కార్తీక దామోదర మాస స్నానం వైశిష్ట్యం.!! కార్తీక స్నానం ఏ సమయంలో చేయాలి? Importance of Karthika Snanam

కార్తీక దామోదర మాస స్నానం వైశిష్ట్యం :...!!

మనకు సంవత్సరములో ఉన్న అన్ని రోజులు ఒకటే , అన్ని నెలలు ఒకటే అని మనం మామూలుగా అనుకుంటాము.. మన భారతీయ ఆర్ష ధర్మ శాస్త్రాల ప్రకారం మన ఋషులు కొన్ని ప్రత్యేక మాసాలలో మనం చేసే  ధర్మ కార్యాలు , ఆయా  మాసాలలో  చేసే అనుష్ఠానం మిగతా మాసాల కంటే అధిక ఫలం ఇస్తుందని చెబుతారు.

కారణం ఆయా మాసాలు గ్రహ స్థితులు, పంచ భూతాలు  మరియు ప్రకృతి  మనిషికి అత్యధికంగా వారు చేసే అనుష్టానానికి  సహకరిస్తాయి.

మనకున్న మాసాలలో  వైశాఖం,  ఆషాడం, కార్తీకం, మార్గశిరం అత్యధిక పుణ్యాన్ని కలిగించే మాసాలు. ..

మనం సులువుగా వీటిని  గుర్తు పెట్టుకుకోవాలి అంటే  "ఆ కా మా వై- ఆషాడం, కార్తీకం, మార్గశిరం, వైశాఖం "  అని కూడా సులువుగా గుర్తు పెట్టుకోవచ్చు.

ఇపుడు ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయి కార్తీకం వచ్చేసింది. కార్తీకం అంటే వన భోజనాలు, కార్తీక స్నానాలు , మండల పూజలు అటు శివునికి, ఇటు దామోదరునికి అత్యధిక ప్రియమైన మాసంగా ఈ కార్తీకంలో ఆర్ష భూమిలో అనుసరిస్తారు.

కార్తీక మాసానికి మరో పేరు దామోదరమాసం  అని కూడా పేరు. ఈ మాసములో చేసే పుణ్య కార్యాలు అత్యధిక ఫలితం ఇస్తాయని మన ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసములో చేసే  స్నానాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని శాస్త్ర వచనం.

ఈ పవిత్ర కార్తీక మాసములో ఆకాశ గంగ అన్ని నదుల్లోకి తటాకాల్లోకి, చెరువుల్లోకి ఎక్కడ శుభ్రమైన నీరు ఉంటే అక్కడ ప్రవేశిస్తుంది . పైగా ఈ మాసములో వర్షాల వల్ల నదులు, చెరువులు, కుంటలు, ఏళ్ళు సెలయేర్లు నిండుగా  పారుతుంటాయి.

అనేక వనమూలికలు , వేళ్ళు  నాని ఈ నీళ్లకు మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రభావాన్ని   కూడా కలిగి ఉంటాయి .  ఈ మాసములో చేసే స్నానాలు  మనిషికి ఆరోగ్యాన్ని మాత్రమే గాక వారికీ మంచి ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగించి మనిషిలో సాత్వికతను పెంపొందిస్తుంది.

ఈ కార్తీక మాసములో బ్రహ్మ  ముహూర్తములో  మన ఇంటిలో  నిలువ ఉన్న  చన్నీళ్లతో మనం చేసే పుణ్య స్నానం - ఆరు సంవత్సరాలపాటు పుణ్య నదుల్లో చేసిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది.

మన ఇంటికి దగ్గరలో ఉన్న బావిలో ఉన్న నీటితో  బ్రహ్మ ముహూర్తాన స్నానం చేస్తే  పండ్రెండేళ్లు పుణ్య నదీ నదాల్లో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది.

ఈ  కార్తీక  మాసములో సరస్సులో స్నానం చేస్తే ఆ వ్యక్తికి  ఇరువది నాలుగు   వర్షాలు  పుణ్య నదీ స్నానాలు ఆచరించిన పుణ్యం కలుగుతుంది.

మనకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక నదిలో నదీ స్నానం  చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి తొంబై ఆరేళ్ళ పాటు పుణ్య నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుంది.

పవిత్ర నదుల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి 9600  ఏళ్ళ పాటు పుణ్య నదీస్నాన ఫలితాన్ని ఈ మాసం  కలుగజేస్తుంది.

పవిత్ర నదీ సంగమాల్లో స్నానం చేసి అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి 38400  ఏళ్ళ పాటు పవిత్ర నదీ స్నానం చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది.

ఈ దామోదర మాసములో గంగా , యమునా, సరస్వతి , కృష్ణ , గోదావరి , కావేరి వంటి పుణ్య నదుల్లో  బ్రహ్మ ముహూర్తములో స్నానం చేసి  అనుష్ఠానం చేస్తే ఆ వ్యక్తికి 3 ,84 ,00000   పుణ్య నదీస్నాన ఫలితాన్ని అందజేస్తుంది అని శాస్త్ర వచనం.

ఈ కార్తీక మాసములో త్రివేణీ సంఘములో అనగా ప్రయాగలో  నదీ స్నానం చేసి అనుష్ఠానం చేస్తే గంగాది పుణ్య నదుల్లో చేసిన పుణ్య ఫలితానికి వంద శాతం అధికం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసములో సకల నదులు కలసే  సముద్రములో  స్నానం చేసి అనుష్ఠానం చేస్తే   వీటన్నింటి కంటే అమిత ఫలితం కలుగుతుందని శాస్త్ర వచనం.

ఈ మాసములో మొత్తం నెల పుణ్య స్నానాలు చేసి అనుష్ఠానం చేయలేని వారు కనీసం మాసం చివరి రోజులో అయినా   పుణ్య స్నానాలు ఆచరించి అనుష్టానము చేస్తే కూడా అంత్య  పుష్కరాలలో పుష్కర స్నానం చేసిన  పుణ్యం కలుగుతుందని మనకు మన శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ దామోదర మాసములో నదీ స్నానాలు లేదా పుణ్య స్నానాలు చేసిన తర్వాత  ఈ కింద ఇవ్వబడిన అర్ఘ్య మంత్రం  భక్తిపూర్వకంగా అనుష్టించి అర్ఘ్యం సమర్పించాలి.

నమః కమల నాభాయ సమస్త జల శాయినే

నమస్తేషు హృషీ కేశాయ గృహణ్యార్ఘ్యం  నమోస్తుతే

అర్ఘ్య మంత్రం కార్తీక స్నానానంతరం

నిత్య నైమిత్తికే  కృష్ణ కార్తీకే పాప నాశనే

గృహణ్యార్ఘ్యం మయా దత్తం రాధాయ సహితో హరే 

వ్రతినః కార్తీక  మాసి స్నాతస్య  విధి వన్మమ 

గృహణ్యార్ఘ్యం మయా దత్తం రాధాయ సహితో హరే

కార్తీక స్నానాలు నదీ నదాలలో  వీలు కాని వారు కనీసం  అరుణోదయత్పూర్వం  తమ తమ గృహాలలోనే  స్నాన సంధ్యాదులు  చేసి  అనుష్ఠానం  చేసి పవిత్రమైన మానసముతో  ఈ మాస నియామకుడు అయిన ఇందిరా దామోదరుని సేవించిన వారికి  సకల శుభాలు చేకూరుతాయి. స్వస్తీ

Tags: Importance of Karthika Snanam, Karthikam, Karthika Masam, Karthika Snanam slokam, Karthika Purnima

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS