అరుణాచల క్షేత్రమందు అన్నదాన మహిమ:
ఒకానొక సమయంలో బ్రహ్మమానస పుత్రుడైన సనక మహర్షి సత్య లోకమునకు వెళ్ళి పితృదేవుడైన బ్రహ్మతో ఇలా అన్నాడు: "ఓ సృష్టికర్తా! పరమదయాకరా! అరుణాచల క్షేత్రములో చేయబడే అన్నదానమునకు గల ఫలితమును దయతో నాకు తెలియచేయండి" అని విన్నవించగా, బ్రహ్మ "కుమారా! త్రిలోకములలో అన్నదానమునకు మించిన దానము లేదు. 'అన్నదో, ప్రాణదో నిత్యమన్నే ప్రాణః ప్రతిష్ఠితః' అని వేదవాక్కు. అందువలన ఆత్మలాభమును పొందగోరేవారు నిత్యము అన్నదానము చేయాలి. అరుణాచల క్షేత్రములో అన్నదానము చేయు మానవులకు సర్వకోరికలు తీరి సార్వభౌమ పదవిని పొందుతారు. అటువంటి అన్నదాన మహిమను వర్ణించుటకు నేను, విష్ణువు కూడా అశక్తులము.
పూర్వము ద్రావిడ దేశములో సింహధ్వజుడు అనే సూర్యవంశరాజు పరిపాలిస్తున్నాడు. అతడు నిత్యము బంగారము, వెండి, ముత్యములు, పగడములు, వజ్ర వైఢూర్యములు, పుష్యరాగం, నీలమణి, రత్నములతో నాగ రూపములను చేయించి బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడు. అతడు అన్నదానము తప్ప మిగిలిన అన్ని దానములను చేస్తున్నాడు. కాలక్రమములో అతడు మరణించి ఇంద్రలోకమునకు వెళ్ళాడు. ఇంద్రలోకములో నివసిస్తున్నా అతనికి అమృతమును త్రాగేందుకు అర్హత లేకపోవడంతో దేవతలకంటే కొంత తక్కువ స్థితిలో ఉన్నాడు.
ఒకనాడు దేవర్షి నారదుడు ఇంద్రలోకమునకు వెళ్ళినపుడు అక్కడ సింహధ్వజుని దీనావస్థను చూసి 'ఓ రాజా! నీవు భూమియందు సకల దానములను చేసావు. కానీ, సర్వశ్రేష్టమైన అన్నదానమును చేయలేదు. శివుని ప్రీతికై అన్నదానము తప్పక చేయాలి కదా! కర్మభూమియందు ఏ దానము చేస్తారో, దాని ఫలితమే స్వర్గలోకంలో అనుభవమునకు వచ్చును. అమృతమును కోరువారు తప్పక అన్నదానము చేయాలి' అన్నాడు.
నారదమహర్షి మాటలను విని దీనుడై సింహధ్వజుడు ఇలా అన్నాడు: 'ఓ మహర్షీ! అజ్ఞానము వలన నేను అన్నదానము చేయలేదు. ఇప్పుడు నాకేది దారి?' నారదుడు రాజుతో 'చింతింపవద్దు, తాను భూలోకమునకు వెళ్ళి సింహధ్వజుని పుత్రుడైన చిత్రకేతువుతో అన్నదానము చేయుస్తానని, దాని ఫలితముగా అతనికి అమృతపాన అర్హత కలుగున'ని చెప్పాడు. నారదుడు భూలోకములో చిత్రకేతువు వద్దకు వెళ్ళాడు.
చిత్రకేతువు నారదుని అర్ఘ్యపాద్యాదులతో బహు విధములుగా సత్కరించిన తరువాత నారదుడు అతనితో, 'ఓ రాజా! నీ తండ్రి స్వర్గంలో వుండి కూడా అమృతమును త్రాగేందుకు అర్హత కోల్పోయాడు. భూలోకములో అన్నదానము చేయనివానికి అమృతము లభించదు. కనుక నీవు నీ తండ్రికొరకు అన్నదానము చేసి అతనికి సద్గతి కల్పించుమ'ని చెప్పాడు. నారదుని మాటలతో చిత్రకేతువు అన్నదానము చేయడానికి సంకల్పించి, 'ఓ దేవరీ! నేను నా తండ్రి సద్గతికై అన్నదానమును తప్పక చేస్తాను. కానీ ఏ క్షేత్రములో ఒకే ఒక దినములో చేసిన అన్నదానము కోటిరెట్లు ఎక్కువ ఫలితమిచ్చునో, ఆ క్షేత్రమును గురించి తెలుపండి' అని అడిగాడు.
నారదుడు దివ్యదృష్టితో పరిశీలించి, 'ఓ చిత్రకేతూ! ఇతర ప్రదేశములలో లక్షలాది బ్రాహ్మణులకు అన్నదానము చేసిన ఫలము, కాశీలో ఒక్కరికి అన్నము పెడితే అదే ఫలితము కలుగును. కాశీలో పంచభక్ష్య పరమాన్నములతో, నేయితో భక్తిపూర్వకంగా కోటిమంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం
అరుణాచలములో ఒక్క బ్రాహ్మణునికి అన్నము పెట్టినందువలన కలుగును.
ద్వాదశినాడు చేసిన అన్నదానము ఒక్క సంవత్సరమంతా అన్నదానము చేసినదానితో సమానము' అని తెలిపాడు.
అరుణాచలంకి వెళ్ళి మనసులో నారదమహర్షికి నమస్కరించి చిత్రకేతువు అరుణగిరికి వెళ్ళి ప్రతిదినము, ప్రత్యేకించి ద్వాదశినాడు అన్నదానము చేస్తున్నాడు. పుత్రుడు ఇలా అన్నదానము చేస్తుండగా, ఇంద్రుడు బంగారు పాత్రతో అమృతమును తీసుకుని వచ్చి సింహధ్వజునికి త్రాగుటకు ఇచ్చాడు. సింహధ్వజుడు ఇంద్ర సన్నిధిలో బహుకాలము తృప్తిగా, ఆనందంగా నివసించి క్రమంగా బ్రహ్మలోకం, ఆ తర్వాత విష్ణులోకం, చివరకు శివలోకమునకు వెళ్ళి అనేక ప్రళయ కాలముల వరకు అక్కడే నివసించాడు. అందుచేత మానవులు అరుణగిరి నగరములో సర్వాభీష్ట సిద్ధి కొరకు; పుత్ర, మిత్ర, కళత్ర సంపదల కొరకు అన్నదానము చేయవలెను.
ఇది అరుణగిరియందు గల అన్నదాన మహిమ" అని బ్రహ్మదేవుడు సనక మహర్షికి ప్రీతిపూర్వకముగా తెలిపిన అరుణాచల మాహాత్మ్యము. బ్రహ్మనుండి అరుణగిరి మాహాత్మ్యమును విన్న సనక మహర్షి ఎంత విన్నా తృప్తి తీరక మరల మరల దానినే వినగోరాడు.
*ఇది శ్రీశైవ మహాపురాణమందు విద్యాసార సంహితయందలి అరుణాచల మాహాత్మ్యము.
Tags: Arunachalam, Arunachalam Temple, Annadanam, Giri Pradaskhina, Arunachalam Temple Annadanam, Tiruvannamalai, Tamil Nadu