శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము Sri Venkateswara Vratha Kalpam Telugu

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము

శ్రీ వశిష్ఠ ఉవాచ

ఈ అధ్యాయాన్ని మహా తపోనిష్ఠా గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీ మన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు.

“ఓ కలియుగ వాసులారా! శ్రీనివాసుని ప్రియ భక్తులారా! వైకుంఠంలోని శ్రీ మన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరి కష్టాలనూ తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలనూ అనుభవిస్తారు.

పూర్వకాలంలో అవంతీ దేశంలో భాగ్యనగరమనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు గదా, విశేష రోజులలో కూడా ఏ పూజలూ చేసేవారు కాదు.

ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది.

ఒకరోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పువీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు.

ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాదికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు.

సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇళ్ళూ నీట మునిగి పోసాగాయి. అంతా గాడాంధకారం. తెల్లవారే సరికి ఊరంతా నేలమట్టమయింది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. ఐశ్వర్యాలూ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం..ఎందుకీ జల ప్రళయం.. ఎవరికీ అంతు బట్టట్లేదు.. అంతలో వారికొక విశేషం కనిపించింది.

ఊరి చివరన ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి.. వారికి ఆశ్చర్యం కలిగింది.. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి?.... అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది.. ఆకాశవాణి ఇలా పలికింది.

'ఓ మూర్ఖులారా ! మీ సంపదలన్నీ మీ గొప్ప తనమని తలచుకొనటం వలననే ఇలా జరిగింది.. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. ఆతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజూ మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు.. అంతే కాక ప్రతీ ఏకాదశినాడు తనకు వీలున్నంతలో శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పాన్నీ నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు.' అని వినిపించింది.

వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికీ పూనుకుని శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలూ పూర్వరూపంలో కనిపించాయి.

అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతీ ఏకాదశి నాడూ శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు. ” అని శ్రీ వశిష్ఠులవారు వివరించారు.

Tags: శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం, Sri Venkateswara Vratha Kalpam, Sri Venkateswara, Sri Venkateswara Vrata Kalpam Telugu, Vrata Kalpam, Govinda, Venkateswara Stotram

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS