కాస్త టైం కేటాయించి చదవండి..
పదమూడు కాసుల బంగారం
పరమాచార్య స్వామివారు కంచి పొలిమేర్లలో ఉన్న శివాస్థానం వద్ద మకాం చేస్తూ ఉన్నప్పుడు తమిళ దేశంనుండి ఒక పేద బ్రాహ్మణుడు స్వామిని సందర్శించాడు.
తన కుమార్తె వివాహం తలపెట్టుకున్నాననీ, అయితే వరుడు తరుపువారు వరకట్నం కింద పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారని, ఆ కట్నం ఇచ్చుకునే శక్తి తనకు లేదని, ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో అక్కడికి వచ్చాననీ దీనంగా విన్నవించుకున్నాడు.
“స్వామీ! వేరే దిక్కు లేక మీ వద్దకు వచ్చాను. మీరు అనుగ్రహిస్తే తప్ప, నా కుమార్తెకు మెళ్ళో మూడు ముళ్ళు పడే అవకాశం లేదు.” అని కంట నీరు పెట్టుకుంటూ చేతులు కట్టుకు నిలబడ్డాడు.
స్వామి వారు, ”నేను సన్యాసిని. నీకివ్వడానికి నా వద్ద బంగారం ఎక్కడ ఉంటుంది. నా ఎదుట విలపిస్తే ఏం లాభం? ఊళ్ళోకి పోయి, కామాక్షీ అమ్మ దగ్గర కూర్చొని, నీ గోడు చెప్పుకో! నీ ఘోష విని ఆమె ఏదైనా కటాక్షించవచ్చు అని అనారు.
“సరే అట్లాగే చేస్తాను” నంటూ ఆ బ్రాహ్మణుడు అంగోస్త్రం నడుముకు బిగించుకుని, కామాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి, ఆ దేవికి ఎదురుగా కూచుని ఆమెను ప్రార్థించాడు.
కొంతసేపయింది. ఉత్తరదేశం నుండి ఎవరో ఒక షావుకారు స్వామి వారిని దర్శించడానికి శివాస్థానం వచ్చాడు. స్వామికి నమస్కరించాడు. స్వామి వారు కుశల ప్రశ్నలు వేసారు.
స్వామి వారి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళబోయేముందు ఆ షావుకారు లోపలిజేబులో నుండి ఒక పొట్లం తీసి, శిష్యుడిచేత ఒక పళ్ళెం తెప్పించి, ఆ పొట్లం ఆ పళ్ళెంలో పెట్టి, స్వామికి సమర్పించాడు.
స్వామి వారు “ఏమిటా పొట్లం” అని అడిగారు. ”అందులో కాస్త బంగారం ఉంది. దానిని తమకు సమర్పించుకుంటున్నాను” అన్నాడు షావుకారు.
”సన్యాసిని నాకెందుకు ఆ బంగారం? నన్నేమి చేసుకోమంటావు?”
“స్వామీ మీకు సమర్పించాలని నాకెందుకో అనిపించింది. దానిని మీ చిత్తం వచ్చినట్టు వినియోగించండి. మీరు ఏమి చేసినా నాకు సమ్మతమే.”
“సరి పరమేశ్వరి నిన్ను రక్షిస్తుంది. సుఖంగా వెళ్ళిరా” అని దీవించి పంపారు.
షావుకారు బయలుదేరి వెళ్ళిన కాసేపటికి, కుమార్తె పెళ్ళి నిమిత్తం వచ్చిన బ్రాహ్మణుడు అమ్మవారి గుడినుండి తిరిగి వచ్చాడు.
“స్వామీ తాము సెలవిచ్చినట్టు అమ్మ దగ్గరకు వెళ్ళి నా కథంతా వెళ్ళబోసుకున్నాను. ఎట్లాగైనా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించాలి” అంటూ స్వామి ముందు కూలబడ్డాడు.
పక్కన బల్ల పైన ఉన్న పళ్ళెం చూపించి, స్వామి వారు ఇలా అన్నారు. ”ఆ పళ్ళెంలో ఒక పొట్లం ఉన్నది. ఆ పొట్లంలో ఏమున్నదో దాన్ని విప్పి చూడు.”
వణుకుతున్న చేతులతో బ్రాహ్మణుదా పొట్లం విప్పి చూసాడు. ”ఏమున్నది ఆ పొట్లంలో” అని అడిగారు.
ఆ బ్రాహ్మణుడు భయంతో, సంభ్రమంతో “బంగారు కాసులున్నవి స్వామీ!” అని అన్నాడు.
”ఎన్ని ఉన్నవి? లెక్కపెట్టు.”
అతను లెక్కవేసి, “పదమూడు కాసులు” తడబడుతూ సమాధానం చెప్పాడు.
”నీవెన్ని కాసులు కావాలన్నావు?”
“పదమూడే స్వామీ!”
“సరే సరే, అవి తీసుకువెళ్ళి నీ కుమార్తె వివాహం చేసుకో”
ఆ బ్రాహ్మణుడు ఆనందభాష్పాలతో “అనుగ్రహం స్వామీ, పరమానుగ్రహం” అంటూ స్వామి పాదాలకు సాగిలబడ్డాడు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
Famous Posts:
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
Tags: Chandrashekarendra Saraswati, Paramacharya, Kanchi, Kanchi Paramacharya,
Chandrasekharendra Saraswathi Miracles