తిరువణ్ణామలై(అరుణాచలం) గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?
ఈ ప్రశ్నకు లేదు అన్నదే సమాధానం. ఎందుకంటే పరీక్షలు రాసినవారందరికీ ఒకే విధమైన మార్కులు రావు కదా. వారి వారి జ్ఞాపకశక్తి, సమాధానాలు రాసే పద్ధతి, పదజాలం వంటి పలు విషయాల వల్లే మార్కులు అధికంగా లభిస్తాయి. అదే రీతిలో తిరుఅణ్ణామలైని పలువురు గిరి ప్రదక్షిణ చేసినా వారి వారి ఆత్మవిశ్వాసం, అంకితభావంతో చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందగలుగుతారు.
అయినా కొన్ని చిట్కాలు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చును.
1. స్నానమాచరించిన తర్వాత తమ కులధర్మాన్ని బట్టి నుదుట విభూతి, సింధూరం, కుంకుమ ధరించి, దేహంపై దైవీక చిహ్నాలతో గిరి ప్రదక్షిణ చేస్తే శుభఫలితాలు అధికమవుతాయి.
2. సంప్రదాయ రీతిలో పురుషులు పంచకచకం, స్త్రీలు చీరలు ధరించి గిరి ప్రదక్షిణ చేయడం శ్రేయస్కరం.
3. ఆయా రోజులకు అనువైన రంగుల దుస్తులు ధరిస్తే మంచిది.
4. పురుషులు జంధ్యాలు, చెవిపోగులు ధరించి, మహిళలు ముక్కుపుడకలు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది.
5. నిర్ణీత లగ్నం, హోరై, అమృతయోగం వంటి శుభముహూర్త సమయాల్లో గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.
గిరిప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడా పితృదేవతలకు తర్పణాలు, ధాన ధర్మాలు చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలు అధికంగా పొందగలుగుతారు.
తిరుఅణ్ణామలైని ఒంటరిగా గిరి ప్రదక్షిణం చేయడం కంటే కుటుంబ సమేతంగా, బంధువులు, స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్ట ప్రదం. ప్రతీ సారి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు తమతో పాటు ఓ కొత్త వ్యక్తిని వెంటబెట్టుకుని తీసుకెళ్లడం కూడా మంచిది.
గిరి ప్రదక్షిణ నియమాలు
సాక్షాత్తు మహేశ్వరుడే స్థూల రూపంలో అవతరించిన తిరుఅణ్ణామలై గిరి ప్రదక్షిణ చేయడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేమిటంటే...
1. పాదరక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. ఈ నియమానికి మినహాయింపులు లేనేలేవు.
తిరుఅణ్ణామలై అంతటా కోటానుకోట్ల సంఖ్యలో లింగాలు సూక్ష్మరూపంలో ఉన్నాయి. కనుక అంతటి పవిత్రమైన మార్గంలో ఎట్టి పరిస్థితులలోనూ పాద రక్షలు ధరించకుండా గిరి ప్రదక్షిణ చేయడమే మంచిది.
2. వాహనాలతో గిరి ప్రదక్షిణ చేయరాదు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తమ శక్త్యానుసారం నెమ్మదిగా నడిచి అక్కడక్కడా సేదతీరుతూ, విశ్రాంతి తీసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. నడవలేని స్థితిలో ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయకుండా ఉన్న చోటు నుండే సాష్టాంగంగా నమస్కరిస్తే చాలును.
3. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కబుర్లాడరాదు. భగవన్నామ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. వ్యర్థ ప్రసంగాలు చేయరాదు. సంస్కృతం, తెలుగు భాషలలోని దైవనామాలను నినదిస్తూ నెమ్మదిగా గిరి ప్రదక్షిణ చేయాలి. 'అరుణాచల శివా! అరుణాచల శివా!' అనే నామావళిని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది.
4. మొక్కుబడులు తీర్చుకోదలచినవారు మాత్రమే తిరుఅణ్ణామలై శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు. కార్తీక దీపం రోజున పర్వతంపైకెక్కి నేతితో ప్రార్థన చేసి వెంటనే కిందకు దిగాలి. కొండపై నుండి వేడుకగా చూడకూడదు. మొక్కుబడులు లేనివారు అకారణంగా కొండెక్కరాదు. పాప చింతనలు కలిగిన వారు పర్వతం పైకి ఎక్కరాదు.
5. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఉన్న తీర్థాలు, నందులు, అష్టలింగాలు, ముఖ్యమైన దర్శన ప్రాంతాల వద్ద సాష్టాంగ నమస్కారాలు ఆచరించాలి. వంటిపై మట్టి అంటుకుంటుందన్న తలంపు ఎట్టి పరిస్థితులలోనూ ఉండకూడదు. సిద్ధులు, మహర్షులు పాదాలు మోపిన పవిత్ర స్థలమన్న భావనతోనే సాష్టాంగ నమస్కారాలు చేయాలి.
6. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో ఎదరుయ్యే నిరుపేదలకు, పశువులు, శునకాలు వంటి జంతువులకు ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది. గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ముందుగానే వారి వెంట పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు (bread), తదితర ఆహార పొట్లాలను తీసుకెళ్లడం మంచిది.
కార్యసిద్ధి కోసం గిరిప్రదక్షిణ
ఒక్కో రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లేవారు ఆ రోజుకు సంబంధించి ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకుని ఆ వర్ణపు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేసి మరిన్ని ఫలితాలను పొందవచ్చు. ఆయారోజులకు అనువైన వర్ణాలు కలిగిన దుస్తులను నిరుపేదలకు దానం చేస్తే మరీ మంచిది.
వారం ధరించాల్సిన వస్త్రపు వర్ణం
ఆదివారం నారింజరంగు
సోమవారం తెలుపు + ఎరుపు
మంగళవారం ఎరుపు
బుధవారం పచ్చ
గురువారం పసుపు
శుక్రవారం లేత నీలం
శనివారం నలుపు లేదా నీలం
మనం చేయదలచిన సత్కార్యాలకు ఆటంకాలు కలిగితే పైన పేర్కొన్న విధంగా ఆయారోజులకు అనువైన రంగు దుస్తులు ధరించి గిరి ప్రదక్షిణ చేస్తే ఆటంకాలు తొలగి సత్కార్యాలను నిర్విఘ్నంగా చేయగలుగుతారు.
సకలమూ తెలిసినవారే సద్గురువులు
తిరుఅణ్ణామలై క్షేత్రాన్ని వారాలలో గిరి ప్రదక్షిణ చేసే పద్ధతులను తెలుసుకున్నాం. ఏయే వారాల్లో గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయో కూడా తెలుసుకున్నాం.
ఇక సామాన్యమైన మానవులుగా ఉండే మనం ఎలా ఈ దర్శనాలను, ఆ దర్శనపు ఫలితాలను ఎలా తెలుసుకోగలం? అలా తెలుసుకున్నా వాటిని జ్ఞాపకంలో పెట్టుకోగలమా? సద్గురువు సలహాలు పొందాలన్నదే ఈ ప్రశ్నకు అనువైన సమాధానమవుతుంది.
ఇక పైన పేర్కొన్న దర్శనాలే గాకుండా మరెన్నో దర్శనాలు కూడా ఉన్నాయి. సోమస్కంధ దర్శనం, గజతోన్ముఖ దర్శనం, కామాక్యా రూప దర్శనం, 'అన్నిమతాలు ఒక్కటే' అని రుజువుచేసే సంగమ దర్శనం, మూషిక లింగ దర్శనం, హరిహర దర్శనం అంటూ ఎన్నో దర్శనాలను గురించి చెప్పుకుంటూ పోవచ్చు. ఈ దర్శనాలకు సంబంధించి నియమనిష్టలు, పద్ధతులు గురించి బాగా తెలిసినవారే సద్గురువులు.
సద్గురువు నిర్దేశించిన మార్గంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఆ గురువులే మనకు అనువైన దర్శనాలను నిర్దేశించి దైవానుగ్రహాన్ని ప్రాప్తింపజేస్తారు. మన పూర్వజన్మ కర్మఫలితాలను పోగొట్టి సద్గతిని కలిగిస్తారు. కనుకనే సద్గురువుతో కలిసి గిరి ప్రదక్షిణ చేస్తే మరీ మంచిది.
ఇక మంచి గురువును పొందలేనివారు 'మహేశ్వరా మాకు అనువైన సద్గురువును అందించు స్వామీ' అని ప్రార్థిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ వస్తే ఆ పరమేశ్వరుడే కరుణించి సద్గురువును మనకు అందిస్తాడు.
అలా సద్గురువుల అనుగ్రహం పొందిన మీదట మనం గుర్తుంచుకోవాల్సిన ఉన్నతమైన మంత్రమొకటింది. 'మహేశ్వరా నాదంటూ ఏవీలేవు. సర్వమూ నీదే! కరుణామయా కరుణించవయా అరుణాచలేశ్వరా' అని మనసారా ప్రార్థిస్తే చాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయి. సకలమూ తెలిసిన సద్గురువు ద్వారానే ఇవన్నీ పొందగలం. సద్గురువును శరణుజొచ్చి సకల సౌఖ్యాలు పొందుదామా!
Famous Posts:
> అరుణాచలం కొత్తగా వెళ్లేవారికి సూచనలు | గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎక్కడ నుండి మొదలు పెట్టాలి?
> అరుణాచలం వెళ్ళిన వారు, వెళ్లబోయే వారు తప్పక తెలుసుకోవలసిన కధ.
> అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?
> అరుణాచలంలో ఈ నాలుగు తప్పులూ చేయకండి.
> అరుణాచలం ఆలయం సమగ్ర సమాచారం.
అరుణాచలం, తిరువణ్ణామలై, Tiruvannamalai, Arunachalam, Tiruvannamalai temple, Arunachalam Giri Pradakshina, arunachalam giri pradakshina route, arunachalam giri pradakshina distance, shiva, ramana maharshi