తిరుమలకు ఉన్న ఏడు నడకదారులు మీకు తెలుసా? - Alternate Path to Walk to Tirumala

కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం మనం చాలా సౌకర్యవంతంగా వెల్ల గలుగుతున్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేని కాలంలో భక్తులు ఎలా వచ్చేవాళ్లు?

తిరుమల చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉండేవి?సాధారణంగా మనకు తెలిసినంత వరకు  అలిపిరి మెట్ల మార్గం ఒకటి శ్రీవారి మెట్టు మార్గం. ఈ రెండు మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా తిరుమల చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. అప్పుడప్పుడు కడప జిల్లా వాసులు గుంపులు గుంపులుగా మామండూరు ప్రాంతం నుంచి నడక మార్గం తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.

హిందువులకు ఉన్న పుణ్యక్షేత్రాలలో అతి మహిమ గలది కలియుగ వైకుంఠం తిరుమల.

ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. తిరుమలకు చేరుకోవాలంటే భక్తులు బస్సులను, ప్రైవేటు కార్లను, కాలి నడకన తిరుమలకు చేరుకుంటారు. అయితే ఎక్కువ మందికి తెలిసిన నడక దారి ఒకే ఒక్కటి అదే అలిపిరి.

అసలు తిరుమలకు ఎన్ని మార్గాలు ఉండేవి ఆ మార్గాలేవి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

శ్రీవారి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 7 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి.

1. ఆదిపడి లేదా అలిపిరి :

తాళ్ళపాక అన్నమాచార్యులు గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలములోని నరసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు. తాళ్ళపాక అన్నమాచార్య మొదటిసారి అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కాడు. క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు.

క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు.

మొదటినుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది. శ్రీవారి ఆలయం చేరుకోవడానికి దాదాపు ఏడెనిమిది నడక దారులున్నాయి. అందులో ప్రధానమైనది అలిపిరి మెట్లదారి.

అలిపిరి అంటే 'ఆదిపడి' అంటే మొదటి మెట్టు అని అర్థం .. ఇదే కాలక్రమంలో అలిపిరి అయింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు నడవాలి. క్రీ.శ. 1550లో విజయనగర రాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుడి గాలిగోపురం వరకు సోపాన మార్గం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి.

అలిపిరి నుండి మెట్లు దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. మాటల అనంతరాజు సోపానాలు నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు.

అలిపిరి దారిలో ఉండే మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ 1387లో ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. శాసనాల్లో కనిపించేది అలిపిరి దారి ఒక్కటే. ఈ దారి గుండా బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది రెండు అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయనస్వామి ఆలయం వస్తుంది. పడి మెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్ నిర్మింపబడిన పెద్ద గోపురం వస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు వస్తాయి. ఆ పాకి వెళ్తూనే గాలిగోపురం వస్తుంది.

అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ.శ1628లో నిర్మించారు. గాలిగోపురం నుండి క్రిందకు చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజుస్వామి, అలిమేలుమంగమ్మ దేవాలయ గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి.

గాలి గోపురం లోపలికి వెళ్తూనే మహంతులు పూజించే సీతారామలక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో ఉన్న విగ్రహం ఉంది. అటునుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ ఘంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు. అవ్వాచారి కోననుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది.

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వతుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. దూరం 11- 12 కి.మీ. లు ఉంటుంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగిస్తున్న దారి ఇదే.

2. శ్రీవారి మెట్టు :

తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడినుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్లు ఉంది. ఈ దారినుంది మూడు కిలోమీటర్లు నడిస్తే తిరుమల వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు. చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది.

చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శీవారి మెట్టుంది చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు.అలిపిరికన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు అయితే ఈ దారి గుండా యాత్రికులు వెళ్ళలేక పోతున్నారు, కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే.

శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనంకోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటినుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. ఈ దారి స్థానికులకు తప్ప బయటి ఊర్లో వారికీ అంతగా తెలియదు.

3. మామండూరు అడవి :

ఈ రెండు దారుల తరువాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. తిరుమల కొండకు ఈశాన్యం వైపున కాలినడకన వచ్చే మామండూరు దారికి మించిన దారి లేదు. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే యాత్రికులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది.

ఆనాడు విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వారు ఈ దారి మీదుగానే తిరుమల చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు రాళ్ళతో మెట్లను ఏర్పాటు చేశారు.

మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తర్వాత పాల సత్రం వస్తుంది. ఇంకొంచెం దూరం పొతే ఈతకాయల మండపం తరువాత పడమర వైపు కొంతదూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది.

1940లో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించాలనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు. తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారు.

అలిపిరి నుండి తూర్పు వేపుకు వెళ్ళే మొదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు నుండి వెళ్ళే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆనాటి టిటిడి బోర్డు సభ్యుడు టికెటి రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు.

తిరుమల నుండి మామండూరు వెళ్ళే నడక దారిలో పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకుల కొండ వస్తుంది. ఈ కాకుల కొండ మీదుగా వెళ్ళినా మామండూరు చేరుకోవచ్చు.

ఇప్పటికీ అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమల చేరుకుంటారు.

4. కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం, పాపవినాశనం మీదుగా:

కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కల దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడి నుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు.

పాపవినాశనం డ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలా దొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కలా దొడ్డి నుండి సెలయేటి గట్టు మీద ఎగుడుదిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం ఎంతో సునాయాసంగా చేరుకోవచ్చు.

తుంబుర లోయను నిట్టనిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది.

పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.పాపవినాశనం నుండి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.

5. రేణిగుంట నుంచి అవ్వచారి కోన దారి :

దీన్నే “అవ్వాచారి కోనదారి” అని అంటారు. ఈ అవ్వాచారి కొండమీద మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వస్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది.

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటునుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే తిరుమల శ్రీవారి ఆలయం వస్తుంది.

6. ఏనుగుల దారి :

ఇవేకాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్టు దారి నుండి అవ్వాచారి కోనవరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగులద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు.ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు.

7. తలకోన నుంచి :

తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గరనుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది.

తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టే దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు , ఉదాద్య మాణిక్యం, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు.

మునుపటి రోజుల్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి,కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం నీలిసాని పేట, గాజులమండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణపురం, నాగాలపురానికి మరోకదారి వుండేది.

ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని.

ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది.

నాగులాపురంలో వేదనారాయణ స్వామి ఆలయం ఉంది. అంటే ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు అనుసంధానం చేసిన దారులు ఉండేవి.

Tags: tirumala, ttd, tirupati, srivari mettu, alipiri steps, alipiri, srivari padalu, tirumala walking steps, tirumala news, tirumala update

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS