ఎందరికో బ్రతుకు బాట – శ్రీ చాగంటి గారి మాట


 పూజ్య గురువుల మాటల స్ఫూర్తితో భాగవతుల కోసం నేను మొదలుపెట్టిన  ప్రయత్నమే తరువాత నాకు ఉద్యోగం తెచ్చిపెడుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు...

.....................................................

"ఎందరికో బ్రతుకు బాట – శ్రీ చాగంటి గారి మాట - 006"

పూజ్య గురువుగారి ప్రవచనం లో ఒకానోక చోట - "మీరు నాకు ఉపకారం చేసినదానికంటే, మా అబ్బాయ్ కి మీరు ఏదైనా సహాయం చేస్తే...వాడు నాతో నాన్నగారు ఫలానా అయన ఆ సమయం లో నాకు సహాయం చేసారు అంటే నేను ఎలాగైతే సంతోషిస్తానో - భగవతంతుడు కూడా తన భక్తులకు సహాయం చేసేవాణ్ణి చూసి అలానే సంతోషిస్తాడు. భగవంతుని పూజకన్నా భాగవతుల సేవకి భగవంతుడు సంతోషిస్తాడు, నన్ను నమ్ముకున్న వాడికి సహాయం చేశాడు, సహాయపడ్డాడు అని భగవంతుడు పొంగిపోతాడు " అని ఒకప్రవచనంలో చెప్పారు. ఈ మాటే నాకు నా జీవితాన్ని మార్చింది అంటే ఎవరు నమ్మలేరు. 

చెన్నైలో ఉద్యోగం చేస్తుండగా గురువుగారి ప్రవచనం లో రామేశ్వరం విశిష్టత తెలుసుకుని 2011 లో  నేను, మా సార్ రామేశ్వరం వెళ్ళాం. "కాస్తో కూస్తో తమిళం వచ్చిన మనకే  ఇక్కడ ఇలా ఉంటే , అసలు తమిళం రాని వాళ్ళ పరిస్థితి ఏమిటి ?" అని ఆలోచన వచ్చింది. గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. భక్తులకు వారి యాత్రకు సంబంధించిన సమాచారం ఇస్తే వారికీ ఉపయోగపడుతుంది కదా అని 2011 లో యాత్ర విశేషాలను ఒక బ్లాగ్ తయారు చేసి ఆ బ్లాగ్ లో పోస్ట్ చేశాను. ఆ బ్లాగ్ లో వరుసగా  అరుణాచలం, కాంచీపురం ,మధురై క్షేత్ర విశేషాలు అందులో పోస్ట్ చేశాను.  ఇంతకు ముందు  గుడి అంటే వెళ్లడం, నమస్కరించుకుని రావడం ఒక్కటే చేసేవాణ్ణి. కానీ సమాచారం ఇవ్వడం మొదలు పెట్టిన తరువాత దేవాలయ స్థలపురాణం ఏమిటి , చరిత్ర ఏమిటి అన్ని తెలుసుకోవడం మొదలు పెట్టాను. అలా చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి వారాంతం బస్సుల్లో, రైళ్లలో తమిళనాడులో ఉన్న ఒక్కొక్క గుడికి వెళ్ళి దర్శించుకుని సమాచారం సేకరించి బ్లాగ్లో పోస్ట్ చేసేవాణ్ణి. ఇప్పుడు తమిళనాడు మాత్రమే కాక మిగిలిన ప్రదేశాలలో చూసిన అన్ని దేవాలయాల వివరాలు ఈ బ్లాగులోనూ, ఫేస్బుక్ పేజీలోనూ పోస్ట్ చేయడం జరిగింది. యాత్రలకు వెళ్లినప్పుడు చూడవలసిన ఆలయాల సమాచారం ఒక చోటే తెలుగులో ఉండడం వల్ల ఇప్పుడది కొన్ని వేల మందికి ఉపయోగపడుతోంది. 

పూజ్య గురువుల మాటల స్ఫూర్తితో భాగవతుల కోసం నేను మొదలుపెట్టిన "దేవాలయాల సమాచారం తెలుసుకోవడం" అనే ప్రయత్నమే తరువాత నాకు ఉద్యోగం తెచ్చిపెడుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు. ఆధ్యాత్మిక విషయాల పై అవగాహన, దేవాలయాల సమాచారం తెలిసి ఉండటం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. 

గురువు గారు ఆ రోజు చెప్పిన మాట నేను ఎవరికో సేవ చేస్తానని కాదు, బహుశా నా కోసమే చెప్పారని ఇప్పుడు అర్ధమైంది. శాస్త్ర వాక్యములు మాత్రమే ప్రవచించే గురువాక్యం పాటించిన వారికి ఎప్పటికైనా మంచే జరుగుతుంది !

(వ్యక్తుల గోప్యతహక్కుననుసరించి పేర్లు వ్యక్తపరచడం జరగలేదు)

మీ

శ్రీ గురువాణి సంస్థ సభ్యులు

Sree Guru Vaani Society - Registered

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS