అన్నం తినిపించిందని పురాణ కథనం. ఆ చెట్టును మనం ఇప్పటికీ దర్శించచ్చు.. అమ్మవారి ముఖరూపం చెట్టు మొదట్లో దర్శించచ్చు..

దర్శనం అయిపోయాక , డ్రింకింగ్ వాటర్ జోన్ ఉంటుంది. అక్కడ భక్తులు విశ్రాంతి గా కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేశారు.. ఓ వైపు  నదీ తీరం , నదికి అటుపక్కన ఒక బ్రిడ్జి , ఇటు పక్కన ఒక బ్రిడ్జి.. వాటి  మీద వాహనాలు వెళుతూ , మధ్యలో నది.. పుణ్య స్నానం చేసేందుకు వీలుగా ఘాట్ ... ఘాట్ లో చిన్న శివాలయం... ఇవన్నీ అక్కడ కూర్చుని చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది.. ఆ వ్యూ పాయింట్.. మంగళనాథ్ దర్శనం చేసుకుని , కాసేపు విశ్రాంతి గా ఈ వ్యూ పాయింట్ ని కూడా చూసేలా సమయం కేటాయించుకుని వెళ్ళండి..

సాందీపని ఆశ్రమమ్

శ్రీకృష్ణ పరమాత్మ గురువుగారైన సాందీపుడు ఉజ్జయిని ఉండే ఆశ్రమం కాబట్టి , సాందీపని ఆశ్రమం అంటారు.. ఇక్కడ శ్రీకృష్ణుడు , బలరాముడు , సుధాముడు కలిసి , సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేసిన ప్రదేశం లోనే చిన్న ఆలయాన్ని నిర్మించారు.. చుట్టూ చిన్న ఉపాలయాలు , ఒక శివాలయం కూడా ఉంటాయి.. ఇవన్నీ దర్శించాక , కాస్త ముందుకు వెడితే , ఉద్యానవనం కూడా ఉంటుంది.. చాలా అద్భుతంగా ఉంటుంది సాయంత్రం పూట సాందీపని ఆశ్రమం లోని ఉద్యానవనం.. నడిచే శక్తి ఉన్నవారు చక్కగా ఉద్యానవనం చుట్టూ తిరిగి చూసి రావచ్చు.. పెద్దవారు  మాత్రం మెయిన్ టెంపుల్ చూసి , వెనుతిరుగుతూ ఉండటం గమనించాము..

ఉజ్జయిని కాలభైరవుడు

భారతదేశంలో ఎన్నో  కాలభైరవ దేవాలయాలు ఉన్నా , ఉజ్జయిని లోని కాలభైరవుడు చాలా ప్రత్యేకం అని చెబుతారు.. ఇక్కడ కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు.. దేవాలయం లోకి వెళ్లే మార్గం మొదట్లోనే మనకి మద్యం దుకాణాలు ఉంటాయి. అక్కడ కొనచ్చు.మంగళగిరి లో పానకాల నృసింహ స్వామి కి పానకం పోస్తే ,  తాగుతున్నట్టు ఎలా గుటక వినపడుతుందో.. అదేమాదిరి ఇక్కడ కాల భైరవుడు ముందు మద్యం ఉంచితే , మద్యం తాగుతున్నట్టు , పానీయం కదలడం మనం చూడచ్చు.. ఇదంతా గుడి ఖాళీగా ఉంటే , పండాజీ (పంతులు గారు) వివరంగా చెబుతూ చూపిస్తారు.. రద్దీగా ఉంటే , కేవలం దర్శించి వెనుతిరగడమే.. ఇక్కడే మీరొక ముఖ్య విషయం గుర్తు ఉంచుకోండి.  కాలభైరవుడు కి మద్యాన్ని కొందరు నైవేద్యంగా తీసుకువెళ్తారు. తప్పకుండా మద్యమే తీసుకువెళ్లాలని నియమం ఏమీ లేదు. మరికొందరు అక్కడ దుకాణంలో అమ్మే పూలసజ్జ కూడా తీసుకువెడతారు..  మద్యం సీసా తీసుకువెళ్లినప్పుడు దర్శనం చేసుకునే చోట ఉన్న పండాజీ కి ఆ బాటిల్ ని ఇస్తే , అక్కడున్న రాగి చెంబులో  స్వామికి నివేదన గా ఒక స్పూన్ మద్యం పోసి , మిగతాది ప్రసాదంగా వెనక్కి ఇచ్చేస్తారు.. ఆ ప్రసాదం ఇంటికి తీసుకెళ్లచ్చు అన్నమాట. ఎందుకు ఈ మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారంటే , పూర్వం భైరవుడు ఉగ్రంగా ఉండేవారట.. ఆయన్ని శాంతిoపజేయడం కోసం అలా ఇచ్చేవారట.. అది సంప్రదయంగా మారింది..

ఉజ్జయిని రామ్ ఘాట్

శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరథ మహారాజుకు ఉజ్జయిని లోని క్షిప్రనదీ తీరంలో పిండ ప్రదానం చేసి, పితృకార్యదోషనివారణ చేసుకున్నారట. ఆ ఘాట్ ని రామ్ ఘాట్ అంటారు. చుట్టూ ఇంకా చాలా ఘాట్లు ఉంటాయి.. పితృదోషనివారణ పూజ ఇక్కడ ప్రత్యేకం.  శ్రీరామాలయం తో పాటు , హనుమాలయం , ఎన్నో శివాలయాలు , చాలా చిన్న  యూపాలయాలు కూడా మనం అక్కడ చూడచ్చు..  నదిమీద ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది.. ఎంతో అద్భుతంగా ఉంటుంది సాయంత్రం పూట ఆ బ్రిడ్జ్.. 

నదీజలం మీద ఉండే ఆ బ్రిడ్జ్ మరియు పక్కనే వాటర్ ఫౌంటైన్ లు రామ్ ఘాట్ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి..

ఉజ్జయిని భర్తృహరి గుహలు

శుభాషితాలు రచించిన భర్తృహరి ఉజ్జయినిలోని గుహలలో తపస్సు చేసుకున్నారట. ఆ గుహలను భర్తృహరి గుహలు అని పిలుస్తారు..  ఆటో వారికి ప్రత్యేకంగా చెబితేనే ఇవి చూపిస్తారు..

ఉజ్జయిని చింతామణి గణపతి

ఉజ్జయినిలో ని చింతామణి గణపతి ప్రత్యేక దేవాలయం గా పురాణాలు చెబుతున్నాయి..

ప్రాచీన కాలంలో భగవంతున్ని చింత హరన్ అని పిలిచేవారట..

అంటే అన్ని చింతలను ఉద్రిక్తతలను  తొలగించేవాడు అని అర్థం..

విశ్వానికి రక్షకుడుగా ఉన్న విష్ణు యొక్క మరొక పదమే చింతామణి..

అటువంటి చింతలను తీర్చేటటువంటి గణపతి కాబట్టి చింతామణి గణపతి అని పిలుస్తారు. తమ తమ ఉద్రిక్తతలని, కష్టాలని తొలగించుకోవడానికి భక్తులు ఈ మందిరం ముందు కిటకిటలాడుతూ మనకు కనిపిస్తారు..

ఉజ్జయిని ప్లానిటోరియం*కూడా సందర్శనీయం 

ఇవండీ ఉజ్జయిని లోని చూడదగ్గ ప్రదేశాలు..

ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడి యొక్క భస్మహారతి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఉజ్జయినిలో మహాకాళ లింగానికి  భస్మహారతి జరుగుతూ ఉంటుంది. ఎంతో ప్రత్యేకమైన దర్శనం కూడానూ.. ఎందుకంటే ఆ భస్మం చితాభస్మం.  శవం ఉజ్జయిని లోని స్మశానంలో శవం కాలిన తరువాత అఘోరస్వామి ప్రత్యేక పూజ చేసి ,సేకరిస్తారు.. ఆ చితాభస్మం తోనే మహాకాళ జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తారు..

భస్మహారతి టికెట్స్ మనకి ఆన్లైన్ లో దొరుకుతాయి ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.అయితే మాకు మాత్రం రెండు నెలల ముందు నుంచి ప్రయత్నం చేసినా కూడా ఆన్లైన్లో దొరకలేదు..

అక్కడికి వెళ్లి కూడా మనము భస్మహారరతి టికెట్స్ తీసుకోవచ్చు.

అందుకోసము త్రివేణి గేట్ అని ఒక గేట్ ఉంటుంది...

మొత్తం దేవాలయంలో పది గేట్లు ఉంటాయి.

భస్మహారతి టికెట్స్ ఎక్కడ ఇస్తారు అంటే ఎవరైనా చెప్తారు.. మేం వెళ్ళినప్పుడు త్రివేణి గేట్ దగ్గరకు వెళ్లి నుంచోమన్నారు అక్కడ మనము రాత్రి 12 గంటల సమయంలో వెళ్లి నుంచుంటే ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో భస్మహారతి టికెట్లు అనేవి మనకు ఇస్తూ ఉంటారు..

మరి అర్ధరాత్రి నుంచి ఎందుకు నుంచోవాలి అంటే అంత మంది జనాలు ఉంటారన్నమా..

 కేవలము 100 టికెట్లు మాత్రమే ప్రతిరోజు భస్మహారతికి ఇస్తారు.

ఆ వంద మందిలో మనం ఉండాలి అంటే అంత త్వరగా వెళ్లి నుంచోవాలి అని అర్థం. ఒక్కొక్క టికెట్ మీద ఐదుగురు దర్శనం చేసుకోవచ్చు ఒక టికెట్ కేవలం 100 రూపాయలు.

ఒక టికెట్ మీద ఐదుగురు దర్శనం చేసుకోవచ్చు.. ఐదుగురు క్యూలో నుంచోనక్కర్లేదు.. 

ఒక్కరు నుంచుని, 100 రూపాయలు ఇచ్చి,  భస్మహారతి టిక్కెట్ సంపాదిస్తే ఐదుగురు దర్శనం చేసుకోవచ్చు.. 

మీరు 10 మంది ఉన్నారనుకోండి.. ఇద్దరు వెళ్లి రెండు టిక్కెట్స్ తెస్తే , సరిపోతుంది..

అర్ధమైంది కదా..

ఎప్పుడైతే నుంచున్నామో ఆ మరుసటి రోజుకి మనకు దర్శనం టికెట్లు లభిస్తాయి.

మన మొబైల్ నెంబర్ కి భస్మహారతి టికెట్ కన్ఫర్మ్ అయిందని మెసేజ్ వస్తుంది..

ఆ మెసేజ్ వస్తేనే మనం దర్శనానికి వెళ్ళాలి ..

లేదంటే హారతి సమయంలో లోనికి అనుమతించరు.. 

టిక్కెట్ కన్ఫర్మ్ అయ్యాక రాత్రి 11 గంటలకి క్యూలైన్ లో నుంచోవాలి.. 3.30 కి భస్మహారతి మొదలవుతుంది.. భస్మహారతి దర్శనం చేసుకుని తిరిగి రూమ్ కి వచ్చేసరికి ఉదయం 6.30 అవుతుంది.. 

కాబట్టి , భస్మహారతి దర్శనం కి వెళ్లిరోజు మధ్యాహ్నం  కాసేపు విశ్రాంతిగా నిద్ర పోయేలా ఏర్పాటు చేసుకొండి... తెల్లవార్లు క్యూలైన్ లో ఉండాలంటే ఈ మాత్రం ప్రిపేర్ అవ్వాలి..

ఇవి ఉజ్జయిని లో  చూడదగ్గ ప్రదేశాలు..

లోకల్ దేవాలయాలు అన్నీ చూడటానికి షేర్ ఆటో అయితే మనిషికి 150 rs , ఒక ఆటో మనకోసం మాట్లాడుకుంటే 500 తీసుకుంటారు.. అన్నీ వాళ్లే చూపిస్తారు..

ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసుకున్న తర్వాత ముఖ్యంగా కారిడార్ను సందర్శించండి కారిడార్ మొత్తం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహాకాళేశ్వర కారిడార్ అని పిలుస్తారు. దర్శనానికి వెళ్లే దారిలోనే మనకి ఈ  కారిడార్ కనపడుతుంది ..

క్యూలైన్లో వెళ్లేటప్పుడు ఎడమ చేతి వైపుకి వెళితే క్యూలైన్ , కుడి చేతి వైపుకి వస్తే కారిడార్ అనమాట..

ఒకసారి కాలిడార్లోకి ఎంట్రీ అయి, ఆల చూస్తూ.. వెళ్లడమే..  మనం మొత్తం కారిడార్ 2 కిలోమీరటర్ల దూరం విస్తరించి ఉంది.. ఎక్కడికక్కడ కూర్చోవడానికి వీలుగా సిమెంట్ బల్లలు కుర్చీలు ఏర్పాటు చేసి ఉంటాయి.. వృద్ధులకి వికలాంగులకి అక్కడ బ్యాటరీ కార్ సదుపాయం ఉంటుంది అందులో వెళ్లి వృద్ధులు సందర్శించి రావచ్చు మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా నడిచి తీరాల్సిందే మీరు కారుడారు చూడటం కోసం ప్రత్యేకించి ఒక రెండు మూడు గంటల సమయాన్ని సాయంత్రం పూట కేటాయించుకోండి ఎందుకంటే సాయంత్రం పూట క్షిప్రా నది తీరంలో ఉండే ఈ మహాకాళేశ్వర కారుడారు విద్యుత్ దీపాల అలంకరణలో మహాదేవుడి అతిపెద్ద విగ్రహము చుట్టూ ఫౌంటైన్లతో చాలా అద్భుతమైన ఆకర్షణగా ప్రధానాలయం దగ్గర మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా కారడాని దర్శించండి.

How to Reach Ujjain : 

Airway: Nearest airport is Indore (53 K.m.). Flights arriving from Mumbai, Delhi, Ahmedabad, Gwalior.


Railway: Ujjain is directly connected by railway line to Ahmedabad, Rajkot, Mumbai, Fouzabad, Lucknow,Dehradun, Delhi, Banaras, Kochin, Chennai, Bangalore,Vijayawada, Hyderabad, Jaipur, Howrah and many more.


Roadway: Ujjain is directly connected by road to Indore, Surat, Gwaliar, Pune, Mumbai, Ahmedabad, Jaipur, Udaypur, Nasik, Mathura.

విజయవాడ నుంచి ఉజ్జయిని ట్రైన్స్ వివరాలు :

విజయవాడ నుంచి గురువారం తప్పించి అన్ని రోజులు ట్రైన్ లు ఉన్నాయి. 

Jaipur SF Express :

వారం లో మూడు రోజులు ఉంటుంది , సోమవారం , బుధవారం , శనివారం. 

అర్ధరాత్రి 12:15 కు ఉంటుంది. కాబట్టి మీరు సోమవారం ప్రయాణం టికెట్  బుక్ చేస్తే ఆదివారం రాత్రి కి విజయవాడ లో ఉండాలి. 

ఆదివారం నాడు : Ahilya Nagari SF Express,  22646 Train Number ,  6AM కు ఉంది. 

మంగళవారం నాడు : Bhagat ki Kothi SF Express Train Number 22674 ఉదయం 3AM కు ఉంటుంది. 

శుక్రవారం నాడు : Anuvrat AC SF Express , Train Number 22631 , అర్ధరాత్రి 12:40 కి ఉంటుంది. 

మీకు ఏదైనా సమాచారం కావాలంటే మన హిందూ టెంపుల్స్ గైడ్ టీమ్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. మీరు వారికి కాల్ చేసే ముందుగా వాట్స్ యాప్ లో మెసేజ్ చేసి కాల్ చేయగలరు. 
Savitha garu : 9989188809

Tags: Ujjain Mahakaleshwar Jyotirlinga, Mahakaleshwar Temple, Mahakaleshwar Jyotirlinga Ujjain, Shri Mahakaleshwar Temple, Ujjain Temple Telugu, Ujjain Tour Details Telugu, Ujjain Temple Details Telugu, Ujjain Temple Timings

3 Comments

  1. ధన్యవాదాలు ఓం నమశ్శివాయ

    ReplyDelete
  2. ధన్యవాదాలు ఓం మహాకాళేశ్వరాయ నమః

    ReplyDelete
  3. దేవస్థానం రూం విషయాలు తెలియజేయలేదు

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS