శ్రీశైలం లొ చూడవలసిన పుణ్య ప్రదేశాలు..
శ్రీశైలం. నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జున స్వామి వారి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ లో తిరుమల తిరుపతి తరువాత అత్యంత ప్రాచుర్యం పొందిన దివ్యక్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
శ్రీశైలం లో శ్రీ అనగా సిరి,సంపద, శైలము అనగా పర్వతం అంటే సంపదవంతమయిన పర్వతం. అలాగే శ్రీపర్వతము,శ్రీకైలాసము అని పేర్లు వున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్షేత్రానికి శ్రీశైలము అన్న పేరు రావడానికి అనేక కథనాలు వున్నాయి అందులో ముఖ్యమైనది, కృతయుగాంతంలో సుమతి అనే ముని పుత్రిక "శ్రీ" పరమేశ్వరుని గురుంచి ఘోర తపమాచరించి ఆయన్ను ప్రత్యక్షం చేసుకొని తను తపమాచరించిన ఆ పర్వతంపై పరమేశ్వరుడు కొలువుండాలని,తన పేరుమీద ఆ పర్వతానికి శ్రీ పర్వతము అని శ్రీశైలము అని పేరు వచ్చినదని ప్రతీతి. శ్రీశైలం లో అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి,
1.పాతాళగంగ: ఇది శ్రీశైలం పక్కనే ప్రవహించే కృష్ణానది . ఆలయం దిగువున వున్న లోయలో ప్రవహించే ఈ నదిలో స్నానానికి చాలా కిందికి దిగి వెళ్ళవలసి వుంటుంది కాబట్టి దీనికి పాతాళగంగ అన్న పేరు.
2.శ్రీశైల శిఖర దర్శనం: శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్న వుండదు అన్నది శాస్త్ర ఘోష.3.సాక్షి గణపతి ఆలయం: శ్రీశైల శివుని దర్శన మాత్రముననే కైలాస ప్రవేశం అని, మనము శ్రీశైలము దర్శించినామని దానికి సాక్షి గణపతి అని,అందువల్లనే ఆయనకు సాక్షి గణపతి అని పేరు.
3.ఫాలధార, పంచదారలు: సాక్షి గణపతి ఆలయం, హఠకేశ్వరం మధ్యలో వున్న అందమైన ప్రదేశం ఫాలదార,పంచదార. శివుని ఫాలము(నుదురు) నుండి స్రవించే ధార కాబట్టి ఫాలధార, కొందపగులలో నుండి స్రవించే పంచ(ఐదు) ధారలు కాబట్టి పంచధార అని పేర్లు. ఈ ధారలు ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచి వుంటుంది అంటారు. ఇంకొక ముఖ్య మైన విషయం శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కొద్ది కాలం ఇక్కడే తపమాచరించి ఉన్నారు అన్నది కథనం.
4.హట కేశ్వరము: శ్రీశైలం నుండి సుమారు 4 కిలోమీటర్లు దూరంలో ఉండే హాటకేశ్వరం ఆలయం. శ్రీ శంకరాచార్యుల వారు కొన్ని రోజులు ఇక్కడ నివసించినప్రదేశం. ఇక్కడ మఠాలు చాలా వుంటాయి. శ్రీ స్వామి వారు ఇక్కడి అటిక(కుండ పెంకులో) లో వెలిశారు కాబట్టి అటికేశ్వరుడు అని పేరు. వాడుకలో అది హాటకేశ్వరుడు అని ఆ ప్రాంతం హాటకేశ్వరము అని నామాంతరం చెందింది.
5.భీముని కొలను: సాక్షి గణపతి ఆలయం దాటి కుడిపక్కకు వచ్చిన తరువాత పాపనాశనం కి ఎదురుగా వున్న పర్వతలోయలో తుర్పునుంచి ప్రవహించే సెలయేరు,దక్షిణం నుంచి ప్రవహించే సెలయేరు రెండూ సంగమించి ఒక జలపాతం లా దూకి ఏర్పరచిన గుండము భీముని కొలను.
6.శ్రీశైలం ప్రాజెక్ట్: 1963 జూలై లో నెహ్రూ గారి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్ 1984 డిసెంబర్లో పూర్తయింది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. ఇది కృష్ణా నదిపై ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ . ఈ ప్రదేశం సుందరమైన అందాల ద్వారా విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆస్వాదించడానికి గొప్ప ప్రదేశం.
7. అక్కమహాదేవి గుహలు: తూర్పుకనుమలలో ఉన్న ఈ గుహలను చేరుకోవాలంటే కృష్ణ నదిలో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకోవాలి. ఈ గుహలు సహజసిద్దంగా ఏర్పడిన గుహలు.ఈ గుహల్లో 12 వ శతాబ్దానికి చెందిన కన్నడ కవయిత్రి,తత్వవేత్త అయిన అక్కమహాదేవి శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశం,సహజ సిద్దంగా ఏర్పడిన శివలింగం ఉన్నాయి. అక్క మహాదేవి పేరున ఈ గుహలను అక్కమహాదేవి గుహలు అంటారు.
8.ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం: శ్రీశైలం నుండి 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆలయం.పార్వతీదేవి ప్రతిరూపముగా ఇష్ట కామేశ్వరి అమ్మవారిని చెపుతారు. క్రీ, శ 8,10 సంవత్సరాల మధ్యలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చెపుతారు. ప్రకృతి సోయగాలు విరాజిల్లుతూ వుంటుంది ఈ ఆలయ పరిసర ప్రాంతం. మనసారా కోరుకొనే ఒక కోరిక ఈ అమ్మవారు తప్పక తీర్చుతుందని నమ్మిక.
9.ట్రైబల్ మ్యూజియం: శ్రీశైలం లోనే వున్న ఈ ట్రైబల్ మ్యూజియం గిరిజనుల జీవన విధానం,ఆచారవ్యవహారాలు లాంటివి ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం లో చూడొచ్చు. అలాగే శ్రీశైలం ఎగువ భాగంలో నుండి పాతాళగంగ కు రోప్ వే ప్రధాన ఆకర్షణ.
Tags: శ్రీశైలం, Srisailam, Shiva, Srisailam temple,, Srisailam Temple Timings, Srisailam route, siva temple srisailam