సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు | Importance Of Sankranti In Telugu

సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు

హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ...

ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ  సంప్రదాయాన్ని పేర్కొంటారు.

యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఆ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు.

కార్తీకం నెలపొడుగునా స్నానాలని చేసినట్లే ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా  ప్రతిరోజూ స్నానాలని చేయాలన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని పుట్టు నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసం అవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ (రోహిణి శశినం యథా). ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’.

కాబట్టి ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మాసంలో స్నానాలని చేస్తూన్న మనకి చంద్రుడు మనశ్శాంతిని (చంద్రమా మనసో జాతః) అందిస్తాడు. చలీ మంచూ బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో గనుక మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం.

రంగవల్లికలు

రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన వల్లికలు (ఆలోచనలు) వస్తూ ఉంటాయి. ఆ అన్నిటికీ కేంద్రం (ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గదిలాంటి భాగం) సూర్యుని గడి కాబట్టి అక్కడ కుంకుమని వేస్తారు మహిళలు. కాబట్టి ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమ బుద్ధికి అనుగుణంగానే ఈ వల్లికలన్నీ ఉంటాయనేది యోగదృష్టి.ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను... అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట.

గొబ్బెమ్మలు

స్నానాలనేవి పురుషులకే కాదు. స్త్రీలకి కూడా నిర్దేశింపబడినవే. అందుకే వారికి సరిపడిన తీరులో వాళ్లని కూడా యోగమార్గంలోకి ప్రవేశింపజేసి వారిక్కూడా యోగదర్శనానుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో స్త్రీలకి గోపి+బొమ్మలని (గొబ్బెమ్మ) ఏర్పాటు చేశారు. నడుమ కన్పించే పెద్ద గొబ్బెమ్మ ఆండాళ్ తల్లి అంటే గోదాదేవి. చుట్టూరా ఉండే చిన్న చిన్న గొబ్బెమ్మలనీ కృష్ణ భక్తురాండ్రకి సంకేతాలు. ఈ అన్నిటికీ చుట్టూరా కృష్ణ సంకీర్తనని చేస్తూ (నృత్యాభినయంతో కూడా) స్త్రీలు పాటలని పాడుతూ ప్రదక్షిణలని చేస్తారు. నడుమ ఉన్న ఆ నిర్వ్యాజ భక్తికి (కోరికలు ఏమీలేని భక్తి) తార్కాణమైన గోదాదేవిలా చిత్తాన్ని భగవంతుని చుట్టూ ప్రదక్షిణాకారంగా తిప్పుతూ ఉండాలనేది దీనిలోని రహస్యమన్నమాట.

మొదటిరోజు ‘భోగి’

భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే - పిల్లలకి రేగుపళ్లని  పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.

సంక్రాంతి

సూర్యుడు ఈ రోజున ధనూ రాశి నుండి మకర రాశిలోకి జరుగుతాడు కాబట్టే దీన్ని ‘మకర సంక్రమణం’ అన్నారు. ఇప్పటివరకూ ఉన్న బుద్ధి కంటే వేరైన తీరులో బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడమే ‘మకర సంక్రాంతి’లోని రహస్యం. ఇది నిజం కాబట్టే ఈ రోజున బుద్ధికి అధిష్ఠాత అయిన సూర్యుణ్ని ఆరాధించవలసిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. అంతేకాదు మన బుద్ధిని సక్రమంగా ఉండేలా - ఉంచేలా ఆశీర్వదించగల శక్తి ఉన్న పితృదేవతలని ఆరాధించవలసిన రోజుగా కూడా తెల్పారు పెద్దలు. పెద్దలకి (పితృదేవతలకి) పెట్టుకోవలసిన (నైవేద్యాలని) పండుగ అయిన కారణంగానూ దీన్ని ‘పెద్ద పండుగ’ అన్నారు - అలాగే వ్యవహరిస్తున్నారు కూడా.

Tags: సంక్రాంతి, మకర సంక్రాంతి, Makar Sankranti, Sankranthi, Sankranti Festival, Importance of Sankranti, bhogi, Sankranthi Telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS