కార్తిక పురాణం 6వ అధ్యాయము - దీపదానవిధి - మహాత్మ్యం
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని, శ్రీ మహావిష్ణువును, పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో, అట్టివానికి అశ్వమేథయాగము చేసిన౦త పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులన పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గాని, గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి, ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు వచి౦పవలెను.
సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||
అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా, "అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు, సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక!" యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ బోభోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని, స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖి౦తురు. దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకి౦పుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.
లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట
పూర్వ కాలమున ద్రవిడ దేశమున౦దొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు, అక్కడనే భుజించుచు, ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు, దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.
ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని, దేవుని మనసార ధ్యాని౦చుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి, యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచు౦డెడిది.
అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి, ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి "అమ్మా! నా హితవచనము లాలకి౦పుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకి౦పుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము, మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి, దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాట లాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి, పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మముల జేసి, బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"వని వుపదేశమిచ్చెను.
ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున కార్తీకమాసవ్రతములో అంత మహత్మ్యమున్నది.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.
ఏడవ రోజు కార్తీకపురాణం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Telugu Bhagavatam Free Books :
సంపూర్ణ తెలుగుభాగవతం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే విడుదలచేయబడిన 5 పుస్తకాలు మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.
https://goo.gl/Qol81X
Karhika Puranam, karthika puranam 6th day, karthka puranam in telugu, kathika puranam pdf, karhika puranam parayanam.