కార్తిక మాసంలో దీపారాధనకు అంత ప్రాధాన్యం ఎందుకుంది? Why is Karthika Masam Deepam important?

కార్తిక మాసంలో దీపారాధనకు అంత ప్రాధాన్యం ఎందుకుంది?

కార్తికమాసం అనగానే తెల్లవారు ఝామున స్నానాలు, ఉభయ సంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలు, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం.. చక్కని సందడి!

ఇందులో దివ్యత్వంతో పాటు ఒక ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి. చిరుచలిలో బద్ధకాన్ని వదుల్చుకొని చేసే స్నానం, చిరుదీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం..

ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి ప్రదర్శించే హైందవ మతంలోని దివ్యకళా చాతురిని కొనియాడవలసిందే.

కార్తికంలో దేశమంతా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ దైవాన్ని కొలుచుకుంటారు. కార్తికం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికి ప్రాధాన్యం. 

కృత్తికా నక్షత్రం నాడు పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆరాధించడమే యజ్ఞం. 

అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది - కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్ఞతత్వానికి సంకేతంగానే 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రధానమయ్యింది. కార్తికంలో దీపార్చన, దీపదానం వంటివి - యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి.

భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయగృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు. 

జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా - ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ - విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి ఉపాసించమని ఉపదేశించే మాసమిది..

కార్తీక దీపారాధన శ్లోకము..

కీటా: పతంగా: మశకాశ్చ  వృక్షా:

జలే స్థలే యే నివసన్తి జీవా:

దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన:

భవంతి త్వం శ్వపచాహి విప్రా:||

దీప దాన శ్లోకము  :

సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ !!!

Tags: కార్తిక మాసం, Karthika Masam, Karthikam,Karthikamasam, karthikapurnima, Somavaram, Karthika Deepam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS