పర్వతం - పంచ కైలాసాలు - పౌరాణిక, వైజ్ఞానిక విశ్లేషణ...
ఎన్నో విశిష్టతలు ఇమిడి ఉన్న ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లో మానవ మేథస్సుకు అర్థంకాని విషయాలు దాగి ఉన్నాయి. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తాడు.
ఈ ప్రాంతంలో పర్యటించినప్పడు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. విరోచనుడు, స్కందుడు, శాస్త, సూర్యపుత్రుడగు యముడు, యుక్తిస్వరూపుడు, గొప్ప కీర్తి గలవాడు, ప్రేమ గలవాడు, త్రిపురాసుర సంహర్త, కైలాసాధిపతి, సుందరమైన వాడు, జగత్తునకు తండ్రి, సూర్యుడే కన్నుగా గలవాడు , సర్వోత్తముడు,సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్త సులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడు ఉండేది ఈ కైలాసంలో..... అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్‌లో కిన్నెర కైలాసం, బద్రీనాథ్‌లో నీలకంఠ శిఖరం, నేపాల్‌లోని ధౌలగిరి, బెంగుళూరులో నంది కొండలు.. ఇవన్నీ ఈశ్వర స్వరూపాలే. అంతే కాకుండా మానస సరోవరానికి సమీపంలో కొలువుతీరిన ముక్తినాథ్ వద్ద 108 జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంతో సహా ఎన్నో పర్వతాలను వీక్షించడం మాటల కందని మధురానుభూతి.
కైలాస పర్వత యాత్ర,
భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానస సరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.
మానస సరోవరం
కైలాస పర్వత పాదపీఠంలో "మానస సరోవరం" మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. బ్రహ్మ తన మనస్సు నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రాహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే.
ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గుహల్లో మునులు, సాధకులు, ఋషులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది.
హర హర మహాదేవ శంభో శంకర!
కైలాస దర్శనం క్లేశ హరణం!
సృష్టికర్త బ్రహ్మ నివశించేది బ్రహ్మలోకం, విష్ణువు ఆవాసం వైకుంఠం, శివుడు ఉండేది కైలాసం. మరి ఆ కైలాసం ఎక్కడ ఉంది ? భూమ్మీదే కైలాసం ఉందా ? సజీవంగా కైలాసానికి వెళ్లగలమా ? మానవ శరీరంతోనే త్రినేత్రుని దర్శన భాగ్యం కలుగుతుందా ? భూమిపై ఈశ్వరుని ఉనికి నిజమేనా ? లయకారుడి నివాస స్థలాన్ని మనం దర్శించగలమా ?
ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం లభిస్తుంది. బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి ప్రాణం ఉండగా వెళ్లడం సాధ్యకాదుకాని......కైలాసానికి మాత్రం మానవశరీరంతోనే వెళ్లిరావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో.
మంచు కొండల్లో వెండివెన్నెల
అతీంద్రియ మహాశక్తులు
అంతుపట్టని వెలుగు దివ్వెలు
సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని
అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం
ఈ భూమ్మీదే ఉంది.
కైలాస పర్వత దర్శనం కోటి జన్మల పుణ్యఫలం. సాక్షాత్తు ఆ పరమశివుని అనుమతి ఉన్నవారికే ఆ పరమ పవిత్రమైన క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుందని హిందువులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ భూమీదున్న అత్యంత కష్టమైన, సాహసోపేతమైన యాత్రలలో ‘కైలాస మానస సరోవర యాత్ర’ ఒకటి. మహాదేవుని ఆశీస్సులున్నవారు మాత్రమే ఈ యాత్రను విజయవంతంగా పూర్తిచేస్తారని పురాణాల చెప్తున్నాయి. హిందూ పురాణ గ్రంథాల ననుసరించి కైలాస పర్వతం దాదాపు ఆరు మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినదిగా తెలుస్తోంది. కారకోరం పర్వత శ్రేణి, నాగపర్వతాల మధ్యలో ఉందీ కైలాస పర్వతం. దీనిని ‘క్వాంగ్ రింపోచి’ అని పిలుస్తారు. దక్షిణ-పడమర దిశలో టిబెట్‌లో ఉండి, ఆసియా వాసులచే పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా నీరాజనాలందుకుంటోంది. కైలాస మానస సరోవర యాత్ర చేయడానికి నాలుగు మార్గాలున్నాయి. రెండు నేపాల్ ద్వారా, ఒకటి భారత్ ద్వారా, ఇంకొకటి పాకిస్థాన్ ద్వారా ఈ పుణ్యప్రదేశానికి చేరుకోవచ్చు.
ఈ భూమీదున్న అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న పరమ పవిత్ర దివ్యక్షేత్రం కైలాస పర్వతం. సముద్ర మట్టానికి 6,714 మీటర్ల ఎత్తులో మానస సరోవర సమీపంలో కైలాసగిరి శిఖరాన్ని ప్రదక్షిణ మార్గంలో చేరుకోవాలే తప్ప అడ్డదారులేవీ లేవు. ప్రపంచంలో ఉన్న అతి ముఖ్యమైన పుణ్యప్రదేశాలలో మానస సరోవర కైలాస యాత్ర ప్రత్యేకమైంది. సాక్షాత్తు పరమశివుడి నివాస స్థలమైన కైలాస పర్వత దర్శనం అత్యద్భుతం. కైలాస మానస సరోవర యాత్ర వల్ల సమస్త దుఃఖాలనుంచి విముక్తి లభిస్తుంది. కొన్ని వందల జన్మలలో చేసిన పుణ్యఫలాల వల్ల కైలాస మానస సరోవర దర్శన భాగ్యం కలుగుతుందంటారు. జైనులు కైలాస పర్వతాన్ని అష్టపాద పర్వతంగా, 24వ తీర్థంకరుడైన రిషభదేవుడి నివాస స్థలంగా నమ్ముతారు. బౌద్ధులు కైలాస పర్వతాన్ని అమూల్యమైన మంచు పర్వతంగా, దేవతలు చక్రసంహార, డోర్సఫాణ్మోల నివాస స్థలంగా కొలవడం జరుగుతుంది. కైలాస పర్వత పాదాల వద్దకు చేరే యాత్ర అతి క్లిష్టమైనది. కైలాస పర్వతాన్ని చుట్టి వచ్చే యాత్రని ‘కోరా’ లేదా పరిక్రమంగా చెబుతారు. హిందువులు ఈ పర్వత ప్రదక్షిణాన్ని ఆరోహణ క్రమంలో చేస్తే బోన్ మతస్థులు అవరోహణ క్రమంలో చేస్తారు.
మానస సరోవరానికి పది కిలోమీటర్ల దూరంలో ‘రాక్షసతాల్’ ఉంటుంది. మానస సరోవరం నుంచి కైలాసగిరికి ట్రెక్కింగ్ ప్రారంభమయ్యే ప్రాంతం ‘షిషాంగ్’. ఇక్కడ నుంచే కైలాస పర్వతం పరిక్రమ ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం నుంచి భక్తులు పర్వతాలను అధిరోహించాల్సిందే. అది చేయలేనివారు గుర్రాల మీద కైలాస పర్వతానికి చేరుకోవాలి. షిషాంగ్ నుంచి దాదాపు పది గంటలు గుర్రంమీద ప్రయాణం చేస్తే ‘డేరాపుక్’ ప్రాంతం వస్తుంది. ఇక్కడ బస చేయడానికి ఓ వసతి గృహం కూడా ఉంది. డేరాపుక్ నుంచి కొంచెం ఎత్తుకి వెళితే ‘దార్చెన్’ ప్రాంతం వస్తుంది. ఇక్కడ నుంచి కైలాస పర్వతాన్ని ఉత్తరం వైపుగా దర్శించుకోవచ్చు. ట్రెక్కింగ్ చేస్తున్నంత సేపూ, పక్కగా బ్రహ్మపుత్రానది దర్శనమిస్తుంది. కైలాస యాత్రలో భక్తులకు అటు ఆధ్యాత్మికానందంతోపాటు, మానసికానందం కూడా సొంతమవుతుంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు; భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఓ పక్క విపరీతమైన చలి, ఇంకోపక్క అద్భుత ప్రకృతి సౌందర్యం వీక్షిస్తున్నామన్న భావన, ఇంకోపక్క సాక్షాత్తు ఆ మహాదేవుని ఆవాస స్థలం చూశామన్న ఆత్మసంతృప్తి మనల్ని అవ్యక్తమైన ఆనందానికి గురిచేస్తాయి. కైలాస పర్వతం ఒక్కొక్క సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంది. ఇదంతా సాక్షాత్తు ఆ మహాదేవుని లీలావిశేషంగా చెబుతారు.
వెండికొండగా, బంగారు పర్వతంగా, ఇలా రకరకాల ఆకారాలలో ఇది కనిపిస్తుంది. భూమికి దాదాపు 6,714 మీటర్లు ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని దర్శించుకోవడం నిజంగా అదృష్టమే. కైలాస పర్వతం ఇతర పర్వతాలకన్నా భిన్నంగా ఉంటుంది. ఈ పర్వతం మీద అస్పష్టంగా కొన్ని రూపాలుంటాయి. ఇవన్నీ మనిషిలో అంతర్గతంగా ఉండే గుణాలకు ప్రతీకలుగా చెబుతారు. కైలాస పర్వత ప్రాంతంలో మైనస్ 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత చలిని తట్టుకోవడం సామాన్య విషయమేమీ కాదు. అందుకనే ఈ యాత్ర చేసే వారంతా ఆరోగ్యవంతులై ఉండాలి. అలాగే ‘హైఆల్టిట్యూడ్’ సమస్యలు కూడా ఇక్కడ యాత్రికులను బాధిస్తాయి. వీటినుంచి తట్టుకోవాలంటే మహాదేవుని మీద విశ్వాసం, యాత్ర చేసి తిరిగి రాగలమన్న నమ్మకం ఉండాలి. టిబెట్ భాషలో కైలాస పర్వతాన్ని ‘గ్యాంగ్ రింపోచి’ (వెండి ఆభరణం)గా పిలుస్తారు. కైలాస పర్వతాన్ని మొత్తం చుట్టడాన్ని అంటే ప్రదక్షిణ చేయడాన్ని ‘కోరా’ అని పిలుస్తారు. అంటే 52 కిలోమీటర్ల వ్యాసంలో కైలాస పర్వతాన్ని ప్రదక్షిణ చేయాలన్నమాట. అసాధారణమైన వాతావరణ పరిస్థితులలో ఈ పరిక్రమ చేయాలి. నిరంతరం హై ఆల్టిట్యూడ్ సమస్యలు వేధించి, ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ఓ దశాబ్దం క్రితం వరకూ సాహసప్రియులకు సైతం ఈ పర్వతారోహణం ఒక సవాలుగా ఉండేది. అయితే చైనా-నేపాల్ సంబంధాలు కొంత మెరుగుపడడంతో, ఖాట్మండును టిబెట్‌ను కలుపుతూ ‘్భటెకోసి’ మీద ‘ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జి’ నిర్మాణం కావడంతో మానస సరోవరానికి స్నేహవారధి ఏర్పడింది. ఈ ప్రాంతాన్ని ‘కొడారి’ అని పిలుస్తారు.
మరో కైలాసం
మహా దేవుడికి మరో కైలాసం.. దేవభూమిలో దివ్యధామం.. లింగరూపుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు.. త్రివర్ణాలలో త్రినేత్రుడి మహాదర్శనం.. అపురూపం.. అపూర్వం.. భూమి ఆకాశాలను కలుపుతున్నట్లుగా ఉమాశంకరుడు స్వయంభువుగా అవతరించి భక్తుల మనోరథాలు ఈడేరుస్తున్నాడు. మన భూమిపైన.. మనకు అందుబాటులో సాక్షాత్కరిస్తున్నాడు. ఇది వింత కాదు.. విడ్డూరం అంతకంటే కాదు.. పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు. నిజం.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రంగుల్లో ముక్కంటి తన భక్తుల ముచ్చట తీరుస్తున్న వాస్తవం.
భూమిపై కైలాసాలు ఎన్ని ఉన్నాయి. మహాదేవుడి నిజనివాసం ఎక్కడ.. టిబెట్‌లోని మానస సరోవరం పాదతీర్థంగా ఉన్న కైలాస పర్వతం కాకుండా, మరో కైలాసం ఉందా? అవును.. దేవదేవుడు హిమాలయ శ్రేణుల నిండా విస్తరించి ఉన్నాడు. హిమాలయాలకు అన్ని వైపులా కైలాస పర్వతాలు నెలకొని ఉన్నాయి. ప్రతిచోటా పలు రూపాల్లో పరమేష్టి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.. మహాదేవుడు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తున్న వైనం తొలిసారి టెలివిజన్ కెమెరాకు చిక్కింది..
హిమాలయాల్లో శివుడు మరో కైలాసంలో దర్శనమిస్తున్నాడు. మూడు రంగుల్లో త్రినేత్రుడు తొంభై అడుగుల ఎత్తైన సహజసిద్ధ శివలింగంగా కనిపిస్తున్నాడు.. ఒక రోజులో మూడు వర్ణాలుగా మారే శివలింగం.. దేవభూమిలో మహాద్భుత దృశ్యం ఆవిష్కారమైంది.. అత్యంత ఎత్తైన మంచు కొండల పైన, నిటారుగా, నిరాకారంగా వెలసిన మహాద్భుత అవతారం..
17, 500 అడుగుల చుట్టు కొలత
18వేల అడుగుల ఎత్తున మహా శివలింగం
రంగులు మారే మహాదేవుడు
ఉదయం రజతం
మధ్యాహ్నం సువర్ణం
సాయంత్రం నీలమేఘం
మూడు వర్ణాల్లో ముక్కంటి
ఆధ్యాత్మిక క్షేత్రంలో అపురూప సన్నివేశం అద్భుతం.
...బోళా శంకరుడికి రెండో కైలాసం ఏమిటని ఆశ్చర్యపోకండి.. ఇది వాస్తవం.. ఆయన నిజంగానే బోళా శంకరుడు.. అందుకే భక్తులను ఇబ్బంది పెట్టకుండా సులభసాధ్యుడయ్యాడు.. కోరుకున్న చోటనే దర్శనమిస్తున్నాడు.. అదే ఈ రెండో కైలాసం.. మౌంట్ కైలాస పర్వతం మాత్రమే కాదు.. అది ఆయన నిజనివాసం కావచ్చు. కానీ, శివుడికి రెండో కైలాసం హిమాచలంలోనే ఉంది. సముద్రమట్టానికి వేల అడుగుల ఎత్తున ఉంది. భక్తులను పలు వర్ణాల్లో అలరిస్తోంది. వారికి అందుబాటులో ఉంది. కొంచెం కష్టపడితే లయకారుడి దివ్యదర్శనం లభ్యమవుతోంది..
కిన్నెర కైలాసం....
పరమేశ్వరుడి నిజకైలాసాన్ని మరిపించే కైలాసం..చూస్తున్న కొద్దీ చూడాలనిపించే కైలాసం.. అణువణువునా ఆధ్యాత్మికత నిలువునా కమ్మేసే అపురూప ప్రదేశం.. అక్కడ శివలింగం రంగులు మారటం విశేషం.. ఒకే ప్రాంతంలో.. ఒకే చోట.. నిశ్చలంగా ఉన్న శివలింగం ఏ విధంగా రంగులు మారుతోంది.. ఇదెలా సాధ్యపడుతోంది?
శివలింగం రంగులు మారటం ఏమిటి? శివుడి మహత్యమా? మాయా? నిజంగా ఈశ్వరుడి లీలలు అక్కడ కనిపిస్తున్నాయా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ మరేదైనా ఉందా? ఇందులో రహస్యం దాగున్నదా? సముద్ర మట్టానికి దాదాపు 18 వేల అడుగుల ఎత్తున ఉన్న త్రివర్ణాలలో కనిపిస్తూ కెమెరా కంటికి చిక్కటం నిజంగా విశేషం.. ఇంతకీ ఈ అద్భుత ఆవిష్కారం ఎక్కడ దాగి ఉంది? వాస్తవం ఏమిటి?
హిమాచల ప్రదేశ్‌లో కిన్నౌర్ ప్రాంతం.. టిబెట్‌కు తూర్పున హిమాచల్ ప్రదేశ్ దాకా కొనసాగే హిమాలయ శ్రేణి అంతా దేవ భూమి.. ఒక అద్భుతమైన వాతావరణం.. మౌనంగా ఉన్నా, గాలిలో ఈశ్వరుడి పేరు ప్రతిధ్వనించే ప్రాంతం. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్ జిల్లా ఉంది..
కిన్నౌర్ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో.. నిజంగా అందాల కోన.. మూడు హిమాలయ పర్వతాలు పక్కపక్కనే పేర్చినట్లు ఉంటాయి. జన్‌స్కర్, గ్రేటర్ హిమాలయ, దౌలంధర్ శ్రేణులు సట్లెజ్, స్పిటి, బాస్పా వంటి జీవనదులకు పుట్టినిల్లు..... వీటి మధ్యలోనే అన్నింటికంటే అత్యంత ఎత్తుగా కిన్నెర కైలాస పర్వతం కొలువుదీరి ఉంది.
సట్లెజ్ నదీతీరంలో అందమైన జలపాతాల నడుమ 18వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతాన్ని చూడటానికి వేయి కన్నులున్నా సరిపోవు.. ఈ కొండపైనే సహజసిద్ధమైన శివలింగం ఆవిర్భవించి ఉంది. యోగులకు, సిద్ధులకు మాత్రమే కాదు.. సామాన్యులకు కూడా సాక్షాత్కరించే అతి గొప్ప శివలింగం.... తొంభై అడుగుల ఎత్తైన శివలింగం..
ఇది అలాంటిలాంటి శివలింగం కాదు.. మనం సాధారణంగా చూసే మాదిరిలో దీని ఆకారం ఉండదు.. కిన్నెర కైలాసం పీక్ స్టేజ్‌లో నిటారుగా నిలుచుని ఉన్న రాతినే శివలింగంగా భక్తులు భావిస్తారు.. కేవలం రాయిని శివలింగంగా ఎందుకు భావించారు? అదే ఇక్కడి ప్రత్యేకత.. ఇది కేవలం రాయి కాదు.. ఇందులో జీవశక్తి ఉందని ఇక్కడ ఉపాసించే సిద్ధుల అవగాహన. ఎందుకంటే ఈ శివలింగం రోజులో మూడు కాలాల్లో మూడు రంగుల్లో కనిపిస్తుంది. నిర్దిష్ట సమయానికి శివలింగం రంగు మారుతుంది.
అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ శివలింగం ఉదయం భానుడి లేలేత కిరణాల స్పర్శతో మిలమిలా మెరిసిపోతుంది.. వెండి రాశి పోతపోసుకున్నట్లుగా తెల్లగా ఈ శివలింగం దర్శనమిస్తుంది. మధ్యాహ్నానికి సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చేసరికి పసిడి వన్నెలోకి మారిపోతుంది.. ఇదే మహాలింగం సాయంత్రం అయ్యేవేళకు నీలిరంగులో ధగధగలాడుతుంది.. ప్రపంచంలో అతి గొప్ప పరిణామ క్రమం ఇది. శివలింగం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ రంగులు మారుతున్నాయి. ముక్కంటి మాత్రమే ఈ విధంగా దర్శనమిస్తున్నాడు.. ఇది ఆయన లీలా విలాసమేనా? మరేదైనా మర్మముందా?
ప్రపంచంలో కిన్నెర కైలాసంలో మాత్రమే ఈ అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. అదీ ఈ శివలింగం నెలకొని ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇలా రంగులు మారుతాయి. ఈ పరిణామం దేనికి సంకేతం? శివలింగం మాత్రమే కాదు. కిన్నెర కైలాస పర్వతానిదే ఒక ప్రత్యేకత. మౌంట్ కైలాసాన్ని మరిపించే ఈ కిన్నెర కైలాసం మర్మం ఏమిటి?
కిన్నెర కైలాసంలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం మూడు వర్ణాల్లో కనిపించేందుకు ఇక్కడ ఉపాసకులు ఆసక్తికరమైన కథనాలను వినిపిస్తారు.. ఉదయం వెండి రంగులో శివలింగం కనిపిస్తుంది.. సూర్యుని కిరణాలు శివుడి తలపె ఉన్న జాబిల్లిని తాకుతాయి. జాబిల్లి నుంచి వెలువడే వెన్నెలే ఈ తెలుపు రంగుకు కారణం.. ఈ వెన్నెలకు భూతనాథుడి ఒంటిపై ఉండే విభూతి తోడై అద్భుతంగా విరాజిల్లుతుందని శివభక్తులు చెప్తారు..
మధ్యాహ్నానికి కిన్నెర శివలింగం పసిడి వన్నెలోకి మారిపోతుంది. శివుడు ధరించిన పులిచర్మం, పట్టపగలు తనపై నేరుగా పడే సూర్యుడి కిరణాలకు బంగారు రంగులో మెరిసిపోతుందిట.. ఈ రంగు చుట్టూ ఉన్న మేఘాలపై ప్రసరించి మరింత అద్భుత దృశ్యం ఆవిష్కారమవుతుంది.
సాయంకాలానికి ఈశ్వరుడి లయవిన్యాసం విశ్వరూపం దాలుస్తుంది. ఆయన కంఠంలో ఉన్న గరళం ఒక్కసారిగా చైతన్యవంతం అవుతుంది. గరళం నుంచి వెలువడే సెగలు ఒక్కసారిగా శివలింగాన్ని నీలివర్ణంలోకి మార్చేస్తాయి. ఇదొక అద్భుత సన్నివేశం.. అపురూప ప్రకృతి స్వరూపం.
పురాణాలు చెప్పే కథనాలు ఆధ్యాత్మిక భావనను వెల్లడి చేస్తున్నాయి. ఈ కథలు, కథనాలు సైన్స్ కు అంతుపట్టవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలో, సూర్యుడి ప్రస్థానంలో, వాతావరణంలో, హిమాలయ శ్రేణుల్లో సాగే మేఘాలు ఈ శివలింగాన్ని తాకుతూ వెళ్తాయి. అందువల్లే ఇక్కడ ప్రకృతిలో రంగుల మార్పులు జరుగుతాయని సైంటిస్టులు ఒకరకమైన అంచనా వేస్తుంటారు..
సైంటిస్టులు చెప్పిన మాటలో లాజిక్ లేకపోలేదు. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న ఎలాంటి జవాబుకూ చిక్కడం లేదు. ఎందుకంటే నిజంగా ప్రకృతిలో, వాతావరణంలో మార్పుల వల్ల ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే ఆ ప్రాంతం అంతటా అదే విధంగా రంగులు మారుతూ ఉండాలి.. కానీ, ఒక్క శివలింగం ఉన్న పరిసర ప్రాంతంలోనే ఇలా జరుగుతోంది.. కిన్నెర కైలాస పర్వత శ్రేణిలోనే ఈ వర్ణాల మార్పు జరుగుతోంది.. దీనికి మాత్రం ఇప్పటివరకు ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు.. మరి ఇది నిజంగా ఈశ్వరుడి మాయా? ఏమో !
సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తున జరుగుతున్న అద్భుతం ఇది.. సైన్స్ కు ఎంతమాత్రం అందని, అంతుపట్టని ప్రకృతి విన్యాసం ఇది. కేవలం శివలింగం మాత్రమే కాదు.. మొత్తం కిన్నెర కైలాస పర్వతం అంతా శివుడి ఉనికిని, అస్తిత్వాన్ని, ఆయన తేజస్సును విరజిమ్ముతున్నది.. అక్కడికి వెళ్లే భక్తులందరికీ ఇదే అనుభూతి కలుగుతోంది...
కైలాసాలు ఒకటి కంటే ఎక్కువ ఉండటం ఏమిటి? ఎలా ఏర్పడ్డాయి ఇవి..? వీటికి స్థానిక కథనాలు చాలానే ఉన్నాయి. రుద్రుడు హిమాలయాలను సృష్టించినప్పుడు ఆయన తన గణాలకోసం ప్రత్యేక స్థానాలను ఏర్పాటు చేశాడు.. అందులో కిన్నెరుల కోసం ఏర్పాటు చేసిన ఆవాస స్థలమే కిన్నెర కైలాసం.. ఇక్కడ కిన్నెరులు తనను ఆరాధించటం కోసం స్వయంభువుగా లింగరూపుడై అవతరించాడని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం..
శివుడి నిజనివాసం టిబెట్‌లోని కైలాస పర్వతం.. దీని చుట్టూ బయటి నుంచి ప్రదక్షిణ చేయటమే గొప్ప సాహసం.. కిన్నెర కైలాసం అలాంటిది కాదు.. ఇక్కడికి శివలింగం వరకు వెళ్లి స్పృశించి వచ్చే అవకాశం ఉంది.. కాకపోతే కిన్నెర కైలాసం ఒక్కోసారి మౌంట్ కైలాస్‌నే తలపిస్తుంది. కొన్ని వేళల్లో కిన్నెర కైలాసాన్ని చూస్తే, మౌంట్ కైలాస్‌కు, దీనికి అస్సలు తేడా కనిపించదు.. కైలాస పర్వతం, కిన్నెరకు వచ్చేసిందా? అన్న confusion ను క్రియేట్ చేస్తుంది. ఈ ప్రకృతి వింతను చూసి తీరాల్సిందే.....
శివుడికి కైలాసాలు కేవలం రెండే కాదు.. మొత్తం అయిదు కైలాసాలు ఉన్నాయని చెప్తారు.. వీటిలో మొదటిది మౌంట్ కైలాస్......ప్రస్తుతము ఇదిచైనా ఆక్రమిత టిబెట్‌లో ఉంది. ఈ టిబెట్టు ప్రాంతం ప్రాచీన కాలంలో అఖండ భారతావని లో భాగంగా ఉండేది. స్థితి చెడి ఇలా ఉంది. (హీన స్థితిలో హిందువులు ఉండడం వలన ఈ దుస్థితి) రెండవది, కిన్నెర కైలాస్.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో ఉన్న గొప్ప పర్వతం ఇది. ఇక మూడవది మౌంట్ ఆది కైలాస్.. ఇది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్ జిల్లాలో ఉంది. దీన్ని చోటా కైలాస్ అని కూడా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోనే రాంపూర్ జిల్లాలో శ్రీఖండ్ కైలాసం ఉంది. ఇది నాలుగో కైలాసం. ఇదే రాష్ర్టంలో చంబా జిల్లాలో "మణి మహేశ్" కైలాసం ఉంది.. మొత్తం అయిదు కైలాసాల్లో శివుడు ఆదిపురుషుడిగా, ఈశ్వరుడిగా నెలకొని ఉన్నాడు.
భారత దేశ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో హిమాలయాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మన దేశానికి సంబంధించి భక్తి ఉద్యమం అంతా కూడా హిమాలయాలనుంచే ప్రారంభం అవుతుంది.. అక్కడే ముగుస్తుంది కూడా..... హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించిన ప్రాంతం అంతా దేవతల భూమిగా, దేవ లోకంగా భారతీయులు గట్టిగా నమ్ముతారు.. అక్కడి వాతావరణం కూడా అదే విధంగా ఆధ్యాత్మిక వాసనలను వెదజల్లుతుంటుంది.. కిన్నెర కైలాసం అందులో ఉచ్ఛ స్థాయిలో ఉంది. దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా ఒక్కసారి అక్కడికి వెళ్లి వస్తే మానసికంగా మనిషిలో కలిగే మార్పు మాత్రం తిరుగులేనిది.....
Famous Posts:
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
kailash mansarovar, kailash mansarovar yatra cost, kailash mansarovar yatra, kailash, mansarovar,
kailash mansarovar yatra details telugu