ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు..
అయోధ్యా మధురా మాయా కాశీ
కాంచీ అవంతికాపురీ ద్వారవతీ
చైవ సప్తైతే మోక్షదాయకాః"
ఈ శ్లోకం జగత్ ప్రసిద్ధం
అర్థం: అయోధ్యా , మధుర , మాయ ( హరిద్వార్) ,
కాశీ , కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక.
ఈ 7 ముక్తినిచ్చే స్థలాలు. ( నగరాలు)
1) అయోధ్య: అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానమని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీ తీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుంది.
2) మధుర: మాధుర అంటే తీయనైనదని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.
3)మాయ: దీనినే హరిద్వార్ అని పిలుస్తారు. విష్ణుసన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాలనుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగుమోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.
4)కాశీ: భూలోక కైలాసంగా ప్రసిద్ధిచెందిన ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీతీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగానదిలో సంగమించడంవల్ల ఈ పట్టణానికి 'వారణాసి' అని కూడా పేరు.
5) కాంచీపురం: దక్షిణ భారతంలోని పవిత్ర నగరమిది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం శివుడికి, విష్ణువుకు, శక్తికి నెలవు. అద్వైతతత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటిపీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తిస్తుందని ప్రాచీనకాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.
6)అవంతిక: భారతభూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే ఉజ్జయినీ నగరానికే అవంతిక అని ప్రాచీన నామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథుడైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదు.
7) ద్వారవతి: అంటే ద్వారకానగరం. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామమిది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కల్సి పోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం ద్వారకానాథ్గా ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయముంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారంద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికొస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధిచెందింది.
Famous Posts:
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు, kashi, dwaraka, avantika, kanchipuram, maya, madhura, ayodya, hindu temples, devotional story's Telugu