ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం - మార్గశిర లక్ష్మివార వ్రత విధానం | Margashira Lakshmi vratham

ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం (మార్గశిర లక్ష్మీవార వ్రతం)

హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం..’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే..’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందంచేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే!

ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రతవిధానం అందరి కోసం..

లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.

ఐదువారాల అద్భుత వ్రతం..

మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.

ఈ సంవత్సరమందు మార్గశిర లక్ష్మివారముల తేదీలు:

డిసెంబర్  14వ తేదీ గురువారం

డిసెంబర్ 21వ తేదీ గురువారం

డిశంబర్ 28వ తేదీ గురువారం

జనవరి 4వ తేదీ గురువారం

జనవరి  11వ తేదీ గురువారం

వ్రతవిధానం

ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి.

" ‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’  "

అంటూ లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.

అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహానైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని అక్షతలు శిరసున ధరించాలి.  చివరగా క్షమాప్రార్థన చేయాలి.

అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు.

తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి.

* రెండవవారం  అట్లు ,తిమ్మనం

* మూడోవారం  అప్పాలు ,పరమాన్నము

* నాలుగోవారం  చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి.

* ఐదోవారం నాడు అమ్మవారికి  పూర్ణం బూరెలను నివేదించాలి.

ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళగౌరీవ్రతంలాగ పూజపూర్తయ్యాక ఉద్యాపన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లోసౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ.

నియమనిష్ఠలు కీలకం

గురువార వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచేస్త్రీలు ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలిసంధ్య, మలిసంధ్య నిదురపోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్యదేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుంది.

ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పదికాలాలు పచ్చగా వర్ధిల్లవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీప్రసన్నంగా మార్చుకోవచ్చు.

మార్గశిర లక్ష్మీవార వ్రత కధ:

పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల.

ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను.

మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది.

సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను. ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు. ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకు. తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను. ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లిచేప్పినది.

ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు. మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది. పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురుమాత్రమే చేసుకున్నది. నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది.

అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా..నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది.

మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను. కధలోపమైనను వ్రత లోపము కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు.

Famous Posts:

అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు

గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే

దీపావళి రోజు ఉప్పుతో ఇలా చేస్తే చాలు 

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి? 

నిత్య దరిద్ర కారణాలు ఇవే..

రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు

అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?

margasira lakshmi pooja 2020, margasira masam, margashirsha guruvar 2020 start date, margasira masam 2020 start date, margasira lakshmivaram nomu, lakshmi devi pooja vidhanam, in telugu free download pdf, lakshmivaram in english, lakshmi devi katha telugu lo, మార్గశిర లక్ష్మివార వ్రత విధానం, Margashira Lakshmi vratham

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS