శ్రీ వైద్యనాథాష్టకం..!!
ప్రతి దినము మూడుసార్లు పఠించిన సకల రోగ నివారణ జరుగును..
శ్రీరామసౌమిత్రిజటాయువేద
షడాననాదిత్య కుజార్చితాయ |
శ్రీనీలకంఠాయ దయామయాయ
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
శ్రీరాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్యస్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజింపబడిన నీలకంఠము కలవాడు,దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారము.
గంగాప్రవాహేందు జటాధరాయ
త్రిలోచనాయ స్మర కాలహంత్రే |
సమస్త దేవైరభిపూజితాయ
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
ప్రవహించే గంగను, చంద్రుని జటాఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు,మన్మథుని, యముని సంహరించినవాడు,దేవతలందరి చేత పూజింపబడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.
భక్తప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినే దుష్ట హరాయ నిత్యమ్ |
ప్రత్యక్షలీలాయ మనుష్యలోకే
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
భక్తప్రియుడు,త్రిపురములను నాశనము చేసినవాడు, పినాకమును చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించేవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము.
ప్రభూతవాతాది సమస్తరోగ
ప్రణాశకర్త్రే మునివందితాయ |
ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసేవాడు, మునులచే పూజింపబడినవాడు, సూర్యుడు, చంద్రుడు,అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారము.
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి విహీనజంతోః
వాక్శ్రోత్రనేత్రాంఘ్రి సుఖప్రదాయ |
కుష్ఠాదిసర్వోన్నత రోగహంత్రే
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
వాక్కు,వినికిడి,శక్తి,కాంతిచూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవరాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించేవాడు. కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలన చేసి ఆరోగ్యమును ప్రసాదించేవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము.
వేదాంతవేద్యాయ జగన్మయాయ
యోగీశ్వరధ్యేయపదాంబుజాయ |
త్రిమూర్తిరూపాయ సహస్ర నామ్నే
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు,యోగులచే ధ్యానించబడిన పాదపద్మములను కలిగినవాడు, త్రిమూర్తుల రూపమైనవాడు,సహస్రనామములు కలవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము.
స్వతీర్ధమృద్భస్మభృతాంగభాజాం
పిశాచదుఃఖార్తిభయాపహాయ |
ఆత్మస్వరూపాయ శరీరభాజాం
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
ఆయన దేవాలయమున ఉన్న పుణ్యపుష్కరణి స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన భూతప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు,భయములు,రోగములు,తొలగించే ఆత్మస్వరూపుడై దేహమునందు నివసిస్తున్న వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము.
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ |
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీవైద్యనాథాయ నమఃశ్శివాయ ǁ
నీలకంఠుడు,వృషభమును పతాకమందు చిహ్నముగా కలవాడు,పుష్పములు,గంధము,భస్మముచే అలంకరించబడి శోభిల్లేవాడు, సుపుత్రులు,మంచిధర్మపత్ని,సత్సంపదలు,అదృష్టమును ఇచ్చేవాడు వైద్యనాథుడైన శివునకు నా నమస్కారము.
ఫలశృతిః
బాలాంబికేశ వైద్యేశ భవ రోగ
హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణమ్ ǁ
బాలాంబికాపతి,జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం మూడుసార్లు పఠించే వారికి సకల రోగనివారణ కలుగును..
Tags: Sri Vaidyanatha Ashtakam, lingashtakam telugu, dakshinamurthy ashtakam, vishnu kavacham telugu, lalitha sahasranamam, lord shiva, shiva stotram