అరుణాచలం మొదటి సారి వెళ్ళే వాళ్ళకి నేను ఇచ్చే సలహా..
వెళ్ళే ముందు చాగంటి కోటేశ్వరరావు గారి రెండు ప్రవచనాలు ఒకటి "అరుణాచల మహత్యము", అరుణాచల మహత్యము 7 భాగాలుంటాయి అవి మొత్తం వినండి. రెండవది "రమణ తత్వము". ఈ రెండు పూర్తిగా వినండి.
అలాగే నండూరి శ్రీనివాసరావు గారి అరుణాచలం కి సంబంధించిన వీడియోలు చూడగలరు, చాలా విషయాలు తెలుస్తాయి.
మొదటి సారి విన్నప్పుడు శ్రద్ధతో, భక్తితో వినండి. మళ్ళీ రెండోసారి వినేటప్పుడు విషయ పరిజ్ఞానం కోసం వినండి. ఆయన చెప్పిన విషయాలు ఒక పుస్తకంలో రాసుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీతో తీసుకెళ్లండి.
దయచేసి మార్నింగ్ వాక్ చేసినట్టు మీ స్నేహితులతో, లేదా మీ చుట్టాలతో కబుర్లతో గిరి ప్రదక్షిణ చేయకండి. "నేనెవరు" అనే శోధన మానవ జీవిత పరమార్ధం అని చెప్పిన రమణులు నడిచిన నేల అది. అక్కడ కొండ మాత్రమే కాదు ప్రతీది పవిత్రమే.
కోరికల కోసమో, సుఖాల పట్టీ చదవడం కోసమో అయితే అక్కడ అడుగుపెట్టకండి.
నేనెవరు అనే శోధన నాలో కూడా మొదలయ్యి సాధనలో నన్ను ముందుకు తీసుకెళ్ళు స్వామీ అని భగవాన్ రమణుల పాదములు పట్టి ప్రార్దించడానికి, రమణుల నడిచిన నేల పవిత్రతకు పులకించడానికి, ఆ భక్తిని అనుభవం లోకి తెచ్చుకోవడానికి వెళ్ళండి.
మొదట గిరి ప్రదక్షణ చేయండి, తర్వాత అమ్మవారి & అయ్యవారికి దర్శనం చేయండి. గిరి ప్రదక్షిణ పొద్దున్న తొమ్మిది లోపల చేయగలిగితే మీకు ఆ గిరిప్రదక్షిణలో అవధూత టోపీ అమ్మ దర్శనం కలిగే అవకాశం ఉంది. గిరి ప్రదక్షిణము చేసేటప్పుడు దారిలో నైరుతి లింగము దాటిన తరువాత విభూతి సిద్ధార్ ఆశ్రమము ఉన్నది ఆయనను దర్శనం చేసుకోండి.
గిరి ప్రదక్షిణ పొద్దున 9 లోపల పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి లేదా సాయంత్రం ఐదు తర్వాత ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. పది తర్వాత ఎండలు బాగా ఉంటాయి. అందుచేత గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కాళ్లు కాలడం వల్ల చేయడం ఇబ్బంది అవుతుంది.
శేషాద్రి స్వామి ఆశ్రమము, యోగి రామ సూరత్ కుమార్ ఆశ్రమము వెళ్లి దర్శనం చేసుకుని అక్కడి నుండి రమణాశ్రమానికి వెళ్ళండి.
రమణాశ్రమము నుండి బయటికి రాగానే వినాయకుడి గుడి ఒకటి ఉంటుంది అది దర్శనం చేసుకోండి.
రమణాశ్రమం వెనకాలనుంచి అరుణాచలం కొండపైకి దారి ఉంటుంది అక్కడ రమణ మహర్షి తపస్సు చేసిన రెండు గుహలు ఉంటాయి, ఆ వెళ్లే దారి చాలా బాగుంటుంది ప్రకృతి ప్రేమికులకి ఎంతో సంతోషిస్తారు.
Tags: అరుణాచలం, Arunachalam, Giri Pradakshina, Arunachalam temple, Giri valayam, Tiruvannamalai, Arunachalam temple timings, Arunachalam rooms
నేను అలాగే వెళ్ళాను, ఓం శ్రీ అరుణాచల శివాయ నమః
ReplyDelete