మణిద్వీప వర్ణన చదివినా విన్నా అష్టైశ్వర్యాలు కలుగుతాయి..
మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయిపడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదు.
ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయముచేయగల ముప్పదిరెండు మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్థ విశ్వమూ ఉండుటవలన ముప్పదిరెండురకాల పూలతో,
పసుపు..కుంకుమలతో..నవరత్నాలతో..
రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో యదాశక్తి అమ్మకు పూజచేసుకుంటూ..
నైవేధ్యాలుగా 32 రకాలు చేసి,
సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు.
32 రకాల నైవేధ్యాలకు శక్తిలేనివారు యదాశక్తి నైవేధ్యాలను సమర్పించుకొని పూజించుకోవచ్చు. అమ్మకు భక్తి ప్రధానము.
మొగలి పూవు,బంతి పూవూ పూజకు పనికిరాదు .
మందారాలలో గులాబీలలో చామంతులలో చాలా రకాలు ఉన్నా వాటన్నిటినీ ఒక్కొక్కటిగానే పరిగణించి ఈక్రింద ఇవ్వడము జరిగింది. ఇవ్వికాక ఇంకేమైనా ఉన్నా, వీట్లో ఏమైనా అమ్మ పూజకు పనికిరావన్నా తెలియజేయండి.
1. మల్లెపువ్వులు 2. గులాబి 3. సన్నజాజి 4. విరజాజి 5.సెంటుమల్లి 6. డిసెంబరంపువ్వులు 7. చామంతులు
8. లిల్లీ 9. ముద్దగన్నేరుపువ్వులు 10. నందివర్ధనం
11. పారిజాతపూలు 12. చంద్రకాంతంపూలు 13. సువర్నగన్నేరుపూలు 14. కలువ పూలు 15. పాటలీపుష్పాలు
16. ముద్దనందివర్ధనం 17. గన్నేరుపూలు 18. కదంబపూలు
19. మందారాలు 20. తామరలు 21. కనకాంబ్రాలు
22. దేవగన్నేరు పూలు 23. అశోక పుష్పాలు 24. నిత్యమల్లెపువ్వు
25. కుంకుమపువ్వు 26. పొన్నపువ్వు 27. మంకెనపువ్వు
28. రాధామనోహరాలు 29. కాడమల్లె 30. నాగమల్లె
31. విష్ణుక్రాంతం 32. రామబాణాలు లేక నూరు వరహాలు
33. దేవకాంచన పూలు 34. చంపక ( సంపంగి) 35. పున్నాగ పుష్పాలు.
మణిద్వీప వర్ణన మహత్యమేమిటి?
శ్రీచక్ర బిందు రూపిణి శ్రీ రాజరాజేశ్వరి శ్రీదేవి శ్రీ మహావిద్య శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. పదునాలుగు లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై వున్నారు. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో పరివేష్టితయై వుంటారు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో వున్నాయి. అనేక ప్రాకారాల అనంతరం అమ్మవారు దర్శనమిస్తారు.
మొదట వచ్చే ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, వివిధ రకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం. యావత్ విశ్వంలో ఎక్కడా లభించని అనంతమైన సంపద అక్కడ వుంటుంది. అన్నింటినీ మించి అమ్మ సన్నిధిలో వుండటమే మహావరం. అందుకనే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తుంటారు. ఈ పారాయణంతో ఇంట్లోని వాస్తుదోషాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఐశ్వర్యాలూ లభిస్తాయి.
మహాసంపదలిచ్చు - మణిద్వీప వర్ణన
మహాశక్తి మణిద్వీప నివాసిని
ముల్లోకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములొ మంత్రరూపిణి
మన మనస్సులలొ కొలువైయింది||1||
సుగంధ పుష్పాలెన్నో వేలు
అనంత సుందర సువర్ణపూలు
అచంచలంబగు మనో సుఖాలు
మణి ద్వీపానికి మహానిధులు ||2||
లక్షల లక్షల లావణ్యాలు
అక్షర లక్షల వాక్ సంపదలు
లక్షల లక్షల లక్ష్మీపతులు
మణి ద్వీపానికి మహానిధులు ||3||
పారిజాత వన సౌగంధాలు
సురాధినాధుల సత్సంగాలౌ
గంధర్వాధుల గాన స్వరాలు
మణి ద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||4||
పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడవునగలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు ||5||
అరువదినాలుగు కళామతల్లులు
వరాలనొసగే పదారు శక్తులు
పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు ||6||
అష్టసిద్ధులు నవ నవ నిధులు
అష్టదిక్కులూ దిక్పాలకులు
సృష్టికర్తలు సురలోకాలౌ
మణిద్వీపానికి మహానిదులు ||7||
కోటి సూర్యులు ప్రపంచ కాంతులు
కోటి చంద్రుల చల్లని వెలుగులు
కోటి తారకల వెలుగు జిలుగులు
మణిద్వీపానికి మహానిదులు
||భువనేశ్వరీ|| ||8||
కంచుగోడల ప్రాకారాలు
రాగిగోడల చతురస్రాలు
ఏడామడల రత్నరాసులు
మణిద్వీపానికి మహానిధులు ||9||
పంచామృతమయ సరోవరాలు
పంచలోహమయప్రాకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు ||10||
ఇంద్రనీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైఢూర్యాలు
పుష్యరాగమణి ప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు ||11||
సప్తకోటి ఘన మంత్రవిద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||12||
మిలమిలలాడే ముత్యపురాసులు
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు ||13||
కుబేర ఇంద్ర వరుణ దేవులు
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమి గణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు ||14||
భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు
పంచ భూతములు పంచ శక్తులు
సప్తఋషులు నవగ్రహాలు
మణిద్వీపానికి మహానిధులు ||15||
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిల మహాగ్రహాలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||16||
మంత్రిణి దండిని శక్తి సేవలు
కాళి కరాళి సేనాపతులు
ముప్పది రెండు మహాశక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||17||
సువర్ణ రజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు ||18||
సప్త సముద్రములనంత నిధులు
యక్ష కిన్నెర కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు ||19||
మానవ మాధవ దేవ గణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్థితిలాయకారణమూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||20||
కోటి ప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మ శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||21||
దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు ||22||
శ్రీ విఘ్నేస్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంత భవనములు
మణి నిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు ||23||
పంచ భూతములు యజమాన్యాలు
వ్రాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్షసముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
||భువనేశ్వరీ|| ||24||
చింతామణులు నవరాత్రులు
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు గరుడపచ్చలు
మణిద్వీపానికి మహానిధులు ||25||
దఃఖము తెలియని దేవీ సేవలు
నటనాట్యాలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్థాలు
మణిద్వీపానికి మహానిధులు ||26||
పదునాల్గు లోకాలన్నిటిపైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వత స్థానం ||27||
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములొ
||భువనేశ్వరీ|| ||28||
మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములొ ||29||
పరదేవతను నిత్యము కొలిచి
మనసర్పించి అర్పించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది ||2 సార్లు|| ||30||
నూతన గృహములు కట్టినవారు
మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు
చదివిన చాలు అంతా శుభమే
అష్ట సంపదల తులతూగేరు ||2 సార్లు|| ||31||
శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి
మణిద్వీప వర్ణన ఛదివినచోట
టిష్ట వేసుకొని కూర్చొనునంటా
కోటి శుభాలను సమకూర్చుకొనుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే కైవల్యం ||2 సార్లు|| ||32||
ఫలశృతి:
పదునాలుగు లోకాలకూ పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని, పరమేశ్వరిని, తొమ్మిది విధాలుగా కీర్తించుకొనుటకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టంగాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతిమనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారమునాడు పూజావిధాన ప్రకారము పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన, కనక, వస్తు, వాహనాది సంపదలు కలిగి భక్తి, జ్ఞాన, వైరాగ్య, సిద్ధులతో ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో తులతూగి, చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.
శ్రీమాత నివాసం చింతామణి గృహం
విజయదశమి పర్వదిన శుభవేళ ఆ జగజ్జనని, శివాత్మక మణిద్వీప నివాసినీ అయిన ఆ
తల్లిని స్మరించుకోవటం ఎంతో శుభప్రదం. ఆ అమ్మ మణిద్వీపంలో ఎలా
అలరారుతోంది అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించి చెప్పే కథ
దేవీభాగవతంలో వర్ణితమై ఉంది. నూతన గృహప్రవేశ శుభ సందర్భాలలో తరతరాలుగా
మణిద్వీప వర్ణన పారాయణం చేస్తూ ఉండటం ఓ ఆచారంగా వస్తోంది.
పరదేవత అయిన ఆ శ్రీమాత ప్రపంచాన్నంతటనీ పరిరక్షిస్తుంది. ఆమె నిత్యం
నివసించే గృహమే చింతామణి గృహం. అది మణిద్వీపంలో ఉంటుంది.
సర్వలోకోత్తమోత్తమైన ఆ మణిద్వీపాన్ని స్మరిస్తే చాలు సర్వపాపాలూ
నశిస్తాయని దేవీభాగవతం పన్నెండో స్కంధం వివరిస్తోంది. దుష్టశిక్షణ,
శిష్టరక్షణ చేస్తూ జగత్తునంతటినీ పాలించే ఈ భువనేశ్వరీ మాత నివసించే
చింతామణి గృహం వేయిస్తంభాల మండపాలతో విరాజిల్లుతుంటుంది. ఇలాంటి మండపాలు
నాలుగుంటాయి. శృంగార మండపం, ముక్తిమండపం, జ్ఞానమండపం, ఏకాంత మండపం అని
వాటికి పేర్లు. కోటి సూర్యప్రభలతో అవి నిత్యం ప్రకాశిస్తుంటాయి.
వాటిచుట్టూ కాశ్మీరం, మల్లికా, కుందవనాలు అలరారుతుంటాయి. ఆ వనాలలో
కస్తూరి మృగాలు సంచరిస్తూ పరిమళాలను ప్రసరింపజేస్తుంటాయి. అక్కడే
సుధారసపూర్ణంగా ఉండే ఒక పెద్దసరోవరం ఉంటుంది. ఆ సరోవరం అంచులు,
సోపానాలన్నీ అనేకానేక మణులు, రత్నాలతో పొదిగి ఉండి మనోహరంగా ఉంటాయి. ఆ
సరోవరం మధ్యలో ఓ మహాపద్మవనం, హంసల్లాంటి పక్షులు ఎంతో ముచ్చటగొలుపుతూ
ఉంటాయి. చింతామణి గృహంలో పదిమెట్లతో ఉన్న ఓ వేదిక ఉంటుంది. ఆ వేదికకు
ఉన్న పదిమెట్లూ పది శక్తిస్వరూపాలు. దానికి ఉండే నాలుగు కోళ్లపై ఉండే
ఫలకమే సదాశివుడు. ఆ ఫలకం మీద మాత భువనేశ్వరుడి వామాంకంలో కూర్చొని
ఉంటుంది. ఆ మాతకు రత్నాలు పొదిగిన వడ్డాణం, వైఢూర్యాలు తాపడం చేసిన
అంగదాలు అలరారుతుంటాయి. శ్రీచక్రరూపంలో ఉన్న తాటంకాలతో శ్రీమాత ముఖపద్మం
కళకళలాడుతుంటుంది. చంద్రరేఖను మించిన అందంతో ఉండే నొసలు, దొండపండ్లలా
ఉండే పెదవులు, కస్తూరి కుంకమ, తిలకం దిద్ది ఉన్న నుదురు, దివ్యమైన
చూడామణి, ఉదయభాస్కర బింబంలాంటి ముక్కుపుడక ఇలా ఎన్నెన్నో దివ్యాభరణాలు,
మైపూతతో శ్రీమాత అలరారుతుంటుంది. ఆ మాతకు పక్కభాగంలో శంఖ, పద్మ నిధులు
ఉంటాయి. వాటి నుంచి నవరత్న, కాంచన, సప్తధాతు వాహినులు అనే నదులు పరవళ్లు
తొక్కుతూ అమృత సంద్రంలోకి చేరుతుంటాయి. జగజ్జనని భువనేశ్వరుడి పక్కన
ఉన్నది కాబట్టే ఆయనకంతటి మహాభాగ్యం, శక్తియుక్తులు లభించాయని అంటారు. మాత
నివసించే చింతామణి గృహం వెయ్యి యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ గృహానికి
ఉత్తరంగా అనేకానేక శాలలు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. ఇవన్నీ ఆ అమ్మ
శక్తిప్రభావంతో అంతరిక్షంలో ఏ ఆధారమూ లేకుండా వేలాడుతుంటాయి. ప్రతి
బ్రహ్మాండంలోనూ ఉండే దేవ, నాగ, మనుష్య జాతులకు చెందిన దేవీ ఉపాసకులంతా
చేరేది ఈ చింతామణి గృహానికే. కరుణారస దృక్కులతో ఆమె తన బిడ్డల వంక చూస్తూ
ఉంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమన్వితంగా ఆ మాత కన్పిస్తుంటుంది.
ఆమె చుట్టూ లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ,
స్మృతి, లక్ష్మీ అనే దేవాంగనలు ఉంటారు. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య,
విలాసిని, అఘోర, మంగళ, దోగ్ద్రి అనే తొమ్మిది పీఠాశక్తులు జగన్మాతను
నిరంతరం సేవిస్తూ ఉండటం కన్పిస్తుంది. కేవలం దేవి ఉపాసకులకేకాక
నిరంతరార్చన తత్పరులకు ఇక్కడే స్థానం దొరుకుతుంది. ఈ ప్రదేశంలో మరో గొప్ప
తనమేమిటంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, ద్రాక్ష, నేరేడు, మామిడి,
చెరకురసాల జీవనదులు ప్రవహిస్తుంటాయి. కోర్కెలను తీర్చే మహత్తర వృక్షాలు
ఇక్కడ ఎన్నెన్నో. ఈ ప్రాంతంలో ఉండేవారికి కామ క్రోధ లోభ మోహ మద
మాత్సర్యాలుండవు. అంతా నిత్యయౌవనంతో ఆనందంతో ప్రకాశిస్తుంటారు. వారంతా భువనేశ్వరీ మాతను నిరంతరం భజిస్తూ ఉంటారు.
దేవతలంతా ఇక్కడికి వచ్చి అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మ నివసించే మణిద్వీపమూ
అందులోని చింతామణి గృహమూ ఒక్కోసారి ఒక్కో విధంగా పవిత్రకాంతులను
వెదజల్లుతూ ఉంటాయి. ఐశ్వర్యానికీ, యోగానికీ అన్నిటికి అది పరమావధి.
జగత్తునంతటినీ తానై యుగయుగాలుగా పాలిస్తున్న ఆ జగన్మాత చిద్విలాసం
దేవీభాగవతంలో ఇలా కన్పిస్తుంది. తన భక్తులకు బాధ కలిగిందని
తెలిసినప్పుడల్లా తానే స్వయంగా ముందుకువచ్చి దుష్ట శిక్షణ చేస్తుండే ఆ
పరాంబిక ఎక్కడుంటుంది అని ఎవరికైనా కలిగే సందేహమే. ఆ సందేహానికి
సమాధానమిస్తూ మణిద్వీపంలో ఉండే చింతామణి గృహంలో ఉండే ఆ శ్రీమాత గురించి ఈ
కథా సందర్భం ఇలా వివరించి చెప్పింది. మణిద్వీప వర్ణన, చింతామణి
గృహవర్ణనలు వింటేనే సకల పాపాలూ నశిస్తాయని భక్తకోటి నమ్మకం.
ఓం శ్రీమాత్రే నమః
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
manidweepa varnana telugu pdf free download, manidweepa varnana telugu audio download, manidweepa varnana benefits, manidweepa varnana lyrics in english, manidweepa varnana miracles, manidweepa varnana download, manidweepa varnana meaning, manidweepa varnana by chaganti, మణిద్వీప వర్ణన, Manidweepa Varnana