వరలక్ష్మీ వ్రతం :
సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తాం. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి.
వరలక్ష్మి వ్రత కధ:
సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను జూచి ఇట్లనియె. “మునివర్యులారా! స్త్రీలకు సర్వసౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పెను. దానిని చెప్పెద వినుండు.
కైలాసపార్వతమున వజ్రవైఢూర్యాది మణిగణ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుండు కూర్చిండియుండ, పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, ” దేవా! లోకంబున స్త్రీలు ఏ వ్రతంబొనర్చిన సర్వసౌభాగ్యంబులును, పుత్రపౌత్రాదులును కలిగి సుఖంబుగనుందురో, అట్టి వ్రతంబు నా కానతీయ వలయు ” ననిన నప్పరమేశ్వరుండిట్లనియె. “ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగ జేసెడి వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారమునాడు చేయవలయు” ననిన పార్వతీదేవి ఇట్లనియే. ” ఓ లోకరాధ్యా! నీ వానతి ఇచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలయును? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవరిచే నీ వ్రతం బాచరింపబడియె? వీనినెల్ల సవివరంబుగా వచియింపవలయు”నని ప్రార్థించిన పరమేశ్వరుండు పార్వతీదేవిని గాంచి, “ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరంబుగ జెప్పెద వినుము.
మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను, బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండు. అట్టి పట్టణము నందు చారుమతియను నొక మహిళ గలదు. ఆ వనితామణి ప్రతిదినంబును ఉషఃకాలంబున మేల్కాంచి స్నానంబు చేసి, పెద్దలకు అనేక విధంబులైన యుపచారంబులను జేసి, ఇంటి పనులను జేసికొని, మితముగాను, ప్రియముగాను భాషించుచు నుండెను.
ఇట్లుండ ఆమె యందు మహాలక్ష్మికి యనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నయై, ’ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని, నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబుల నిచ్చేద’ నని వచించిన, చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి యనేక విధంబుల స్తోత్రము చేసి, ‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు గలిగెనేని జనులు ధన్యులగును, విద్వాంసులుగను, సకల సంపన్నులుగను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనంబు నాకు గలిగె’ నని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు జెంది చారుమతికి ననేక వరంబులిచ్చి యంతర్థానంబు నొందె. చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలంజూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో! నేను కలగంటిననుకొని భావించి యా స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలయిన వాండ్రతో జెప్ప, వారు ఈ స్వప్నము ముగుల నుత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం బవశ్యంబుగ జేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును, స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం బెప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము వచ్చెను.
అంత చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని, ఉదయంబుననే మేల్కాంచి, స్నానంబులంజేసి, చిత్ర వస్త్రంబులం గట్టుకొని, చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరిచి, యందొక ఆసనంబువైచి, దానిపై క్రొత్త బియ్యము పోసి, మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలశం బేర్పరచి, యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి, మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడశోపచార పూజలను జేసి, తొమ్మిది సూత్రంబులను గల తోరంబును దక్షిణహస్తంబున గట్టుకొని వరలక్ష్మీ దేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగనే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ యందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము గలిగే. అంత కాళ్ళం జూచికొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండగ, వారందరును ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవని పరమానందంబునొంది మరియొక ప్రదక్షిణంబు చేయ హస్తములందు ధగద్ధగాయ మానంబుగ పొలయుచుండు నవరత్న ఖచితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండుటం గనిరి. ఇంక చెప్పనేల. మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే యా స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథగజతురగ వాహనంబులతోడ నిండియుండెను. అంత నా స్త్రీలందోడ్కొని గృహంబులకు బోవుటకు వారివారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిల్చియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజచేయించిన పురోహితునికి పండ్రెండు కుడుములు వాయన దానం బిచ్చి, దక్షిణ తాంబూలంబు లొసంగి, ఆశీర్వాదంబు నొంది, వరలక్ష్మీ దేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ నెల్లరును భుజించి, తమ కొరకు వచ్చి కాచుకొనియున్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు బోవుచూ ఒకరితో నొకరు ’ఓహో! చారుమతీదేవీ భాగ్యంబేమని చెప్పవచ్చును. వరలక్ష్మీ దేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగె’ నని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరును ప్రతి సంవత్సరము నీ వ్రతంబు సేయుచూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనముల తోడం గూడుకొని సుఖంబుగనుండిరి.
కావున ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును అందరును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వసౌభాగ్యంబులును కలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును” అని పరమేశ్వరుడు పలికెను”.
వరలక్ష్మీ వ్రతకథ సంపూర్ణం ||
వరలక్ష్మి వ్రత పుస్తకం డౌన్లోడ్ కొరకు : BOOK DOWNLOAD
Relates Postings:
> Lakshmi Goddess of Wealth | How To Attract her Blessings
> Sri Raja Rajeswara Swamy Temple Details in Telugu
> Sri Saraswathi Sakthi Peetham Information
> Devotional E books Free Download
> Sri Chaganti Speeches Popular Videos
> Tirumala Complete Information in Telugu
varalakshmi vratham in telugu, varalakshmi vratham decoration, varalakshmi vratham tamil, varalakshmi pooja decoration ideas, simple varalakshmi pooja at home, how to celebrate varalakshmi pooja in tamil, varalakshmi pooja 2017, varalakshmi vratham first time, varalakshmi vratham pdf telugu, varalakshmi vratam telugu information, varalakshmi vratham pdf book download, varalakshmi vratham 2017, varalakshmi vratam pooja details, hindu temples guide.com
Tags
Story