గంగా పుష్కరాలు 2023 పూర్తి వివరాలు
గంగా పుష్కరాలు ఏప్రిల్ 22న ప్రారంభమై మే 3, 2023న ముగుస్తాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు (మేష రాశిలో గురు సంక్రమణం) గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఇది అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాథ్ మరియు కేదార్‌నాథ్ సంగం ప్రయాగ నగరాలలో జరుగుతుంది.
గంగానది పుష్కర వైభవం
పన్నెండేళ్లకోసారి వచ్చే పెద్దపండగకు గంగానది సిద్ధమవుతోంది. ఆ పన్నెండురోజులూ గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బదిరీనాథ్, కేదారనాథ్, వారణాసి, అలహాబాద్ క్షేత్రాలు పుష్కరశోభతో కళకళలాడతాయి. అసలు పుష్కరాలెందుకు? వాటి ప్రాశస్త్యం ఏమిటి? ... అదంతా ఓ పెద్ద కథ.
పూర్వం పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు. భక్తవశంకరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. పుష్కరుడు మణులో మాణిక్యాలో అడగలేదు. రాజ్యాలూ సామ్రాజ్యాలూ ఆశించలేదు. జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి. నదులు పునీతమైతే దేశమూ సుభిక్షంగా ఉంటుందని ఆ సత్పురుషుని ఆలోచన. అందుకే, 'దేవా... నా శరీర స్పర్శతో సర్వం పునీతం అయ్యేట్టు వరమివ్వు' అని ప్రార్థించాడు. అప్పుడు శివుడు 'నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది.
ఆ నదిలో స్నానమాచరించిన వారు పాపవిముక్తులవుతారు. జన్మరాహిత్యాన్ని పొందుతారు' అని వరమిచ్చాడు. పుష్కరుడు సంతోషించాడు. పుష్కర మహత్యం తెలుసుకున్న గురుడు(బృహస్పతి) తనకూ పుష్కరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను అడిగాడు. అందుకు పుష్కరుడు అడ్డుచెప్పాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సమాన ప్రాతినిధ్యం కల్పించాడు బ్రహ్మ. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు, బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి పన్నెండు రోజులనూ ఆది పుష్కరాలుగా, చివరి పన్నెండు రోజులనూ అంత్య పుష్కరాలుగా వేడుకలు నిర్వహిస్తారు.
గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో, గంగ పుష్కరాలు వెుదలవుతాయి. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరునితో సహా నదీజలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానంచేయడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారనీ పురాణాలు చెబుతున్నాయి.
రోజుకు పాతిక లక్షల మంది గంగలో మునుగుతారు. రోజుకు కోటిమంది పూజలోనో, వ్రతంలోనో, యజ్ఞంలోనో, పితృకార్యంలోనో గంగను తలుచుకుంటారు. గంగ పుట్టింది వెుదలు సముద్రంలో కలిసేదాకా... ప్రతి అడుగూ భారతీయులకు పవిత్రమే. ఆ ఒడ్డున ఎన్ని నాగరికతలు పుట్టాయి! ఎన్ని సామ్రాజ్యాలు వెలిశాయి! ఎన్నెన్ని మట్టి కొట్టుకుపోయాయి! మానవ వికాస చరిత్రకు గంగా ప్రవాహమే సాక్ష్యం'.
పురాణ కథ గంగా నది పుట్టుక :
ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరునికి ఇద్దరు భార్యలు... కేశిని, సుమతి. భృగుమహర్షి వరంతో కేశినికి అసమంజుడనే పుత్రుడు జన్మిస్తాడు. సుమతికి అరవైవేలమంది కొడుకులు పుడతారు. కొంతకాలానికి, సగరుడు అశ్వమేధయాగం తలపెడతాడు. అదెక్కడ విజయవంతం అవుతుందో అని ఇంద్రుడి భయం. దొంగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. చికట్లో యాగాశ్వాన్ని లాక్కెళ్లి, కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేస్తాడు. అశ్వమే లేనప్పుడు, అశ్వమేధ యాగమేమిటి? క్రతువు ఆగిపోతుంది. సగరుడు కుమిలిపోతాడు. అరవైవేలమంది తనయులూ ఆగ్రహంతో ఊగిపోతారు. యాగాశ్వం జాడ తెలుసుకోడానికి బయల్దేరతారు. ఆ గుర్రం కపిలుడి ఆశ్రమంలో కనబడుతుంది. కండబలంతో విర్రవీగుతున్న సగరపుత్రులు మహర్షి మీద అభాండాలు వేస్తారు. తపస్వికి కోపవెుస్తుంది. అరవైవేలమందినీ కంటిచూపుతో కాల్చేస్తాడు.
అసమంజుని కొడుకు అంశుమానుడు..పినతండ్రుల జాడ వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. చుట్టూ బూడిదకుప్పలు. విషయం అర్థమైపోతుంది. అరవైవేల పాపాల్ని ఒక్కదెబ్బతో కడిగేయగల శక్తి గంగకే ఉందని సలహా ఇస్తాడు గరుత్మంతుడు. సగరుడి తరం ముగుస్తుంది. అంశుమానుడి తరం ముగుస్తుంది. దిలీపుడి తరం ముగుస్తుంది. గంగను రప్పించడం ఎవరితరమూ కాదు. భగీరథుడి పాలన వెుదలవుతుంది. భగీరథ ప్రయత్నమూ వెుదలవుతుంది. అతని ఘోరతపస్సుకు మెచ్చి, బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేదని స్పష్టంచేస్తాడు. మధ్యలో ఓ మజిలీ అవసరమవుతుంది. పరమశివుడికే ఆ సామర్థ్యం ఉందంటాడు. భగీరథుడు శివుడ్ని ప్రార్థిస్తాడు. గంగను నెత్తినెక్కించుకోడానికి ముక్కంటి ఒప్పుకుంటాడు.
శివుడి జటాఝూటాల్లోంచి... గంగావతరణ వెుదలవుతుంది.
శివుడినెత్తిన ఉన్న సురగంగ...
హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో భూమిని పాయలుగా తాకుతుంది. తూర్పువైపున... హ్లాదిని, పావని, నళిని. పశ్చిమం దిక్కున... సుచక్షు, సీత, సింధు. వెుత్తం ఆరుపాయలు. ఏడోపాయ మాత్రం భగీరథుడి రథం వెనకాలే పరిగెడుతుంది. దార్లోనే జహ్ను మహర్షి ఆశ్రమం.ఆ ప్రవాహానికి తాటాకు గుడిసెలన్నీ కొట్టుకుపోతాయి. మహర్షి ఆగ్రహోదగ్రుడవుతాడు. గంగను దోసిట్లో పట్టేసుకుని తీర్థంలా తాగేస్తాడు. ఆ బందిఖానా నుంచి విడుదలచేయమని అంతా వేడుకుంటారు. లోకకల్యాణార్థం మహర్షి సరేనంటాడు. చెవిలోంచి బయటికి వదిలేస్తాడు. ఎత్తుపల్లాల్ని దాటుతూ... ఎగుడుదిగుడుల్ని అధిగమిస్తూ... అపుడపుడూ ఉద్ధృతంగా... అక్కడక్కడా మందగమనంతో... ప్రవహించి ప్రవహించి భరతఖండాన్ని పావనం చేస్తుంది పుణ్యాల గంగ.
భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది. జహ్ను పొట్టలోంచి పుట్టి జాహ్నవిగా పరిచయమైంది. నింగి, నేల, పాతాళం-మూడులోకాలు. తూర్పు, పడమర, దక్షిణం-మూడు దిక్కులు. ముచ్చటగా మూడువైపులా పారి, 'త్రిపథగ' అన్న పేరునూ సార్థకం చేసుకుంది. ఆ ప్రవాహం పుణ్యమాని సగరులు ముక్తులయ్యారు. భూమి మురిసిపోయింది. దేవతలు పులకించారు. మానవులు పరవశించారు. జలచరాలు జయజయధ్వానాలు చేశాయి. పచ్చని పంటలు ప్రాణంపోసుకున్నాయి. భూమి స్వర్గమైంది. ఆ వైభోగం ముందు, అసలు స్వర్గం చిన్నబోయింది. గంగ భూమికి దిగొచ్చినరోజే, మకర సంక్రాంతి!
ఆది గంగ...
గంగ పుట్టుక వెనుకా ఓ ఐతిహ్యం ఉంది. వామనుడు మూడడుగుల నేల అడిగాడు. బలి సవినయంగా సమర్పించుకున్నాడు. ఒక అడుగు భూమిని ఆక్రమించింది. రెండో అడుగు...ఇంతై ఇంతింతై బ్రహ్మలోకం దాకా విస్తరించింది. సాక్షాత్తు విష్ణుమూర్తి పాదం... గడపదాకా రావడమంటే, ఎంతదృష్టం! భక్తితో కాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు బ్రహ్మ. ఆ తీర్థమే... సురగంగగా అవతరించింది. భగీరథుడి కృషితో భూలోకానికి వచ్చింది. భారతీయుల హృదయగంగై ప్రవహించింది. భూగోళశాస్త్ర పరంగా చూసినా... గంగ ఇప్పటిది కాదు. వేదకాలం నాటికే ప్రవహించింది. కానీ అప్పట్లో సింధు, సరస్వతి నదులకే ప్రాధాన్యం.
రుగ్వేద రుక్కులు ఆ రెండు నదుల్నే కీర్తించాయి. ఓచోట 'గంగ' ప్రస్తావన ఉన్నా, ఆ మాట నీటికి సంబంధించిందో, ఏటికి సంబంధించిందో స్పష్టంగా తెలియదు. రుగ్వేదానంతర కాలంలో గంగ ప్రాధాన్యం పెరిగింది. వేదర్షులు గంగానదిని 'జాహ్నవి' అని పిలిచారు. రామాయణం నాటికి గంగకు పూజనీయ స్థానం లభించింది.
రామావతారంలో తాను గంగానది ఒడ్డునే పుడతానని విష్ణువు దివిజగంగకు మాటిచ్చాడు. సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు గుహుడు దాటించింది గంగానదినే. ఇక భారతమైతే గంగ ప్రవేశంతోనే గొప్ప మలుపు తిరుగుతుంది. శంతన మహారాజు అద్భుత సౌందర్యరాశి అయిన గంగ మీద మనసుపడతాడు. వరాలిచ్చి మనువాడతాడు. ఆ జంటకు పుట్టిన బిడ్డే భీష్మపితామహుడు.
జల సాక్షి...
భారతీయుల జీవితాలు గంగతోనే ముడిపడ్డాయి. బిడ్డ పుట్టగానే గొంతులో ఓ చుక్క గంగతీర్థం పోయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. బిడ్డకు చేయించే తొలి స్నానం గంగాజలంతోనే. 'గంగేచ, యమునేచైవ గోదావరీ సరస్వతీ...' అంటూ పెద్ద ముత్తయిదువలు గంగమ్మను గంగాళంలోకి ఆహ్వానిస్తారు. ఆ పిలుపు వినిపించగానే, సర్వనదుల ప్రతినిధిగా... సురగంగ బిరబిరా తరలివస్తుంది.
గంగ! గంగా పరీవాహక ప్రాంత ప్రజలు సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు... తాము గంగకు ఏ దిక్కున ఉన్నారో పరమాత్మకు విన్నవించుకోవాలి. లేదంటే, ఆ వెుర దేవరకు చేరదు. భారతీయులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా మునిగి తీరాలనుకునే జలక్షేత్రాల్లో గంగానది ఒకటి. ఆ స్పర్శతో సకలపాపాలూ హరించుకుపోతాయన్న నమ్మకం. అందుకే పితృదేవతలు పైలోకాల్లోంచి మనం గంగలో ఎప్పుడు మునకలేస్తామా అని ఎదురుచూస్తుంటారట. జీవిత చరమాంకంలో, మృత్యుఘడియ దగ్గరపడుతున్నప్పుడు... శ్వాస సహకరించకున్నా, గొంతు పెగలకున్నా, మాట తడబడుతున్నా ఎక్కడలేని శక్తిని కూడదీసుకుని 'గంగ...' పోయమని అర్థిస్తాడు జీవుడు. తులసి కలిసిన ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తే నేరుగా పుణ్యలోకాలకు చేరుకుంటామన్న నమ్మకం.
మహాభారతంలో... అంపశయ్య మీది నుంచే భీష్ముడు గంగా మహత్తును వివరిస్తాడు. ఒక్క గంగాస్నానంతో... యజ్ఞయాగాదులు చేసినంత పుణ్యం, పూజలూ వ్రతాలూ చేసినంత ఆధ్యాత్మిక సంపత్తి. గంగ తగిలితే చాలు... అటు ఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ పవిత్రమైపోతాయట. గంగ లేని దేశం... సోమం లేని యజ్ఞమట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట. పూలు పూయని చెట్టులాంటిదట. 'ఇన్ని మాటలెందుకు కానీ, గంగ గొప్పదనం చెబుతూ పోతే, సముద్రంలో నీటి కణాల్ని లెక్కపెట్టినట్టే ఉంటుంది' అంటాడు భీష్మపితామహుడు! గంగ మహత్యానికి కొన్ని శాస్త్రీయమైన కారణాలూ ఉన్నాయి. ఆ నీటికి కఫాన్ని తగ్గించే గుణం ఉంది. అందుకేనేవో, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నవారి గొంతులో చిటికెడు గంగ పోస్తారు.
గంగానదిలోని కొన్నిరకాల సూక్ష్మక్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన వెుక్కల్నీ వనమూలికల్నీ తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అన్నిటికీ మించి, గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి..ఆ నీటికి అంత మహత్తునిచ్చింది.
గంగా ప్రవాహం...
గంగోత్రి హిమనీనదంలో పుట్టిన భగీరథి దేవ ప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి... 'గంగ' అవుతుంది. హరిద్వార్ దగ్గరికొచ్చి... జనగంగ అవుతుంది. కోసి, గోమతి, శోణ తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి. అలహాబాద్ దగ్గర యమున తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో చిన్నాపెద్దా నదులు గంగలో కలిసి ఉద్ధృతిని పెంచుతాయి. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా దగ్గర గంగ వెుదటిసారి చిలుతుంది. అక్కడి నుంచే గంగానది చిలిక... హుగ్లీనది వెుదలవుతుంది. ప్రధాన గంగను... మాల్దా తర్వాత పద్మానది అంటారు.
బంగ్లాదేశ్‌లో ప్రవేశించాక, బ్రహ్మపుత్ర చిలిక అయిన జమునానది ఇందులో కలుస్తుంది. ఆతర్వాత మేఘన జతవుతుంది. ఆతర్వాత ఎన్నో చిలికలుగా ప్రవహించి... బంగాళాఖాతంలో కలుస్తుంది.
Tags: గంగా పుష్కరాలు, గంగా పుష్కరాలు 2023, Ganga River Pushkaralu, Ganga Pushkaram 2023, Ganga-Pushkaralu, Ganga Pushkaralu 2023 places, 2023 Pushkaralu in Telugu, Ganga Pushkaralu ghats List