Maha shivaratri 2024 : మహా శివరాత్రి 2024 తేదీ, ముహూర్త సమయం, ఉపవాసం ప్రాముఖ్యత!

మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది? - తేదీ, ముహూర్త సమయం, ఉపవాసం ప్రాముఖ్యత!

మహాశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ప్రతినెలా మాస శివరాత్రి వస్తుంది. కానీ.. మహా శివరాత్రి ఏడాదికి ఒక్కసారే వస్తుంది. ఈ పర్వదినాన ఉపవాసంతోపాటు రాత్రంతా జాగరణ ఉంటారు. మరి ఈ సంవత్సరం మహా శివరాత్రి ఎప్పుడు వచ్చింది..? ఆ రోజున భక్తులు ఏం చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది?:

తెలుగు సంవత్సరాది ప్రకారం మహాశివరాత్రిని మాఘమాసం బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది శివరాత్రి మార్చి 8వ తేదీ శుక్రవారం వచ్చింది. ఆ రోజున రాత్రి 8 గంటల 13 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్థశి ప్రారంభమవుతుంది. చతుర్థశి తిథి మార్చి 9, 2024 సాయంత్రం 06.17 గంటలకి ముగుస్తుంది. అయితే.. శివరాత్రి అంటే లింగోద్భవ సమయానికి చతుర్ధశి తిథి ఉండడం ప్రధానం.. అందుకే మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

మహా శివరాత్రి 2024 ముహూర్తం:

నిషిత కాల ముహూర్తం - అర్ధరాత్రి: 12:07 AM నుండి 12:55 AM వరకు (మార్చి 9, 2024)

వ్రత పరణ సమయం - ఉదయం: 06:37 AM నుండి మధ్యాహ్నం: 03:28 PM (మార్చి 9, 2024) మహాశివరాత్రి 2024 నాలుగు ప్రహర్ పూజ సమయం:

మొదటి ప్రహార్ పూజ సమయం - సాయంత్రం: 06:25 PM నుండి రాత్రి: 09:28 PM వరకు

రెండవ ప్రహార్ పూజ సమయం - రాత్రి: 09:28 PM నుండి తెల్లవారుజామున: 12:31 AM (మార్చి 9)

మూడవ ప్రహార్ పూజ సమయం - తెల్లవారుజామున: 12:31 AM నుండి 03:34 AM వరకు

నాల్గవ ప్రహార్ పూజ సమయం - తెల్లవారుజామున: 03:34 AM నుండి 06:37 AM వరకు

ఆరోజున ఏం చేయాలి:

మహాశివరాత్రి.. పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామాన్ని స్మరించడం, ప్రదోషకాలంలో శివున్ని అభిషేకిస్తారు. శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. ఉపవాస నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే.. పుణ్యఫలం దక్కుతుందని నమ్మకం. అలాగే శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరానికి తేజస్సు వస్తుందట. అలాగే.. భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయమని చెబుతున్నారు.

ఐదు శివరాత్రులు..

మహా శివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించినా.. ఎలాంటి మంత్రాలూ తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. హైందవ సంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. నిత్య శివరాత్రి అంటే రోజూ శివుడిని ఆరాధించడం. పక్ష శివరాత్రి అంటే ప్రతి మాసంలో శుక్ల, బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం. మాస శివరాత్రి అంటే.. నెలలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని అర్చించేది. అలాగే, మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహా శివరాత్రిగా శివపురాణం పేర్కొంటోంది. సాధకుడు తన యోగ మహాత్మ్యంతో యోగనిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు.

లింగోద్భవంపై పురాణ గాథ:

త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు.. ఆ సమయంలో భోళాశంకరుడు లింగరూపం ధరిస్తాడు. ఆ లింగానికి ఆది, అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెబుతాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహా లింగం అంతం కనుగొనేందుకు కిందివైపు వెళ్తాడు. బ్రహ్మ శివులింగానికి పై భాగం వైపు వెళ్లి ఆది (మొదలు) కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. అయితే.. ఇద్దరూ ఆది, అంతం కనుక్కోలేకపోతారు. విష్ణుమూర్తి తాను కనుక్కోలేకపోయానని చెబుతాడు. బ్రహ్మమాత్రం తాను కనుగొన్నానని చెబుతాడు. దానికి సాక్ష్యంగా కేతకి పుష్పం (మొగలిపువ్వు), గోవును తీసుకొస్తాడు. ఇవి రెండూ సాక్ష్యం చెబుతాయి.

శివ లింగానికి ఆది, అంతం లేదని శివుడి భావన. అలాంటిది బ్రహ్మ కనుగొన్నానని అబద్ధం చెబుతున్నాడని గ్రహిస్తాడు. దీనికి సాక్ష్యంగా వచ్చిన మొగలిపువ్వు, గోవుపై ఆగ్రహించి, శపిస్తాడు. మొగలిపువ్వుకి పూజార్హత ఉండదని చెప్తాడు. గోవును సైతం శపిస్తాడు. అయితే.. నోటితో సాక్ష్యం చెబుతున్నప్పుడు.. తోక అడ్డంగా ఊపుతుంది. అందువల్ల నోటితో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పిందని భావించిన శివుడు.. గోవు ముఖం చూడటం పాపంగా, తోక భాగాన్ని చూడడం పాపపరిహారంగా శపిస్తాడు. అదే సమయంలో.. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. చివరగా.. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం, మోక్షమును ఇచ్చే అధికారం మహా విష్ణువుకు ఇవ్వడం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉంది.

జాగరణ ఎందుకు చేస్తారు?

ఇలా చేయడం వల్ల సకల సంపదలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. శివనామం, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహా మంత్రం జపించాలి. శివరాత్రి మరుసటి రోజు శివాలయం దర్శించి ప్రసాదం తీసుకుని ఉపవాసం వ్రతం విరమించాలి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది. నాలుగు గంటలని ఒక్కో జాముగా భావించి శివుడికి పూజ చేస్తే ఉంటారు. అలా రాత్రి కూడా రావడం వల్ల నిద్రపోకుండా శివారాధన చేస్తారు. అందుకే శివరాత్రి రోజు తప్పనిసరిగాజాగారం చేస్తూ శివనామ స్మరణలో మునిగిపోతారు.

Tags: మహా శివరాత్రి, మహాశివరాత్రి 2024, Maha shivaratri 2024, Shivaratri 2024 date, shivaratri 2024 date and time, shivaratri 2024 telugu calendar, Maha Shivaratri, Maha Shivaratri 2024, Maha Shivaratri Importance, Shivaratri

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS