అద్వితీయ శక్తి పీఠం.. పిఠాపురం..!
Pithapuram : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాచీన మహిమాన్విత క్షేత్రాలలో 'పిఠాపురం' ఒకటి. అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ పీఠంగా పేరున్న ఈ క్షేత్రంలో అమ్మవారు పురూహుతికా దేవిగా దర్శనమిస్తుంది.
దక్షయజ్ఞ సమయంలో సతీదేవి 'పీఠభాగం' ఇక్కడ పడటం వలన ఈ క్షేత్రానికి 'పీఠికాపురం' అనే పేరు వచ్చింది. అదే కాలక్రమంలో పిఠాపురం అయింది. ఇక్కడ పరమేశ్వరుడు 'కుక్కుటేశ్వరుడు' అనే పేరుతో పూజలందుకుంటున్నాడు. పూర్వజన్మ పుణ్యం ఉన్నవారు మాత్రమే.. ఈ క్షేత్రాన్ని దర్శించగలరని పండితులు చెబుతారు.
ప్రసిద్ధ శైవక్షేత్రాలన్నింటిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం విశిష్టమైంది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. అష్టాదశ శక్తిపీఠాల్లోని దశమ శక్తిపీఠం ఇక్కడే కొలువుదీరింది. దత్తాత్రేయుడి జన్మస్థలంగా, వ్యాసమహర్షి తన శిష్య బృందంతో దర్శించిన క్షేత్రంగా దీనికి పేరుంది. 'ప్రపంచపు ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ఇక్కడే కొలువయ్యాయా అన్నట్టుంది ఈ క్షేత్రం' అని శ్రీనాథుడు ఈ ప్రాంతాన్ని అభివర్ణించినట్లు భీమఖండం చెబుతోంది.
పిఠాపురాన్ని 'పాదగయ' అనీ అంటారు. దీని వెనక ఓ పురాణ గాథ ఉంది. పూర్వం గయాసురుడనే రాక్షసుడు విష్ణువుని మెప్పించి తన శరీరం అతి పవిత్రంగా ఉండే వరాన్ని పొందాడు. దీంతో మనుషులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాపవిముక్తులై స్వర్గానికి రావడం మొదలుపెట్టారు. గయాసురుడు భాగవోత్తముడు కనుక అతడికి ఇంద్రపదవి దక్కింది. దీంతో రాక్షసులంతా చెలరేగిపోతారు. దీంతో దేవేంద్రుడు త్రిమూర్తులను ఆశ్రయించి, గయాసురుడిని కట్టడిచేసి, తిరిగి తన ఇంద్రపదవిని తనకు ఇప్పించమని కోరతాడు.
దీంతో త్రిమూర్తులు బ్రాహ్మణుల రూపాల్లో గయాసురుడి దగ్గరికి వెళ్లి.. తాము లోక కల్యాణం కోసం ఒక యజ్ఞం చేపట్టాలనీ, నీ శరీరాన్నే యజ్ఞవాటికగా ఇవ్వమని కోరతారు. అందుకు ఆ రాక్షసుడు సరేనంటాడు. అప్పుడు త్రిమూర్తులు 'గయాసురా… వారంలోపు నువ్వు కదిలినా లేచినా మేం యజ్ఞం భగ్నమవుతుంది కనుక నిన్ను సంహరిస్తాము' అనగా, అతడు సరేనంటాడు. దీంతో గయాసురుడు తన తల గయ (బిహార్), నాభి- నాభి గయ (ఒరిస్సా జాజ్‌పూర్), పాదాలు- పాదగయ (పిఠాపురం)లో ఉండేంతగా పెంచగా త్రిమూర్తులు యాగం ఆరంభిస్తారు.
అయితే.. ఏడవరోజు తెల్లవారకముందే కోడిపుంజు రూపంలో వచ్చి కూయగా, సమయం అయిపోయిందని భావించిన గయాసురుడు లేచి నిలబడతాడు. దీంతో త్రిమూర్తులు అతడిని సంహిరిస్తాడు. అలా.. అతడి పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణాన ఇది పాద గయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు చేస్తే.. వారికి మోక్షం సిద్ధించేలా వరం కోరగా త్రిమూర్తులు సరేనంటారు. నాటి నుంచి ఈ మూడు చోట్ల చేసే పిండప్రదానాలు చేయటం మొదలైంది. గోదావరి పుష్కర వేళ.. నేటికీ ఒడిస్సీలు ఇంటికొకరు వచ్చి.. పిఠాపురంలో పిండ ప్రదానం చేయటమే దీనికి నిదర్శనం.
పిఠాపురంలో పిండ ప్రదానాలు చేసే పాదగయ పుష్కరిణి అసలు పేరు.. 'ఏలానది'. పూర్వం ఏలామహర్షి.. అప్సరసల మోజులో పడి తపస్సును భగ్నం చేసుకుని, అందుకు ప్రాయశ్చిత్తంగా ఈశ్వరుడి గురించి తపస్సుచేసి పాపాన్ని పోగొట్టుకుంటాడు. అంతేగాక.. ఒక నదిని వరంగా పొందుతాడు. శివుడు అనుగ్రహించిన ఆ నదిని తీసుకుని, దానిని సముద్రంలో కలిపేందుకు బయలుదేరగా, పాదగయ క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి కోడికూత వినబడి, అక్కడే ఆగిపోగా, ఆయన వెంట వచ్చిన నదీపాయ కూడా ఆగిపోయింది. అదే పాదగయ పుష్కరిణి.
గయాసుర సంహారం కోసం కుక్కుట(కోడి) రూపం ధరించి కారణంగా ఇక్కడి శివుడిని కుక్కుటేశ్వరుడు అంటారు. స్వామి వారి దేవేరిగా శ్రీ రాజరాజేశ్వరీ దేవి భక్తుల పాలిటి కల్పవల్లిగా విరాజిల్లుతోంది. అమ్మవారి పక్కనే నెమలిపై కుమారస్వామి, మరొకపక్క చతుర్భుజుడైన గణపతి దర్శనమిస్తారు.
పిఠాపురం గొప్ప దత్తక్షేత్రం కూడా. దత్తాత్రేయుడి మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడే జన్మించారు. నాడు ఆయన జన్మించిన గృహమే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం. శ్రీపాదవల్లభ జయంతి, దత్త జయంతి రోజుల్లో పలు రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు ఇక్కడికొస్తుంటారు.
అలాగే, పిఠాపురం వైష్ణవ క్షేత్రం కూడా. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి, ఆ బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందేందుకు 5 మాధవుడి ఆలయాలను నిర్మించాడని పురాణ కథనం. అవి.. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం, ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం, పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం.
కాకినాడ-అన్నవరం మధ్యన ఉన్న ఈ క్షేత్రం అన్నవరానికి 30 కి.మీ దూరంలో ఉంది. సామర్లకోటకు 11 కి.మీ., రాజమండ్రికి 70 కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలు, రోడ్డుమార్గాలు ఉన్నాయి. పిఠాపురం దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోని 'సర్పవరం' క్షేత్రాన్ని కూడా దర్శిస్తుంటారు.
Tags: పురూహుతికా దేవి, Sri Kukkuteswara Swamy, Pithapuram, Puruhutika Temple, Sri Puruhutika Devi Temple Pithapuram, Kukkuteswara Temple, Puruhutika Devi Temple Histor Telugu, 10th Shakti Peetham, Astadasha Shakti Peetham