ఉగాది రోజు ధ్వజారోహణం ఎందుకు చెయ్యాలి? Ugadi dwajarohanam|ugadi pooja

ఉగాది రోజు ధ్వజారోహణం ఎందుకు చెయ్యాలి?

మావిచిగురు తొడిగిన దగ్గరనుంచి మొదలవుతుంది ఉగాది శోభ. అప్పుడే వస్తున్న మామిడి పిందెలు, వినిపించే కోయిల పాటలు, విరబూసే వేప పువ్వు వాసనలు, కొత్తబెల్లం ఘుమఘుమలు ఎటు చూసినా పండగ వాతావరణమే.

మనకున్న అన్ని మాసాలలో ప్రతి మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఋతువుల్లో వసంత ఋతువుని నేనే అన్నాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడికి ఇష్టమైన వసంత కాలంలో మొదటి మాసమైన చైత్రం, మొదటి నక్షత్రం అయిన అశ్విని, మొదటి తిథి అయిన పాడ్యమి రోజున మనందరం జరుపుకునే పండుగే ఈ ఉగాది.

కొత్తగా పండిన చెరుకుతో చేసిన బెల్లం, కొత్త చింతపండు, ఉప్పు, కారం, మామిడి పిందెల వగరు, చిరుచేదుగా ఉండే వేప పువ్వు అన్ని కలబోసి చేసే ఉగాది పచ్చడి తింటే దానికి సాటైనది మరొకటి ఉంటుందా అనిపిస్తుంది కదూ. మనం ఉగాది రోజు ఉదయాన్నే లేచి స్నానం, పూజ అయ్యాకా ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టి అది తిన్న తర్వాతే ఏదైనా తింటాం. ఇక సాయంత్రం పండితులు పంచాంగ శ్రవణం చేస్తే అది విని మన భవిష్యత్తు కార్యక్రమాలను గురించి ఒక ప్రణాళిక తయారుచేసుకుంటాం.

ఇవే కాదండీ మనం ఉగాది రోజు చెయ్యాల్సిన పనులు మరికొన్ని ఉన్నాయి. మన పూర్వికులు ఉగాది రోజున విధిగా చేస్తూ వచ్చిన కొన్ని పనులు కాలక్రమేణా మరుగున పడిపోయాయి. అవే దవనంతో దేవుడిని ఆరాదించటం, ధ్వజారోహణం, చత్రచామర వితరణ, ప్రసాదాన ప్రారంభం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయటం మొదలయినవి. ఉగాది రోజు ఈ సృష్టిని ప్రారంభించిన సృష్టికర్త అయిన బ్రహ్మను దవనంతో(మరువం లాంటిదే) పూజించాలిట. అలాగే ఉగాది రోజు ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. శుచిగా స్నానం చేసిన తరువాత ఇంటి ముందు ఒక వెదురు కర్రను నిలిపి దానిని పసుపు కుంకుమలతో అలంకరించి, పైన రాగిచెంబు పెట్టి, పూవులను కట్టి పూజిస్తే ఎంతో మంచి జరుగుతుందిట. ధ్వజారోహణ చేస్తే మొత్తం మనకున్న దేవతాగణాలనన్నిటిని పూజించినట్టు అవుతుందిట.

అలాగే ఉగాది రోజు చత్రచామర వితరణ అంటే విసినికర్రలు, గొడుగులు మన శక్తి ఉన్నంతమేర పేదవాళ్ళకి పంచుకుంటే మంచిదని చెపుతున్నాయి శాస్త్రాలు. ఎండలు మండిపోయే ఈ కాలంలో మన తోటివారికి సహాయం చెయ్యటమే దీని వెనక అంతరార్ధం అయి ఉండచ్చు. ప్రసాదాన వితరణ అంటే ఎండని భరించలేక తాపంతో ఉండేవాళ్ళకి మజ్జిగ, ఇతర చల్లని పానీయాలు ఇచ్చి కాస్త దాహం తీర్చటం. పూర్వం అటుగా వెళ్ళేవాళ్ళు కాసేపు సేదతీరటానికి ఎంతో మంది ఇంటి ముందు తాటాకు పందిర్లు కూడా వేసి ఉంచేవారట. మన శాస్త్రాలు ఏవి చెప్పిన అవి నలుగురికి ఉపయోగపడేవే చెప్తాయి అనటానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

ప్రకృతిలో వేడి తాండవించే రోజుల్లో మన శాస్త్రాలు చెప్పిన పనులు చేయటం వల్ల మనకి పుణ్యం మన చుట్టూ ఉన్నవారికి సాయం చెయ్యటం వల్ల పురుషార్ధం రెండూ వస్తాయి.

Tags: Ugadi, Ugadi Pachadi, Ugadi Stotry, Ugadi Dwajarohanam, Ugadi Panchangam, Rasi Phalalu ugadi 2024, Ugadi dwajarohanam|ugadi pooja

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS