శని త్రయోదశి కథ:
ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్యమధ్యలో కష్టాలు వస్తుంటేనే, జీవితపు విలువ తెలిసొస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది! అప్పుడప్పుడూ అవమానం ఎదురుపడితే, అహంకారం దిగిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ, అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు.
సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు. ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి.
అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, వీలయినంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం శనీశ్వరుడు కొలువై ఉన్న మందపల్లి, సింగనాపూర్ వంటి క్షేత్రాలని కానీ; నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి నాడు వచ్చే శనివారం నాడు ఆయనను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడన్న నమ్మకమూ ఉంది. ఇంతకీ ఈ శనిత్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే...
శనివారం ఇటు శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. అలా
స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు, శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటివారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివునికి ఒళ్లు మండిపోయింది.
‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అంటూ హుంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అంటూ కోపగించిన శనిభగవానుడు, శివుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ శపథం చేశాడు.శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే, తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.
మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శనిభగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలచిన శనిని చూసి ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు చిరునవ్వుతో.
శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది. ‘ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో... వారు నీ అనుగ్రహంతో పాటుగా, నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు’ అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. అప్పటి నుంచి త్రయోదశినాడు వచ్చే శనివారం రోజున, భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.
(శని నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కొన్న స్థలం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ‘మందపల్లి’ అని ఓ నమ్మకం.)
Related Postings:
> Mandapalli Saniswara swamy Temple Information
> Tirumala Complete Information in Telugu
> Arunachalam Temple Information
> Telugu Devotional E books Free Download
> Sri Chaganti Pravachanalu Videos
> Famous Temples In Visakhapatnam
shani trayodashi information in telugu sani trayodasi history shani trayodashi sani trayodasi 2017 how to do shani puja in telugu sani trayodasi 2017 dates telugu shani trayodashi 2016 dates shani trayodashi 2016 dates telugu shani trayodashi day 2017 sani trayodasi 2016 in telugu sani trayodashi importance sani trayodashi hindu temples guide
Tags
Story