ఉజ్జయిని పుణ్యక్షేత్రం :
ఉజ్జయినిలో దర్శించవలసిన దేవాలయములు చాలా వున్నవి.
అందులొ ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన
శ్రీ మహాకాళేశ్వర స్వామి మరియు అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైనటువంటి మహాకాళికాదేవి ఆలయము..
శ్రీ మహాకాళేశ్వర స్వామి
(ఉజ్జయినీ, మధ్యప్రదేశ్)
సప్తపురీ మోక్షములలో ఒకటైన ఉజ్జయినీ నగరము క్షిప్రానదీ తీరమున అలరారుచున్నది. ఇచ్చటనే పరమేశ్వరుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగముగా అవతరించియున్నాడు.
స్థలపురాణం :
పూర్వము అవంతి (ఉజ్జయిని) నగరమున వేదప్రియుడను బ్రాహ్మణోత్తముడు తన సంతానమైన దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అను నలుగురు కుమారులతో నిత్యనైమిత్తిక వైదిక కర్మల ననుష్ఠించుచు పార్ధివలింగార్చన చేయుచుండెను. వారి పుణ్యప్రభావము వలన నగర ప్రజలందరు సుఖ సంతోషాలతో అలరారుచుండిరి. అదే కాలము రత్నమాల పర్వతము మీద దూషణుడు అను రాక్షసరాజు ధర్మద్వేషియై ఎన్నో అకృత్యములు చేయుచుండెను. ఒక్క ఉజ్జయినీ నగరము తప్ప రాక్ష గణముతో ఉజ్జయినీ నగరములోనికి ప్రవేశించి బ్రాహ్మణుల, భక్తుల కార్యక్రమాలను స్తంభింపచేసి వారిని బాధించుచుండెను. అయినను వేదప్రియుడు, అతని కుమారులు పరమేశ్వరుని మీద నమ్మకముతో, అకుంఠిత దీక్షతో స్వామివారి మీద భారము మోపి పార్ధివ లింగారాధన చేయుచుండిరి. దూషణుడు వేదప్రియుడు తదితరులను ఎప్పుడైతే బాధించుటకు వచ్చెనో అక్కడ వున్న ఒక గుంట నుండి పరమేశ్వరుడు మహాకాలుని రూపంలో ప్రత్యక్షమై దూషణుడిని, వాని అనుచరులను భస్మమొనర్చెను. మహాకాలుడు ఆ బ్రాహ్మణ కుటుంబమును, భక్తులను వరము కోరుకోమనగా భక్తులందరు ముక్త కంఠముతో స్వామిని అచ్చటనే జ్యోతిర్లింగ రూపమున నివసించమని ప్రార్ధించగా వారి కోరిక మన్నించి పరమేశ్వరుడు మహాకాళ జ్యోతిర్లింగముగా అవతరించెను.
ఉజ్జయినిలో దర్శించవలసిన దేవాలయములు చాలా వున్నవి. విక్రమాదిత్య మహారాజు ప్రతిరోజు దర్శించి, పూజించిన హరసిద్ధి మాతా మందిరము అందులో ఒకటి.
ఉజ్జయిని క్షేత్రములోనే సాందీపముని వద్ద శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు విద్యను అభ్యసించిరి. ఆయన పేరుతో సాందీపుని ఆశ్రమము వున్నది. ఈ క్షేత్రములో వేంచేసియున్న కాలభైరవ స్వామికి మద్యమును నైవేద్యముగా సమర్పించి తిరిగి దానినే భక్తులకు తీర్థముగా ఇచ్చుట విశేషము. విగ్రహము పెద్దది. స్వామివారి నోటివద్ద మత్తు పానీయములు ఒక పాత్రలో యుంచి పెట్టిన ఆ పాత్ర ఖాళీ అగును. ఇది మనం కళ్ళారా చూడవచ్చును.
క్షిప్రా నదిలో స్నానమాచరించి మహాకాళేశ్వరుని దర్శించిన సర్వ పాపములు పటాపంచలగునని భక్తుల విశ్వాసము..
ఈ క్షేత్రంలో శివలింగాలు మూడు అంతస్థుల్లో వుండటం విశేషం. మొదట మహాకాళ లింగం, తరువాత ఓంకారలింగం, చివరగా వుండేది నాగచంద్రేశ్వర లింగం. చివరలో వుండే నాగచంద్రేశ్వర లింగ విగ్రహాన్ని నాగపంచమి రోజున మాత్రమే దర్శనం చేసుకోగలం. మిగతా రోజుల్లో దర్శనానికి అనుమతివుండదు. మహాకాళేశ్వరుడు వున్న ప్రాంతం కింద శంఖుయంత్రం వుంది. స్వామి ఆరాధనలో భాగంగా శంఖువును వూదుతారు.
మహాకాళేశ్వర ఆలయంలో తెల్లవారుఝామున స్వామివారికి సమర్పించే భస్మహారతి విశిష్టంగా వుంటుంది. ఇతర క్షేత్రాల్లో ఇలాంటి హారతిని మనం వీక్షించలేం. ప్రతిరోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొదట మహాకాళేశ్వర లింగానికి జలాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం విభూతిని కొడుతూ భస్మహారతి ఇస్తారు. ఈ క్రమంలో గర్భగుడి విభూతితో నిండిపోయి సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడకు విచ్చేసిన దివ్యానుభూతి కలుగుతుంది. అదే సమయంలో మోగించే వాయిద్యాల హోరుతో శంభోశంకర హర హరహర మహదేవ అన్న నినాదాలతో ఆలయం నిత్యనూతనత్వాన్ని సంతరించుకుంటుంది. మనిషి జీవితచక్రంలో అనేకమైన దశలుంటాయి. జన్మించింది మొదలు చనిపోయేవరకు అనేక ఘట్టాలను జీవుడు చవిచూస్తాడు. చివరకు అంతిమక్రియల అనంతరం భస్మంగా మారుతాడు. ఈ నిత్యసత్యాన్ని గుర్తుచేసేవిధంగా ఆ పరమేశ్వరునికి భస్మహారతి నిర్వహిస్తారు. భస్మహారతిని వీక్షిస్తే అకాల మృత్యు బాధలుండవు. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ పూజ చేశాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఈ క్షేత్రాన్ని మహాస్మశానమని కూడా పిలుస్తారు.
మహాకాళికాదేవి ఆలయము :
అష్టాదశ శక్తి పీఠాల్లో ఈ క్షేత్రం ఒకటిగా వుంది. అమ్మవారు మహంకాళిగా సమస్త మానవాళిని రక్షిస్తుంటారు. మహాకవి కాళిదాసుకు అమ్మవారు దర్శనమిచ్చారు.
స్వామివారి ఆలయమునకు 5 కిలోమీటర్ల దూరములో కాళికాలయము వున్నది. అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైనటువంటి మహాకాళికాదేవి ఆలయము కూడా ఇచ్చటనే కలదు.
స్థలపురాణం :
శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. సతీదేవి పై పెదవి ఈ ప్రాంతంలొ పడింది. ఈమె మహాకాళేశ్వరుని శక్తి.
స్కంధపురాణం లో
మహాకాళిని రక్తదంతిక / చాముండగా వర్ణించారు
పూర్వం ఉజ్జయిని నగరాన్ని అంధకాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతనికి ఒక ప్రత్యేక మైన వరం ఒకటి ఉంది. అది ఏమిటంటే యుద్ధరంగంలో నేలకు తాకిన అతని ప్రతి రక్తపుచుక్క నుండి అంతటి శక్తివంతమైన ఒక రాక్షసుడు పుడతాడు. మహకాళేశ్వరుడు దేవతల ప్రార్ధన మీరకు అతనితో యుధ్ధం చేస్తాడు. మహావినాయకుడు/స్థిరమన్ గణేష్ అతనిని అదుపు చేస్తాడు. అప్పుడు శివుడు అంధకాసురుని హృదయమును త్రిశూలంతో ఛేదిస్తాడు. అప్పుడు చాలామంది అంధకాసురులు పుడతారు.
అప్పుడు మహకాళి ఆవిర్భవించి ఆ అంధకాసురుని రక్తాన్ని అంతా తాగివేస్తుంది. ఆ తరువాత శివుడు అంధకాసురుని త్రిశూలంతో పైకిఎత్తి తన మూడో కన్నుతో దహిస్తాడు. చివరకి అంధకాసురుడు తన ఓటమిని ఒప్పుకొని శివుని ప్రార్ధిస్తాడు. దానికి సంతోషించిన శివుడు అతనిని క్షమించి భృంగిగా మార్చి గణాధ్యక్ష పదవిని ఇస్తాడు..
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి రైలు సౌకర్యముంది.
సమీప విమానాశ్రయం ఇండోర్ లో వుంది. ఇక్కడ దిగి కారు లేదా ఇతర వాహనాల ద్వారా ఉజ్జయిని చేరుకోవచ్చు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి కూడా చేరుకునే సౌకర్యముంది.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
ujjain temple online booking, ujjain temple timings, ujjain temple open or not today, ujjain temple address, ujjain temple pin code, mahakaleshwar temple ujjain history, ujjain temple which state, www.mahakaleshwar.nic.in live, ujjain temple timings