మానవ శరీరం గురించి శివుడు పార్వతికి ఉపదేశించిన పరమ రహస్యాలు..!
స్వరం ఒకటి మూడు రూపములుగాను..అయిదు రూపములుగాను అగును.
ఈ అయిదు మరలా ఒక్క రూపముగా అగును.
మరలా అయిదు చొప్పున ఇరువైయిదు విధములుగా అగును.
శరీరం నందు స్వరం పుట్టును .
స్వరము నందు నాడిపుట్టును.
స్వర నాడుల స్వరూపం తెలియచేయుటకు శరీరం చెప్పబడుచున్నది.
శరీరం పిండం అనబడును.
ఆ పిండం నందు శరీరం అణిగి ఉండును.
శుక్ల శోణిత సమ్మితం అగు ఆ పిండం చైతన్యముతో కూడుకుని ఉండును.
ఆ శుక్ల శోణితములు నాలుగు దినముల వరకు ప్రతి దినము నందు సమ్మేళనం అగుచుండును.
అయిదు దినములకు బుడగ వలే అగును.
పది దినములకు నెత్తురు అగును.
పదిహేను దినములకు మాంసం ముద్ద అగును.
ఇరువది దినములకు గట్టి మాంసం ముద్ద అగును. ఇరువైదు దినములకు సమాన రూపం అగును.
మొదటి నెల యందు పంచభూతములు కూడును. రెండవ నెల యందు మేథస్సు కలుగును.
మూడవ నెల యందు ఎముకలు మజ్జ కలుగును. నాలుగవ మాసము నందు అవయవములు జనించును.
అయిదవ మాసము నందు రంధ్రములతో గూడిన చెవులు , ముక్కు, కన్నులు , నోరు మొదలగునవి జనించును.
ఆరవ మాసం నందు కంఠరంధ్రం , ఉదరం పుట్టును.
ఎడవ మాసం నందు పుట్టిన శిశువు బ్రతుకును గాని అల్పాయువు లేదా అల్పబలము , క్షీణ థాతువు గల రోగి అగును.
ఎనిమిదవ మాసము నందు పుట్టిన శిశువు ఏ విధముగానూ బ్రతకదు .
తల్లి దేహము మరియు శిశువు దేహము నందు ప్రాణం తిరుగుచుండును .
కావున తల్లి గాని శిశువు గాని బిడ్డ గాని మృతినొందును.
తొమ్మిదవ మాసమున గర్భమునకు జ్ఞానము కలుగును. తొమ్మిదవ మాసమున గాని పదవ మాసమున గాని ప్రాణములతో పుట్టును.
స్త్రీలకు ఋతుదినము మొదలు 16 వ దినముల వరకు కళ హెచ్చి గర్భము నిలుచును. కావున సరి దినములలో స్త్రీతో గూడిన పురుష గర్బము , బేసిదినములలో గూడిన యెడల స్త్రీ గర్బము కలుగును.
పుత్ర సంతానం కోరువాడు సరి దినముల యందు ఋతు స్నానం చేసిన స్త్రీతో సంగమం జరుపవలెను.
స్త్రీ యొక్క రేతస్సు అధికంగా ఉండి పురుషుని యొక్క వీర్యం తక్కువుగా ఉన్న ఆడ సంతానం కలుగును. పురుషుని వీర్యం ఎక్కువుగా ఉండి స్త్రీ రేతస్సు తక్కువుగా ఉన్న మగవాడు పుట్టును.
ఋతుస్నానం అయిన రాత్రి సంగమం వలన గర్బం నిలిచినచో పుట్టిన మగవాడు అల్పాయువు , దరిద్రుడు అగును.
గర్బం అయిదవ దినమున అయిన కూతురు మంచి పుత్రులు కలిగినదిగా ఉండును.
ఆరవ దినమున అయిన యెడల మధ్యమ గుణము కలవాడు అగును.
ఎడవ దినమున అయిన యెడల పుత్రవతి యగు కూతురు ,
ఎనిమిదవ దినమున మహదైశ్వర్య సంపన్నడగు కుమారుడు ,
తొమ్మిదవ దినమున పతివ్రత అగు కూతురు ,
పదవ దినమున మంచి కుమారుడు పుట్టును .
ఈ విధముగా ఒక్కొ దినముకు ఒక్కొ ప్రాముఖ్యత సంతానం విషయంలో ఉండును.
ఎముకలు , మెదడు , వీర్యం ఇవి తండ్రి నుంచి సంక్రమించును.
నెత్తురు , రోమములు , మాంసం తల్లి నుంచి సంక్రమించును.
రోమములు , చర్మము , ఎముకలు , మాంసము ఇవి పృథ్వి అంశములు ,
శుక్లము, పురీషము , మూత్రము , నిద్ర ఆలస్యము ఇవి ఉదక అంశములు.
ఆకలి , దప్పిక , దేహకాంతి ఇవి తేజస్సు యొక్క అంశములు ,
ముడుచుకొనుట , చాచుకొనుట , పారుట, కదులుట, వణుకుట, నిలుచొనుట ఇవి వాయు అంశములు.
కోపం , సిగ్గు , భయం , మోహం ఇవి ఆకాశం యొక్క అంశములు.
నాలిక , చర్మము , చెవులు , ముక్కు , కన్నులు
ఈ అయిదు జ్ఞానేంద్రియములు ,
ఉపస్థము , ఆసనం , వాక్కు , హస్తములు , పాదములు ఇవి కర్మేంద్రియాలు.
మూలాధారం నందు నాలుగు దళముల పద్మము ,
యోని నందు ఆరు దళముల పద్మము ,
నాభి యందు పది దళముల పద్మము ,
హృదయము నందు పండ్రెండు దళముల పద్మము ఉండును.
కంఠము నందు పదహారు దళముల పద్మము , కనుబొమ్మల నడుమ రెండు దళముల పద్మము ,
బ్రహ్మ రంధ్రము నందు వేయి దళముల పద్మము ఉండును.
ఈ ఏడు పద్మములును సప్తచక్రములు అనబడును. దేహమునందు ఉండు నాడులు అనేక రూపాలుగా విస్తారంగా ఉండును.
ఇవి పెద్దలైన యోగ గురువులచేత ఆత్మజ్ఞాన నిమిత్తం తెలుసుకొనవలెను.
సప్త ద్వీపములు , ఇరువదియేడు నక్షత్రములు , నవగ్రహములు వీనిని శరీరం నందు తెలుసుకొనిన వాడే గురుడు అనబడును.
నాభికి దిగువును మీదను మొలకల వలే బయలుదేరి డెబ్భైరెండువేల నాడులు దేహ మధ్యంబు ఉండును.
అడ్డముగా , పొడుగుగా , క్రిందగా దేహం మొత్తం వ్యాపించి చక్రముల వలే సకలమై సిరలు తిరుగుచూ ప్రాణం ఆశ్రయించి యుండును.
నాభికి దిగువుగా కుండలిని స్థానం నందు సర్పాకృతిగా ఒక నాడియు మీదుగా పది నాడులు కిందగా పది నాడులు ఉండును.
సూక్షముఖములు అగు ఆ నాడుల నడుమ ఉత్తమమైన చక్రం ఒకటి ఉన్నది .
అందు ఇడా , పింగళ , సుషుమ్న అను మూడు నాడులు కలవు.
ఆ నాడులలో సూక్ష్మ ముఖములు అగు ముఖ్యమైన నాడులు పది ఉన్నవి.
వాటి పేర్లు వరసగా ఇడ, పింగళ , సుషమ్న , గాంధారి , హస్తి, జిహ్వ, పూషలము , భూషితము , కుహక , శంఖిని , శారద అనునవి కలవు.
వాటిలో ఇడ , పింగళ నాడులు వాయువునెల్లప్పుడు వహించి ఉండును.
సుషమ్న నాడి కాల మార్గముచే బ్రహ్మ రంధ్రము నందు ఉండును.
పూషలము , భూషితము అను నాడులు నేత్రముల యందు ఉండును.
గాంధారి , హస్తిజిహ్వ ఈ రెండును చెవి ద్వారము నందు ఉండును.
కుహక గుదస్థానం నందు , శంఖిని లింగ రంధ్రము నందు ఉండును. శారద నోటి యందు ఉండును.
మానవ శరీరం నందు ప్రాణము , అపానము , సమానము , ఉదానము , వ్యానము , నాగము , కూర్మము , కృకరము , దేవదత్తము , ధనుంజయము
అనే పది రకాల వాయువులు ఉండును.
పైన చెప్పిన ఆ పది నాడులలో ముఖ్యమైన ప్రాణవాయువు నాభిగుహ యందు ఉండినదై ముఖం , నాసిక , హృదయము , నాభి ఈ నాలుగు స్థలముల యందు సంచరించుచుండును.
నాభి యందు శబ్దము , నోటి యందు ఉచ్చరణం , ముక్కున ఉచ్చ్వాస నిశ్వాసములు ,
హృదయము నందు దగ్గు వీనిని పుట్టించును .
అపానవాయువు , పిరుదులు , పిక్కలు వీనికి మధ్యభాగమునను ,
గుదము , లింగము , నాభి , వృషణము , తొడలు , మోకాళ్లు స్థానముల యందును ఉండును. ఈ అపాన వాయవు మలమూత్రాదులను బయటకి పంపును.
వ్యాన వాయవు కన్నులు , చెవులు , కాలి మడములు , పిరుదు , ముక్కు , ఈ స్థానముల యందు ఉండును.
ఈ వ్యాన వాయవు ప్రాణాపాన వాయువులను వెలుపలికి పోవునట్లు లోపలికి వచ్చునట్లు చేయును.
సమాన వాయవు శరీరం నందు నాభిస్థానం నందు ఉండి జఠరాగ్నితో గూడి డెబ్బైరెండువేల నాడీ రంధ్రముల యందు ఉండును.
భుజించబడిన , తాగబడిన పదార్ధాల రసములను దేహమున వ్యాపింపచేసి దేహపుష్టిని కలుగచేయును.
ఉదానవాయువు కంఠం నందు ఉండి చేతులు , కాళ్లు మొదలైన అంగాల సంధుల యందు వ్యాపించి చాచుట, ముడుచుకొనుట మొదలగు కార్యములు నిర్వర్తించును.
ధనుంజయ వాయవు వలన ఘోషము ,
మాటలాడుట నాగము వలన ,
ఆవులింత దేవదత్తం వలనను ,
తుమ్ము కృకరము వలనను ,
కన్ను మూసి తెరచుట కూర్మం వలనను కలుగును.
మనిషి మరణించిన తరువాత దేహం ఉబ్బిపోవుటకు కూడా ఈ ధనుంజయ వాయవు కారణం.
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
Tags: శివుడు పార్వతి, human body, Lord Shiva taught Parvati, Lord Shiva, Parvati, Shiva Story, Shiva, Parvatulu, Shiva Secrets