ఉత్తమ సంసారి ఎలా వుండాలి అని తెలియజేసే మహాభారతం ఆదిపర్వంలోని కథ.
జరత్కారుడు యాయవారపు(ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకొని జీవించే బ్రాహ్మణులు) బ్రాహ్మణుల వంశములో పుట్టిన ఏకైక వారసుడు. జరత్కారుని పేరుకు అర్ధము “జర'” అంటే వినియోగము అంటే ఖర్చు అయి పోయేది “కారు” అంటే భారీ కాయము.
ఈ ముని తన భారీ కాయాన్ని కఠిన మైన తపస్సులతో శుష్కింప చేసుకున్నాడు కాబట్టి ఈయనకు జరత్కారుడు అన్నపేరు వచ్చింది. ఈయన మంచి తపోనిది. కఠోరమైన తపస్సు చేస్తూ సంసార బంధాలు ఏమి లేకుండా బ్రహ్మచారిగా ఉండిపోదలచుకున్నాడు.
వివాహము, సంసారము, సంతానము ఇవన్నీ జీవుడిని సుడిగుండాలలో పడవేసేవే తప్ప కైవల్యానికి అక్కరకు రాలేవు అని జరత్కారుని గట్టి నమ్మకము అందుచేతనే బ్రహ్మచర్యాన్ని ఎన్నుకున్నాడు. ఆ విధముగా తపస్సు వేదాధ్యాయనము తప్ప వేరే దృష్టి లేకుండా జీవించేవాడు.
ఒకనాడు జరత్కారుడు అరణ్యములో సంచరిస్తూ ఉండగా అతనికి కొన్ని గొంతుకలు వినిపించాయి. ఎవరివి ఆ గొంతులు అని చూస్తే దగ్గరలో వున్న పెద్ద గొయ్యి మొదట్లో ఏపుగా పెరిగిన గడ్డిమొక్కను పట్టుకొని కొందరు మునీశ్వరులు తలక్రిందులుగా వ్రేలాడుతున్నారు. ఇది చుసిన జరత్కారునికి ఈ మునీశ్వరులు కొత్త రకమైన తపో ప్రక్రియలో ఉన్నారనుకొని వారిని సమీపించి...
”ఈ తపోప్రక్రియ బాగుంది ఈ తపో విధానాన్ని నాకు వివరిస్తే నేను కూడా ఆచరిస్తాను” అని వారికి విన్నవించు కున్నాడు.
అదే సమయములో ఒక ఎలుక ఆ గడ్డి మొక్క వేళ్ళను ఒక్కొక్కటిగా కొరుకుతూంది. ఒకే ఒక వేరు మిగిలింది దానిని కూడా ఎలుక కొరికేస్తే వ్రేలాడుతున్న మునీశ్వరులు అందరు ఆ గోతిలో పడి అధోలోకాలకు వెళ్ళ వలసి ఉంటుంది.
అప్పుడు చిక్కిశల్యమైన మునీశ్వరులు ఓపిక తెచ్చుకొని,
“నాయనా మేము యాయవార బ్రాహ్మణులము, సంచారులము. మా వంశములో ఇక వంశాభివృద్ధి లేకపోవుటచే మాకు ఉత్తమ లోకాలు ప్రాప్టించవని సూచిస్తూ యమధర్మరాజు ఎలుక రూపములో మేము ఇంతకు మునుపు సంపాదించుకున్న పుణ్యాలను కొరికేస్తున్నాడు. దీనికి కారణం మా కుటుంబములో జన్మించిన జరత్కారుడనే దౌర్భాగ్యుడు.
వాడు వంశ హితము, పూర్వీకులకు ఉత్తమలోకాల ప్రాప్తి వంటి విషయాలపై శ్రద్ధపెట్టకుండా ఎంతసేపు తపస్సు, బ్రహ్మచర్యము, వేద అధ్యయనము అంటూ మాకు ఈ పరిస్థితి తెచ్చిపెట్టాడు నాయనా. నీకు ఎక్కడైనా ఆ దౌర్భాగ్యుడు కనిపిస్తే మా దుస్థితి వాడికి వివరించి ఇకనైనా వివాహము చేసుకుని మమ్మల్ని ఉద్దరించమని చెప్పు.
సంసారము అనేది తరించడానికి ఒక దివ్య మార్గము. వేదాలు చదువుకున్న ఆ మూర్ఖుడికి ఈ విషయము తెలియకపోవటం మా దౌర్భాగ్యము. అటువంటి వారి వల్ల వంశనాశనము ధర్మనాశనము జరుగుతుంది” అని వారి భాధను చెప్పుకున్నారు.
వారి బాధలకు తానే కారణము అని తెలుసుకున్న జరత్కారుడు తానే జరత్కారుడిని అని పరిచయము చేసుకొని తన తప్పులను ఒప్పుకొని అతి త్వరలో వివాహము చేసుకుని సంతతిని కని, వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తి అయేటట్లు చూస్తానని త్రికరణశుద్ధిగా చెపుతాడు కానీ తను వివాహము చేసుకోబోయే కన్య పేరు కూడా జరత్కారి అని ఉండాలని షరతు చెపుతాడు. ఈ షరతు విన్న పితృ పితామహులు మా అదృష్టము ఎలా ఉన్నదో అని నిట్టూర్పు విడిచి మంచి జరగాలని కోరుకుంటారు.
జరత్కారుడు అక్కడనుంచి బయలుదేరి...
“నాకెవరైనా నా పేరున్న పిల్లను ఇచ్చి వివాహము చేస్తారా ? నా వివాహము నా పితృ పితామహులను తరింప చేయటానికే సుఖఃసంసారానికి కాదు” అని అరుచుకుంటూ నడుస్తుంటాడు.
ఈ సంగతి విన్న నాగకుమారులు ఈ వార్తను వాసుకి కి చేరవేస్తారు. పరమానంద భరితుడైన వాసుకి సత్వరమే జరత్కారుని చేరతాడు. వాసుకి తనసోదరి పేరు జరత్కారి అని జరత్కారునికి తెలియజేసి ఆమెను స్వీకరించమని ప్రార్ధించాడు. ఇద్దరి పేర్లు ఒకటే అని తెలుసుకున్నాక జరత్కారుతుడు వివాహానికి ఒక షరతుతో అంగీకరించాడు.
ఆ షరతు ఏమిటి అంటే ‘తనకు అయిష్టమైన పని గనుక తన భార్య చేస్తే మరుక్షణమే భార్యను వదలి వేస్తాను’ అని చెప్పి వాసుకి సోదరి జరత్కారిని భార్యగా స్వీకరిస్తాడు.
భర్త షరతు బాధాకరమైనా తన బ్రతుకు భర్త అధీనము కనుక భగవంతుని ప్రార్దిస్తూ, జరత్కారి భర్తకు పరిచర్యలు చేస్తూ కాలము గడుపుతూ ఉంటుంది.
ఒకనాడు జరత్కారుడు భార్య ఒడిలో తలపెట్టుకొని మధ్యహ్న భోజనానంతరం నిద్రిస్తూ ఉండగా సాయం సంధ్య విధులను నిర్వర్తించే సమయము ఆసన్నమయింది. నిద్రిస్తున్న భర్తను లేపాలా వద్దా? అన్న మీమాంసలో చాలాసేపు అలోచించి వేళ మించిపోతుంది కాబట్టి భర్తను లేపి...
“స్వామి సాయంసంధ్యకు వేళ అవుతుంది” అని లేపింది.
నిద్ర లేచిన జరత్కారుడు ఉగ్రుడై , “చనువు ఇచ్చాను కదా అని నెత్తికెక్కుతున్నావు ఆడదాని చేత ధర్మ పన్నాలు చెప్పించుకొనే స్థితిలో ఈ జరత్కారుడు లేడు. నా మాట తప్పినందులకు గాను అన్నమాట ప్రకారము ఈ క్షణమే నిన్ను వదలి వేస్తున్నాను ఇంకా నీవు నీ సోదరుని దగ్గరకు పో”అని లేచాడు.
జరత్కారి భర్తను కాళ్లావేళ్లా బ్రతిమాలింది అయినా ఫలితము లేకపోయింది. జరత్కారుడు భార్యతో,
“ఇదంతా దైవేచ్చ. ధర్మము కోసము బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టానే తప్ప శారీరక సుఖము కోసము కాదు నేను ఒక మాట అంటే ఆచరించటమే నా లక్ష్యము. నీ గర్భంలో సాక్షాత్తు సూర్యుని వలే వెలుగొందే కుమారుడు ఉభయ వంశాలను ఉద్దరించేవాడు పెరుగుతున్నాడు. కనుక నీవు పుట్టింటికి వెళ్ళు” అని చెప్పాడు.
వెంటనే జరత్కారి అన్న వాసుకి దగ్గరకు వచ్చి జరిగినది అంతా చెప్పింది. వాసుకి నాగ వంశోద్ధారణ జరగబోతోందని సంతోషించి చెల్లెలిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. నెలలు నిండగానే జరత్కారికి పుత్రోదయము అయింది.
ఆ పుత్రుడికి ఆస్తికుడు అని నామకరణము చేశారు. ఈ ఆస్తికుడే జనమేజయుడు చేసే సర్పయాగాన్ని ఆపి నాగజాతిని కాపాడిన ఘనుడు. జరత్కారి మానస పేరుతో సర్పాలకు ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందింది.
జ్ఞానులయినవారు సంసారకూపంలో మునిగిపోక తమ కర్తవ్యం పూర్తిచేసి విరాగులవ్వాలి.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
Jaratkaru, Mahabharata, jaratkaru mantra in telugu, devi jaratkaru, manasa devi, jaratkaru in telugu, mansa devi photo, astika mantra