లక్ష్మీ ప్రదమైన మాసం.. శ్రావణ మాసం ఈ ఏడాది జూలై 29 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈనెలలో వచ్చే మంచి రోజులు, విశిష్ట పండగల గురించి తెలుసుకుందాం.
Also Read: శ్రావణ మాసం మొదటి సోమవారం ఈ పనులు చేయకండి.
మంగళవారం మంగళగౌరి వ్రతం..
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఆనందిస్తారు. ఈ మాసంలో మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతి దేవికి మరొక పేరు గౌరీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన వధువులు.. తప్పనిసరిగా ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు నిండు ముత్తైదువులుగా జీవిస్తారని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం:
ఈ మాసంలో శ్రీ వరలక్ష్మీ దేవిని పూజిస్తూ.. ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ముఖ్యంగా పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానమని నమ్మకం. అంతేకాదు ఈరోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం సుఖ సంతోషాలతో నెలకొంటుందని విశ్వాసం.
నాగ పంచమి:
దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ.. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నాగుల పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున నాగులకు పూజలను నిర్వహిస్తారు. పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. ఉపవాసం ఉంటారు.
శుక్ల ఏకాదశి:
శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. సంతానం లేనివారు వ్రతాన్ని ఆచరించడం శుభఫలితాను ఇస్తుంది. అంతేకాదు ఈరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చని పురాణాలు పేర్కొన్నాయి.
శ్రావణ రాఖీపూర్ణిమ లేదా జంధ్యాల పౌర్ణమి:
తన సోదరిని మేలు కోరుతూ సోదరి.. సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. అన్నదమ్ములకు రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. అంతేకాదు… కొంతమంది తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుకనే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు.
హయగ్రీవ జయంతి:
శ్రావణ పున్నమి రోజున శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించడం కోసం హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. అందుకనే ఈరోజున కొన్ని ప్రాంతాల వారు హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. అయన అనుగ్రహం కోసం పూజలు నిర్వహించి.. శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి:
తుంగభద్రానది తీరంలో మంత్రాలయంలో కొలువైన శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతి వేడుకలను శ్రావణ కృష్ణ విదియరోజున ఘనంగా నిర్వహిస్తారు. క్రీ.శ.1671లో విరోధికృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ విదియనాడు రాఘవేంద్రస్వామి సజీవంగా సమాధిలో ప్రవేశించారని గ్రంథాల్లో పేర్కొన్నారు.
శ్రీకృష్ణాష్టమి:
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు శ్రీకృష్ణాష్టమి. ఈరోజుని కృష్ణ జన్మాష్టమిగా దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ఉట్టికొట్టడం ఆచారం.
కామిక ఏకాదశి:
ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అని అంటారు. ఈరోజున నవనీతాన్ని (వెన్న) దానం చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం.
పోలాల అమావాస్య:
శ్రావణ మాసములో కృష్ణపక్ష అమావాస్యని పోలాల అమావాస్య గా పిలుస్తారు. సంతానం కోసం ఈరోజున మహిళలు ప్రత్యేక పూజను నిర్వహిస్తారు. ఈరోజున అమ్మవారిని పూజిస్తే.. పిల్లలు సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
sravana sukravaram, august sravana masam, sravana masam festivals, varalakshmi vratam, rakshi purnima, amavasya