అసలు గురుపౌర్ణమి ఎలా వచ్చింది ? విశిష్ఠత ఏమిటో తెలుసా | Significance of Guru Purnima

 
అసలు గురుపౌర్ణమి ఎలా వచ్చింది ?
విద్య వికాసానికి మూలం. తమస్సు తొలగించి, జీవనాన ఉషస్సు కలిగించి, శాశ్వతమైన తేజస్సు అందించేది విద్య. మాయ, అవిద్యలు మనిషిని ఆవరించి ఉంటాయి. వాటివల్ల జన్మ మృత్యు జరా వ్యాధులు ఏర్పడతాయి. చిత్త భ్రమ, విభ్రాంతులు సంభవిస్తాయి. అలాంటి వాటిని తన జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి- గురువు. అజ్ఞానాంధకారాన్ని తొలగించి శిష్యుల అంతఃకరణాల్ని శుద్ధిచేసే మహితాత్మ స్వరూపం- గురువు. జ్ఞానశక్తితో, ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే త్రిమూర్తుల ఆకృతి- గురువు.
గురువు అన్నమాటకు చాలానే అర్థాలు వెతుక్కోవచ్చు. చీకటిలాంటి అజ్ఞానాన్ని పారద్రోలేవాడనీ, అధికుడనీ... ఇలా ఎన్ని తాత్పర్యాలనైనా విడదీయవచ్చు. ఎవరే అర్థాన్ని అన్వయించుకున్నా మానవులకు అవసరమైన జ్ఞానాన్ని అందించేవాడు గురువు అనడంలో ఎవరికీ ఏ సందేహమూ ఉండదు. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :'
కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా, ద్వాపర యుగంలో వ్యాసుడిగా, కలియుగంలో ఆదిశంకరాచార్యుడిగా గురు స్వరూపం భాసిల్లింది. భారతీయ ఆర్ష వాంగ్మయంలో వేదవ్యాసుడికి ప్రముఖ పాత్ర ఉంది. మేధాశక్తి, ధర్మదీక్ష, ఆధ్యాత్మిక పరిణతి, జ్ఞాన పటిమలతో వ్యాసమహర్షి సనాతన సంప్రదాయ సారస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం చేశారు. నేటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి- వ్యాస జయంతి. గురు పరంపరలో విఖ్యాతి చెందిన వ్యాసుడు నిండు పున్నమి రోజున ఆవిర్భవించి, తన సుజ్ఞానమనే సిరివెన్నెల వెలుగులతో ఆర్ష ధర్మాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని దీప్తిమంతంగా ఆవిష్కరించారు. అమూల్యమైన వేదరాశిని సంస్కరణ చేసి, నాలుగు వేదాలుగా విభజించి, వేద వ్యాసుడయ్యారు. అష్టాదశ పురాణాలను, ఉపపురాణాల్ని రచించారు. భక్తి ప్రాధాన్యమైన భాగవత మకరందాన్ని అందించారు. తాను దర్శించిన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మసూత్రాలుగా ప్రకటించారు. చతుర్విధ పురుషార్థాల సాధన కోసం పంచమ వేదమైన మహాభారతాన్ని సృజించి, జాతికి అమూల్య కానుకగా అనుగ్రహించారు. నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా, రెండు చేతులు మాత్రమే ఉన్న విష్ణువుగా, ఫాలనేత్రం లేని పరమేశ్వరుడిగా వేదవ్యాసుణ్ని భారతీయ సనాతన ధర్మం అభివర్ణించింది. గురోర్గురువు అనే విశేషణం వ్యాసుడికి దక్కిన కీర్తి కిరీటం. పరంపరాగతంగా ప్రభవించిన అనేకమంది సద్గురువులకు వ్యాసుడు ఆరాధ్యుడు.
వ్యాసుడు:
పరాశరుడు అనే రుషికీ సత్యవతి అనే జాలరి కన్యకీ పుట్టినవాడు వ్యాసుడు. అలా వ్యాసుని జననమే కులరహితంగా ఏర్పడింది. నిజానికి వ్యాసుని అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. నలుపు రంగులో ఉన్నవాడు కాబట్టి కృష్ణ అనీ, ద్వీపం (ద్వైపాయనము) మీద జన్మించినవాడు కాబట్టి ద్వైపాయనుడు అనీ ఆయనకు ఆ పేరు స్థిరపడిందంటారు. అప్పటివరకూ ఉన్న వేద సాహిత్యాన్ని క్రోడీకరించి, నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి ఈ కృష్ణద్వైపాయనుడు ‘వేదవ్యాసుడు’గా మారాడు. వేదవ్యాసుడు అనగానే మహాభారతం గుర్తుకు వస్తుంది. వ్యాసుడు మహాభారత రచయితే కాదు, అందులో ఒక ముఖ్య పాత్ర కూడా! ఇంకా చెప్పాలంటే వ్యాసుడు లేనిదే భారతం లేదు. ఎందుకంటే వ్యాసుని కారణంగానే దృతరాష్ట్రుడు, పాండురాజు, విదురులు జన్మించారు. మరి వ్యాసుడు లేకపోతే కౌరవపాండవుల ఉనికే ఉండేది కాదు కదా! పైగా వ్యాసుని తల్లి అయిన సత్యవతి, భీష్ముని తండ్రి అయిన శంతనుని వివాహం చేసుకుంటుంది.

అంటే! భీష్ముని దగ్గర్నుంచీ భీముని వరకూ ప్రతి ఒక్కరూ వ్యాసునికి అయినవారే! వ్యాసుడు కేవలం భారతాన్నే కాదు, భాగవతం సహా అష్టాదశ పురాణాలనీ రాశాడనీ... యోగసూత్రాలకు భాష్యాన్ని అందించాడనీ చెబుతారు. ఇక బ్రహ్మసూత్రాలను రాసిన బాదరాయణుడు మరెవ్వరో కాదు, వ్యాసుడు అని నమ్మేవారు కూడా లేకపోలేదు. అంటే హైందవ సంస్కృతికి మూలమైన వాఙ్మయమంతా వ్యాసుడు వల్ల ఒక కొలిక్కి వచ్చిందన్నమాట. అలాంటి వ్యాసుని గురుపరంపరకు ప్రతినిధిగా భావించి, ఆయన పుట్టినరోజుని గురువులను ఆరాధించుకునే పండుగగా జరుపుకోవడంలో ఆశ్చర్యం ఏముంది!
ఆదియోగి శివుడు: 
గురువుద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని ఆర్జించి, దానిని ఆచరణలో పెట్టినవాడే యోగిగా మారగలడు. కానీ ఎలాంటి గురువూ అవసరం లేకుండానే నిర్వికల్ప స్థితిని సాధించినవాడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే! అందుకనే ఆయనను ఆదియోగిగా కొలుచుకుంటున్నారు. అలాంటి ఆదియోగి నుంచి జ్ఞానాన్ని పొందుదామనుకుని ఎందరో ప్రయత్నించి విఫలమైనారట. కానీ ఒక ఏడుగురు మాత్రం పట్టు విడువకుండా ఆయన చెంతనే ఉండిపోయారు. తమతో ఆయన ఒక్క మాట మాటలాడకున్నాగానీ సంవత్సరాల తరబడి ఆయన కరుణ కోసం వీక్షిస్తూ తపించిపోయారు.

శివుడు వారి పట్టుదలను పరీక్షించేందుకు దశాబ్దాల తరబడి వారికి ఎటువంటి బోధా చేయలేదు. అయినా వారి పట్టు సడలనేలేదు. శివుని దివ్యసముఖంలో తపస్సుని ఆచరిస్తూ ఉండిపోయారు. చివరికి ఒకరోజున వారిని గమనించిన శివుడు, జ్ఞానాన్ని స్వీకరించేంతటి తేజస్సు వారిలో ప్రకాశించడాన్ని గమనించాడు. అటుపై దక్షిణదిక్కుగా కూర్చుని వారికి ఉపదేశాన్ని అందించాడు. అలా శివుడు దక్షిణామూర్తిగా, జ్ఞానానికి అధిపతిగా మారాడు. ఆయన నుంచి యోగాన్ని అభ్యసించిన ఆ ఏడుగురూ సప్తర్షులు అయ్యారు. శివుడు దక్షిణ దిక్కుగా ఎందుకు కూర్చున్నాడు అనడానికి ఒక హేతువు కనిపిస్తుంది. దక్షిణదిక్కు యమస్థానం! అంటే మృత్యువుకి సంకేతం. ఆ మృత్యువుకి అతీతమైన జ్ఞానాన్ని, సంసార బంధనాలను ఛేదించే యోగాన్ని అందించేందుకే పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మారి ఉంటాడు.
కాబట్టి... గురువులను తలుచుకునేందుకూ, ఎదుట ఉన్న జ్ఞానులను గౌరవించుకునేందుకూ ఇంతకంటే గొప్ప తిథి మరేముంటుంది. అందుకనే సాక్షాత్తూ ఆ ఆదిశంకరులవారే ఈ పర్వదినాన్ని ప్రారంభించారని చెబుతారు.
Related Temples:










గురుపౌర్ణమి ,  గురుపూర్ణిమ విశిష్టత ఏమిటి?Significance of Guru Purnima, guru purnima visistatha in telugu, story of guru purnima, guru purnima quotes, guru purnima 2020,Vyasa, Vyasudu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS