మాఘ పురాణం 17 వ అధ్యాయం | Maghapuranam 17th Day Story in Telugu

మాఘ పురాణం 17 వ అధ్యాయం : 

కప్పరూపము వదలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట :

మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును. కావున ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ. నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థ వాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్ళకు మాఘము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖీ! మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనమునుండీ ప్రతి సంవత్సరమూ మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు గావున నీవును ఈ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతిదినము ప్రాతఃకాలము నిద్రనుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము. నదిలో స్నానం చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోను, మంచి గంధము అగరు, ధూపదీపములను వెలిగించి, స్వామికి ఖండశర్కర పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరింపుము. తరువాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము. మన కుటీరమునకు వచ్చి మాఘ పురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము. దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను.

నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త శాంత స్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి శపించినాడు. ఓసీ మూర్ఖురాలా! నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా? సరియే. నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావిచెట్టు తొర్రలో మాండూక రూపంలోనుందువు గాక! అని నన్ను శపించెను.

వారి సింహగర్జనకు వణికిపోయితిని. వారి శాపమునకు భయపడి పోయితిని. వారి రౌద్రాకారమును చూడజాలక పోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. నాతప్పు నేను తెలుసుకున్నాను. “అన్నా! ఎంతటి మూర్ఖత్వముగా ప్రవర్తించితిని” అని పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై బడి రెండుపాదాలు పట్టుకొని “నాకీ శాపము ఎట్లుపోవును? మరల నిన్నెటుల కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా ని పరిపరివిధాల ప్రార్థించగా ణా భర్త కొంత తడవాలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా గౌతమమహర్షి గోదావరీ నదీతీరమందున్న తన యాశ్రమమునుండి ఉత్తరదేశ యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘ శుద్ధ దశమినాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించినయెడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును” అని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చితిని. నాభర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పు రూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈరావి చెట్టు తొర్రలో నివాసమేర్పరచుకొని జీవించుచూ మీరాకకోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు” అని తన వృత్తాంతము గౌతమమునికి తెలియజేసెను.

“అమ్మాయీ! భయపడకుము. నీకీ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములో వున్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది గదా! మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్రసంతతి ఆరోగ్యము కలుగుటయే గాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరియొక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనదీ వ్రతము. ఇటువంటి వ్రతమాచరింపుమని నీభర్త యెంత చెప్పిననూ వినిపించుకొనవైతివి. నీభర్త దూరదృష్టిగల జ్ఞాని. అతని గుణగణాలకు సంతసించెడి వారు. నిన్ను పెండ్లియాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండేవాడు. కానీ నీవలన అతనికి ఆశలన్నీ నిరాశాలై పోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు.అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపము పొందగలిగినావు. అందునా ఇది మాఘమాసము. 
కృష్ణా నదీతీరము. కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్నివిధాలా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే సుచివై రమ్ము. స్త్రీలు గానీ, పురుషులు గానీ ఈ సమయంలో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసి గానీ తెలియక గానీ మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందును, పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన యెడల వారి పాపాలు నశించును. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానమునను, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి, దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును. అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను.


మాఘ పురాణం 18 వ అధ్యాయం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Click Here : Magha puranam Day 18


Key Words : Magha Puranam , Magha purana parayana, Magha puranam PDF Download, Magha puranam in telugu.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS