మహిషాసురుడనే రాక్షసుని పరమేశ్వరి వధించిన వృత్తాంతము - The Story of Mahishasura Mardhini

మహిషాసురుడనే రాక్షసుని పరమేశ్వరి వధించింది కదా? ఆ వృత్తాంతము వివరించండి" అన్నాడు నారాయణభట్టు. వివరించటం ప్రారంభించాడు రత్నాకరుడు.

బ్రహ్మ మానస పుత్రుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు. ఇతడికి ధనువు నందు రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. వీరికి సంతానం లేదు. అందుచేత సంతానం కోసం తపస్సు చెయ్యటం మొదలు పెట్టారు. కరంభుడు పీకలోతు నీటిలో దిగి తపస్సు చేస్తున్నాడు. ఆ విషయం తెలిసిన ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంబుణ్ణి చంపేశాడు. రంభుడు పంచాగ్ని మధ్యన ఉండి తపస్సు చేస్తున్నాడు.

తన అన్న మరణించిన విషయం తెలుసుకున్న రంభుడు ఇంద్రుని మీద పగ తీర్చుకోవటానికి సరియైన బలాఢ్యుడు, దేవతలను జయించగలిగినవాడు కుమారుడిగ కావాలి అని అగ్నిదేవుని ప్రార్ధించాడు.అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి రంభుడు "స్వామీ! అజేయుడు, అపూర్వ బలశాలి, కామరూపి, ముల్లోకాలను జయించగలవాడు అయిన కుమారుడు కావాలి" అన్నాడు. "ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ముందుగా నీవు ఎవర్ని చూసి మోహిస్తావో, వారి యందు పై లక్షణాలు గల తనయుడు పుడతాడు" అని వరమిచ్చాడు.

రంభుడు ఇంటికి బయలుదేరాడు. త్రోవలో యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది. కాంతలు ఎంతోమందిని చూశాడు. అతని మనసు చెదరలేదు. ఒక సెలయేటి వడ్డున మహిష్మతి అనే గంధర్వ కాంత శాపవశాన మహిషముగా జన్మించి గడ్డిమేస్తోంది. దాన్ని చూడగానే మనస్సు చలించింది రంభుడికి ఆ గేదె గర్భం దాల్చింది. ఆ గేదెను ఇంటికి తీసుకుపోయాడు రంభుడు. కొంతకాలానికి మనిషి శరీరము, దున్నపోతు తల కల బాలుని ప్రసవించింది ఆ గేదె. వాడే మహిషాసురుడు.

పుత్రోదయం కాగానే శాపవిమోచనమయి గంధర్వ లోకానికి వెళ్ళిపోయింది మహిష్మతి. మహిషుడు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. మరణం లేకుండా వరం కావాలన్నాడు మహిషుడు. లాభం లేదు ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ, ఆలోచించాడు మహిషుడు. స్త్రీతో తప్ప వేరెవరితోనూ మరణం లేకుండా వరమియ్యమన్నాడు. తథాస్తూ అన్నాడు బ్రహ్మ.

వరప్రసాది అయిన మహిషుడు రాక్షస గణాలను చేరదీశాడు. ముల్లోకాలను జయించాలని సంకల్పించి యుద్ధానికి బయలుదేరాడు. భూలోకము అతనికి పాదాక్రాంతమైంది. ఇక దేవదానవ గణాల మధ్య యుద్ధం సాగుతోంది. ఆ యుద్ధంలో దేవతలు పరాజితులై త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళారు. త్రిమూర్తులతో సహా దేవతలంతా సభ తీర్చారు. మహిషుణ్ణి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దేవతలందరి ముఖాల నుండి వారి శక్తి బయటకు వచ్చి ఒక స్త్రీ మూర్తి అయింది. ఆ స్త్రీ మూర్తి శరీరములోని ఒక్కొక్క అంగము, ఒక్కొక్క దేవత యొక్క తేజస్సుతో నిండిపోయింది. ఈ రకంగా మహా తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ స్త్రీ మూర్తి తప్పకుండా మహిషుని సంహరిస్తుంది అని భావించారు. దేవతలు. అప్పుడు దేవతలందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాలను ఆమెకిచ్చారు. హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు. వివిధ రత్నాలు, ఆభరణాలు ఇచ్చాడు. వాటన్నింటినీ ధరించి ఆ పరమేశ్వరి పెద్దగా అట్టహాసం చేసింది. ఆ అట్టహాసానికి భూనభోంతరాళాలు దద్దరిల్లాయి. ఆ శబ్దం విన్నారు రాక్షసులు. అక్కడ వారికి పరమేశ్వరి కనిపించింది. ఆమెతో యుద్ధానికి తలపడ్డాడు.

రాక్షససేన పరమేశ్వరిని చుట్టుముట్టింది. వారందరినీ పరమేశ్వరి సంహరించింది. మహిషుని సేనాని చిత్తురాక్షుడు మరణించాడు. ఇక లాభం లేదని మహిషుడు పరమేశ్వరికి ఎదురు నిలిచాడు. వారిద్దరి మధ్య పోరు ఘోరంగా సాగింది. మహిషుడు తన నిజ స్వరూపం ప్రదర్శించాడు. లోకాలన్నీ అతలాకుతలం చేస్తున్నాడు. పరమేశ్వరి కాలితో మహిషుని పీక తొక్కిపట్టి, కత్తితో అతని శిరస్సు ఖండించి వేసింది అంటూ మహిషాసుర వధను పూర్తి చేశాడు రత్నాకరుడు.

Tags: mahishasura mardini, mahishasura mardini, navaratris, dasami, devi navaratrulu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS