తోబుట్టువుల విలువ చెప్పిన రాముడు - How to Maintain Brotherhood – As per Lord Rama

తోబుట్టువుల విలువ చెప్పిన రాముడు..

ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో, అహంకారంతో, మనస్పర్ధలతో విడిపోతున్నారు. ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి. రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.

ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన ‪లక్ష్మణుడు‬ అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు. రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.

నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు. నేను మరణించాలనుకుంటున్నాను అని రాముడు ఎంతో ఏడుస్తాడు.

ఓ శూరుడా! లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి జాబిల్లి (చంద్రుడు) ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి? లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను యుద్ధం చేసి లాభం ఏంటి? నువ్వు నన్ను ఏ విధంగా వనవాసానికి ముందు అనుసరించావో, అలాగే ఇప్పుడు నేను నిన్ను మృత్యువులో అనుసరిస్తాను. యముని వద్దకు నీ వెంట వస్తాను.

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః |

తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతః సహోదరః ||

భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు అంటాడు ‪‎శ్రీరాముడు‬.

నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ లక్ష్మణుని చూస్తూ రాముడు రోదిస్తాడు.

ఇది వాల్మీకి ‪రామాయణం‬ యుద్ధకాండ 101 సర్గలో ఉంది.

తోడబుట్టిన వారి విలువ ఎంత చక్కగా చెప్పాడు శ్రీ రాముడు. అహంకారాలాకు పోయి వారిని దూరం చేసుకుంటారా? కొత్తగా పెళ్ళై వచ్చిన జీవిత భాగస్వామి కోసం వారిని విడిచిపెడతారా? శ్రీ రాముడు మనకు ఆదర్శం కావాలి. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ తోబుట్టువులను తీసుకురాలేరు. వారితో కూడా కాలం గడపాలి, ప్రేమను పంచుకోవాలి. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా అప్యాయతతో జీవించాలి.

Tags: Ramayanam, Rama, Lakshmanudu, Srirama, Relations, Ramayanam Telugu, Rama Storys

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS