శ్రీరామనవమి ముహూర్తం,2024
తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ నవమి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామనవమి విషిష్టత ఏంటో తెలుసుకుందాం.
అయోధ్య రాజు దశరథ మహారాజు రాణి కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన శుభ సందర్భమే శ్రీరామ నవమి. త్రేతా యుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ,పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
2024లో రామ నవమి ఎప్పుడు?
చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ 9, మంగళవారం ప్రారంభమయ్యాయి.ఏప్రిల్ 17 న రామ నవమి పండుగతో ముగుస్తాయి.
రామ నవమి శుభ ముహూర్తం
రామ నవమి, ఏప్రిల్ 17,బుధవారం.
ముహూర్తం - ఉదయం 11:03 -మధ్యాహ్నం 01:38 వరకువ్యవధి - 02 గంటల 35 నిమిషాలు అని పండితులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా రామనవమిని ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా రామజన్మభూమిగా భావించే అయోధ్యలో, శ్రీరాముని జన్మదినోత్స వేడుకలు కోలాహలంగా ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు.ఈ ఏడాది ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామజన్మభూమి దేవాలయంలో రామ్ లల్లా తొలి వేడుకులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.
సీతారామకళ్యాణం
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ శ్రీరామ కల్యాణ ఉత్సవాలను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు అయిన శ్రీరాముడికి - అందాల సీతమ్మకు ఈ రోజునే పెళ్లి జరిగింట. అందుకే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రతి రాముడి ఆలయంలోనూ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే పద్నాలుగేళ్లు అరణ్యవాసం తరువాత శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదేనని భక్తుల విశ్వాసం. చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు. రామ భక్తులు రామాయణం భాగవత గ్రంథాలను పఠిస్తారు. సీతారామ లక్ష్మణులతోపాటు హనుమంతుడిని కూడా పూజిస్తారు.
వడపప్పు, పానకం
పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైందట. అందుకే శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేదం చెపుతుంది.
Tags: sriramanavami, srirama, navami, srirama, srirama kalyanam, ayodhya,