మీకు వివాహం ఆలస్యం అయితే ఈ క్షేత్రానికి దర్శించండి - Muramalla Temple History || Sri Veereswara Swamy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా గౌతమీ తీర గ్రామమైన మురముళ్ళలో పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఉండేవారట. అందుకనే ఈ ప్రాంతానికి ముని మండలి అనే పేరు వచ్చిందని కాలక్రమంలో మురమళ్ళగా మారిందని ప్రతీతి. ఈ గ్రామంలో ఉన్న శైవ క్షేత్రం ఓ చారిత్రక ప్రదేశం. ఇక్కడే వీరభద్రుడికి, భద్రకాళికి గాంధర్వ పద్దతిన వివాహం జరిగింది. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్వామివారిని దర్శించుకున్నవారికి వెంటనే కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసం..

పరమపవిత్ర పుణ్యక్షేత్రం వివాహం కానివారికి, వివాహం లో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారికి మురమళ్ళ మొక్కు పేరుతో స్వామి వారికి, అమ్మవారితో నిత్యం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగే కల్యాణం చేయించడం ద్వారా అదీ భక్తుల జన్మనక్షత్రం ప్రకారం ముందుగా ఆలయం నిర్ణయించిన తేదీకి జరిపిస్తే మొక్కుతీర్చిన భక్తుని లేదా భక్తురాలి వివాహం జరిగేందుకు తమ కృపను వర్షించి మొక్కును ఫలవంతం చేస్తూ వివాహం జరిగేందుకు అనుగ్రహాన్ని అందిస్తూ ఎందరో భక్తుల ఇతర కోరికలను సైతం తమ కల్యాణం తో విజయవంతం చేస్తున్న “నిత్య కళ్యాణం-పచ్చ తోరణం ” గా పేరొందిన శైవక్షేత్రం “శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి” దర్శనం శివసంకల్పం లో ఈరోజు..

మానవ వివాహ అడ్డంకులను తొలగించే స్వామి కల్యాణం.

వివాహయోగం లో ఉండే అపశృతులనుండి భక్తులకు విముక్తి.

ప్రతీరోజు సాయంత్రం ఏడు (7) గంటల నుండి స్వామివారి కల్యాణం.

గాంధర్వ విధానం లో ఆనాడు జరిగిన కల్యాణం నిత్యం కొనసాగిస్తూ …

వేద-గాన-వాద్య రీతిలో మూడు గంటలు సాగే కళ్యాణప్రక్రియ లో పాల్గొనడం కేవలం స్వామి సంకల్ప అనుగ్రహం మాత్రమే.

వివాహం కానీ యువతీ,యువకులు ముందుగా ఆలయం కు చరవాణి (ఫోన్) ద్వారా తమపేరు, పుట్టినతేదీ, నక్షత్రం తెలిపి నక్షత్ర ప్రకారం ఆలయం ఇచ్చే తేదీన స్వామి వారి కల్యాణం జరిపించడం ప్రస్తుతం ఉన్న విధానం.

ఈ నమోదు కు అంతర్జాలం (ఆన్ లైన్)లో కూడా అవకాశం ఉంది.

అనుకున్న తర్వాత సుమారు నెలరోజుల్లో తేదీ కేటాయించబడుతుంది.

రాత్రి కల్యాణం జరిపించే భక్తుల గోత్రనామాలుతో అదేరోజు ఉదయం అభిషేకంలో స్వామికి విన్నవిస్తారు.

వృద్ధ గౌతమి (గోదావరి) ఒడ్డున కొలువైన స్వామి.

ఒకే పీఠం పై లింగరూపం లో వీరేశ్వరస్వామి మరియు అమ్మ భద్రకాళి

“మురమళ్ళ” మొక్కు తప్పదు :

ఇది ఈశ్వర శాసనం.. భక్తుల అనుభవసారం అవివహితులుగా స్వామి కల్యాణం లో పాల్గొన్న ఎందరో ఏడాదిలోపు వివాహం జరిగి దంపతయుక్తంగా కల్యాణం లో పాల్గొనడం రెండు తెలుగురాష్ట్రాల లోనే కాదు భారతదేశవ్యాప్తంగా ఉన్న ఎందరికో జరిగిన నిదర్శనం..

మురమళ్ళ మొక్కు తప్పదు అంటే అనుకున్నది తప్పకుండా జరిగితీరుతుంది అని మరియు లక్ష్యం పై ఉంచిన గురి తప్పదు అని భక్తుల హృదయస్పందన.

మురమళ్ళ గురించి మరింత విస్తారంగా తెలుసుకుందాం :

ఎంత దూరం :

శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయం

హైదరాబాద్ నుండి 473 కి.మీ

రాజమండ్రి నుండి 85 కి.మీ

విజయవాడ నుండి 203 కి.మీ

కాకినాడ నుండి 35 కి.మీ

అమలపురం నుండి 22 కి.మీ

చెన్నై నుండి 654 కి.మీ.

దూరం లో ఉంది…

స్వామివారి కల్యాణం కోసం ఆలయ చరవాణి :

సేకరించిన సమాచారం ప్రకారం

కార్యాలయ ఫోన్:

08856-278424

08856-278136

ఈ నెంబర్ లలో సంప్రదించి తేదీ నిర్ణయించుకోవచ్చు… కల్యాణం మొక్కు కోసం

ఈ క్షేత్రం ప్రత్యేకత :

మన దేశంలో ఎన్నో ప్రత్యేకత కలిగిన ఆలయాలు ఉన్నాయి.

కొన్ని ఆలయాలకు వెళ్తే కొన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

కొన్ని దేవాలయాల్లో స్థలపురాణం ఒకటయితే స్వామివారు తీర్చిన కోరికలను బట్టి ఆయనకి కొత్తపేరు పెట్టిన క్షేత్రాలూ వున్నాయ్.

అలాంటి దివ్య శైవక్షేత్రం తూర్పుగోదావరిజిల్లాలోని మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామివారి దేవస్థానం..

అమ్మ, అయ్యకు కల్యాణంవిశిష్టత :

తూర్పుగోదావరిజిల్లాలోని మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామివారికి కల్యాణం జరిపిస్తే వివాహంలో జరగనున్న విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ఈ క్షేత్రంలోనే వీరభద్రునకు,భద్రకాళీ అమ్మవారికి వివాహం జరిగిందని స్థల పురాణం. *ఇక్కడ కళ్యాణం చేయించదలచినవారు ఆలయం వారికి ముందుగా ఫోన్ చేసి పేరు నమోదు చేయించుకోవాలి.

పేరు, పుట్టినతేదీ, వివరాలు తెలియచేస్తే భక్తులు ఎప్పుడు స్వామివారికి కళ్యాణం జరిపిస్తే మంచిదో దేవస్థానం వారే తారీఖు నిర్ణయిస్తారు.

ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణానికి ఇంకొక విశేషం వున్నది. తమ సంతానానికి వివాహం ఆలస్యమవుతున్నవారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేయిస్తే త్వరలో వారి సంతానం వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం.

దూరప్రాంతం నుంచి వస్తున్నవారైతే వసతిసౌకర్యం కూడా దేవాలయం దగ్గరలోనే వుంటుంది.

దక్షయజ్ఞం లో సతీదేవికి అవమానం మరియు ఆత్మాహుతి :

సతీదేవి పుట్టింట్లో తన తండ్రి దక్షుడు నిర్వహించే యజ్ఞం కు ఆహ్వానం లేకపోయినా వెళ్లడం పురాణ కధల ప్రకారం గుర్తుచేసుకుంటే దక్షుడు యజ్ఞం చేయటం, దానికి పరమశివుణ్ణి ఆహ్వానించకపోవటం, సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలనే ఆకాంక్షతో వెళ్ళటం, అక్కడ శివుడికి జరిగిన అవమానాన్ని సహించలేక యోగాగ్నిలో భస్మమవటం అందరికీ తెలిసిందే.

శివయ్య ఆగ్రహం- వీరభద్ర ఆవిర్భావం :

సతీదేవి భస్మమవటంతో కోపించిన శివుడు వీరభద్రుడుని సృష్టించి దక్షయజ్ఞ వినాశనానికి పంపుతాడు. ఆయననే ఇక్కడ వీరేశ్వరుడంటారు. ఆయన మహా భయంకర రూపందాల్చి దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు.

వీరభద్రుని ఆగ్రహం చల్లార్చే ప్రయత్నం:

తర్వాత దక్షుడు పశ్చాత్తాపపడటంతో ఆయనకి మేక తల అతికించి ఆ యజ్ఞాన్ని పరిపూర్తి చేస్తారు. కానీ సతీ దహనంవల్ల వీరేశ్వరుడు ఎంతకీ శాంతించడు.

ఆ భయంకర రూపాన్ని చూసి భయకంపితులైన మునులు, దేవతలు విష్ణుమూర్తిని వీరేశ్వరుడిని శాంతింపచేయమని ప్రార్ధిస్తారు.

నారసింహఅవతారం లో విష్ణుమూర్తి : నరసింహావతారంలో వీరేశ్వరుడ్ని శాంతింపచేయబోతాడు. కానీ వీరేశ్వరుడు శాంతించడు సరికదా నరసింహస్వామి నడుం పట్టుకుని వదలడు. దానితో నరసింహస్వామి తన నరసింహావతార లీలను అక్కడే వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళి అందరూ కలిసి ఆది పరాశక్తిని ప్రార్ధిస్తారు.

ఆదిపరాశక్తి షోడశ కళల నుండి కన్యగా:

అమ్మవారు ప్రత్యక్షమై విషయం తెలుసుకుని, తన షోడశ కళలలోని ఒక కళ భద్రకాళిని వీరభద్రుని శాంతింపచెయ్యటానికి భూలోకానికి పంపింది. భద్రకాళి అమ్మవారు ఎంత ప్రయత్నించినా వీరభద్రుడు శాంతించలేదు. అప్పుడావిడ శరభ అశ్శరభ అంటూ పక్కనే వున్న తటాకంలో మనిగి కన్యరూపం దాల్చి తటాకమునుండి బయటకువచ్చి వీరేశ్వరుని చూసింది.

శాంతించిన వీరేశ్వరుడు : కన్యరూపంలోవున్న భద్రకాళిని చూసి వీరేశ్వరుడు శాంతించాడు. ఇదంతా జరిగింది మహామునులందరూ గౌతమీ తటంలో ఆశ్రమాలు ఏర్పరుచుకుని నివసిస్తున్న ప్రదేశంలో. ఈ ప్రదేశాన్ని మునిమండలి అనేవారు.

స్వామివారికి అమ్మవారితో కల్యాణం:

మునులందరూ ఆ మునిమండలిలో వీరేశ్వరస్వామికి, భద్రకాళికి గాంధర్వ పధ్ధతిన వివాహం జరిపి స్వామిని శాంతింపచేశారు.

ముని మండలే నేటి మురమళ్ళ :

మురమళ్ళ అప్పటినుంచి ఆ క్షేత్రంలో స్వామికి నిత్యం గాంధర్వ పధ్ధతిలో కళ్యాణం జరిపిస్తున్నారు. ఈ మునిమండలే కాలక్రమేణా మురమళ్ళగా నామాంతరం చెందింది.

నిత్య కళ్యాణం :

భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూంటాయి. అంతేకాదు. స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులేకాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతముడు, వ్యాసుడు మొదలగు ఋషీశ్వరులనేకులు ప్రతి నిత్యం విచ్చేస్తారని పురాణ కధనం.

కల్యాణ సమయపట్టిక:

నిత్య కల్యాణం పూజ సాయంత్రం 5.00 నుండి ప్రారంభమవుతుంది. ‘అన్నదానం’ పథకం కింద కల్యాణ అనంతరం అన్నప్రసాదం చేయడానికి, కళ్యాణం నిర్వహించడానికి హాజరైన నమోదిత భక్తులు తమ ఉనికిని ఆలయ అధికారులకు సాయంత్రం 5 :00గంటల లోపు తెలియజేయాలి.

నిత్య కల్యాణ ప్రసాదం :

స్వామివారి ప్రసాదం, శేషవస్త్రములు, అక్షింతలు, కుంకుమలు ఆనాటి నమోదిత పాల్గొనే భక్తులందరికీ పంపిణీ చేయబడతాయి. నమోదు చేసుకుని కూడా పాల్గొనలేకపోయినా భక్తుల కోసం స్వామివారి ప్రసాదం, అక్షింతలు మరియు కుంకుమలను కొరియర్ ద్వారా పంపుతుంది దేవస్థానం.. అనంతరం పవళింపుసేవ నిర్వహిస్తారు.

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి మహిమ, క్షేత్ర మహిమలు స్వయంగా అనుభూతి చెందేందుకు అవకాశంవున్నవారు తప్పక దర్శించవలసిన ఆలయం ఇది..

Tags: మురమళ్ళ, SriVeereswara Swamy, Muramalla temple history in Telugu, Muramalla Temple Kalyanam tickets Cost, Muramalla Temple phone Number, Muramalla Temple Kalyanam dates, Muramalla Temple Timings, Muramalla temple distance, Sriveeraswaraswamytemple, 

1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS