రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు | rajaswala dosha meaning | pushpavathi niyamalu

 

రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు:

మానవుల ఇహపర సౌఖ్యం కోసం సూక్ష్మ విషయ దర్శనం చేసిన శాస్త్రాలు అవతరించాయి. అవి వేదాలను ఆధారం చేసుకుని ఉన్నాయి. వేదాలు అపౌరుషేయాలు. దోష శంకా కళంకాలు లేనివి. అవి మానవ సుఖ జీవనం కోసం కొన్ని ఆచారాలనీ, నియమాలనీ ఉపదేశించాయి.

వాటిని పాటించడం ప్రతి వైదికుని కర్తవ్యం. మడి, మైల అనే పదాలను మనం వింటుంటాం. అవి శుభ్రతను మటుకే తెలుపుతాయని అనుకోవడం పొరపాటు. వాటి వెనుక మనకు గోచరించని, కానీ మన జీవనంపై ప్రభావం చూపించే సూక్ష్మశక్తుల గురించిన పరిఙ్ఞానం ఉంది. జాత, మృత అశౌచాదులలో మనం శారీరకంగా, మానసికంగా శుద్ధంగా ఉన్నా ‘మైల’అనే పరిపాటి లోకంలో ఉంది. కాబట్టి వేదం ఎలా చెప్పిందో అదే ఆచరణలో ఉండాలి. మన యుక్తులూ, మార్చుకోవడాలు వైదిక ఆచారం కానేరదు.

స్త్రీలు ప్రతిమాసం ఋతుకాలంలో విడిగా ఉండడం మన పూర్వీకుల ఆచారం. దీనికి ఆధారం యజుర్వేదంలో రెండవ కాండలోని ఐదవ ప్రపాఠకం. అందులో విశ్వరూప వధ, రజస్వలా వ్రతాలు ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి. అది ఇలా ఉంది – పూర్వం బృహస్పతి తపస్సుకు పోగా, ఇంద్రుడు త్వష్ట కుమారుడైన విశ్వరూపుని గురువుగా చేసుకున్నాడు. ఆయనకు మూడు తలలు. వాటితో అతడు సోమపానం, సురాపానం, అన్నభోజనం చేసేవాడు.

ఒకప్పుడు తనకు లభించిన యఙ్ఞ భాగాన్ని రాక్షసులకి ఇవ్వడంతో కోపం చెందిన ఇంద్రుడు వజ్రాయుధంతో అతని శిరస్సుని ఖండించాడు. అవి పక్షులై బ్రహ్మహత్యా దోషాన్ని ధరించి ఇంద్రునికి ఆ దోషాన్ని ఇవ్వసాగాయి. దాంతో ఇంద్రుని ఇంద్రత్వానికే ఆపద వచ్చింది. యఙ్ఞం ద్వారా కొంతమేరకు తొలగించి, మిగిలిన ఆ దోషాన్ని మూడు భాగాలు చేసి, పుచ్చుకున్న వారికి కోరిన వరమిస్తానన్నాడు. ఒక భాగాన్ని పృథివి తీసుకుంది. వరంగా – భూమిపై ఎక్కడైనా తవ్వితే కొన్ని రోజులకు ఆ భూమి సమమయ్యేలా కోరింది. అలాగేనని వరమిచ్చాడు ఇంద్రుడు.

వృక్షాలు ఒక భాగాన్ని పుచ్చుకున్నాయి. కొన్ని కొమ్మలు నరికినా వృక్షం మృతి చెందక మళ్ళీ వేరే శాఖలు మొలిచేలా వరాన్ని పొందింది. అలాగే స్త్రీలు చివరిభాగం తీసుకొని, దానికి బదులుగా పుత్రోత్పత్తి సామర్థ్యాన్ని వరంగా పొందారు. అందువల్ల ఆ రజస్వలా కాలంలో వారికి బ్రహ్మహత్యాదోషం ఉంటుంది. ఆ దోషం ఉండడం వల్ల, ఆ రోజుల్లో వారితో సల్లాపాలు చేయరాదు, సమానంగా కూర్చోరాదు. ఒకటిగా భోజనం చేయరాదు, వారిని తాకరాదు. వారు వండినవి తినరాదు. అలా నియమాలు పాటించని పక్షంలో కొన్ని కష్టాలు వస్తాయని కూడా వేదమంత్రాలు చెప్తున్నాయి. ఇది వేదం చెప్పిన గాథ. పైగా ఇందులో ఎన్నో సంకేతాలు ఉంటాయి. శరీర నిర్మాణంలో దేవతాశక్తులే ఇంద్రియాధిదేవతలు. మన శరీరంలో మనకు తెలియని మార్పులు జరుగుతున్నట్లే మనపై ప్రభావం చూపే సూక్ష్మప్రపంచంలోనూ జరుగుతాయి. ఇంద్రుడు ప్రధాన దేవతాశక్తి. ఆశ్చర్యంగా, కాలగమనాన్ని ఆధారం చేసుకొని మారే శరీర నియమంలో అంతు తెలియని దైవిక రహస్యాలను వేదం వివరిస్తుంది. ఇంద్రియాతీత సత్యదర్శనమే కదా వేదవిఙ్ఞానం.

కొన్ని ధర్మాలను పాటించలేకపోవచ్చు. కానీ మన అశక్తత వల్ల వదలి, వాటిని ధర్మాలే కావనీ, మనం చేసిందే ధర్మమనీ ఋషి విఙ్ఞానాన్ని తూలనాడడం ఎందుకు? ఆధునిక కాలంలో వాటిని పాటించడం శ్రమ అనీ, అవి మూఢనమ్మకాలనీ స్త్రీలను తక్కువ చేయడమేనన్న భావాలున్నాయి. కానీ అవి సరికావు. ఇది వైదిక ఆచారమే. మన పూర్వీకులు పాటిస్తూ వచ్చిన ధర్మమే. మనకు పట్టలేదని అవి మూఢనమ్మకాలనడం సబబు కాదు. స్త్రీలు ఇంద్రునికి సహాయం చేసి, దోషాన్ని తాము తీసుకొని అనుభవిస్తున్నారని వారి గొప్పదనాన్ని తెలుపుతోంది కనుక వారిని తక్కువ చేయడం ఏమాత్రమూ కాదు.

పైగా ఇది శరీరజ దోషం. వ్యక్తిత్వదోషం కాదు. ఇది అవమానకరమూ కాదు. దేశ, కాల పరిస్థితులను బట్టి కొన్ని అనుకూలించకపోయినా, శక్తివంచన లేకుండా యథాశక్తి వాటిని ఆచరించవచ్చు. ఇంట్లో ఇతరుల్ని తాకకుండా, వండకుండా విశ్రాంతిగా ఒకేచోట ఉండడం ఎప్పుడైనా కుదురుతుంది. శ్రద్ధ ఉన్నప్పుడు తప్పకుండా ఆచరించగలం.

నెలలో కేవలం ఆ కొద్దిరోజులు జాగ్రత్తపడడం, కొంచెం శ్రమ అయినా, అసాధ్యం కాదు. బైట ప్రపంచం గురించి విడిచిపెట్టండి, మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉండగలం.

నాలుగవ రోజున స్నానం చేశాక, నీళ్ళలో పసుపు కలిపి ఆ దోషాలన్నీ పోయేలా భగవత్ సమర్పణ చేసి స్నానం చేస్తారు. ఇంట్లో ఆ మూడు నాళ్ళు మసలిన చోటంతా పసుపు నీళ్ళు జల్లి ఇల్లు కడుగుతారు. పైగా మంత్రం జపించేవాళ్ళు ఉన్న ఇంట, దీపారాధన, దేవతాపూజలు జరిగే ఇంటా ఇటువంటి ‘మైల’లు కలిస్తే ఆ మంత్రశక్తీ, దైవశక్తి నశిస్తాయి. దీనికి ఎన్నో నిదర్శనాలున్నాయి. తాయెత్తులు, యంత్రలు వంతివి కూడా రజస్వలా స్త్రీ స్పర్శతో శక్తిహీనమవుతాయి. మళ్ళీ సంప్రోక్షణ చేస్తేగానీ వాటిలో శక్తిచేరదు.

అంతటా దేవుడున్నాడు కదండీ’ అనే వేదాంత వచనాన్ని దీనికి అన్వయించడం తప్పు. అంతటా దేవుడున్నాడనిపిస్తే ఒకేచోట దేవతాపూజ చేయడం ఎందుకు? దేహ స్పృహ ఉన్నంతకాలం ఆచారం పాటించవలసిందే.

ఈవిధమైన అశౌచంలోనున్న స్త్రీ శరీరం నుండి ప్రసరించే సూక్ష్మ విద్యుదయస్కాంత తరంగాల ఆవరణ(ఆరా) దివ్యంగా ఉండదు. విపరీత శక్తులతో ఉంటుంది. ఇది సూక్ష్మ ప్రపంచాన్ని దర్శించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది.

నిత్యం దీక్షగా ఉన్న స్త్రీలు ఆ నాలుగు రోజులు మంత్రజపం, స్తోత్ర పారాయణ, దీపారాధన వంటివి చేయరాదు. (మానసికంగా నామస్కరణ చేస్తే తప్పులేదు). తిరిగి స్నానాదులు చేశాక (అయిదవరోజు నుండి) వాటిని కొనసాగించవచ్చు. అప్పుడు, మధ్యలో ఆపిన దోషం ఉండదు. అలాకాకుండా ఆ నాలుగు రోజుల్లోనూ వాటిని కొనసాగిస్తే, పాపం సంక్రమిస్తుంది. ఆ సమయంలో దైవసంబంధ కార్యక్రమాలలో పాల్గొన్నా దోషమే. మామూలుగా నిత్యం సహజంగా మలినాలు విసర్జించాక, స్నానం చేస్తేనే గానీ పూజాదులకు పనికిరాదంటారు. మరి ఈ విషయంలో నియమాలుండడం ఎంత అవసరమో ఆలోచించండి!

దేవాలయాదుల వాతావరణమంతా మంత్రశక్తిచేత, నిత్యానుష్ఠానాల చేత పునీతమై ఉంటుంది. అందులో ఇటువంటి అశౌచమున్న వాళ్ళు ప్రవేశిస్తే, ఆ వాతావరణంలోని సూక్ష్మంగా ఉన్న పవిత్రత దెబ్బతింటుంది.

మన దేవతల గురించి, మంత్రాల గురించి చెప్పిన వేదపురాణాలే ఈ విషయాలూ చెప్పాయి. దేవతపై నమ్మకం ఉంటే వీటిని నమ్మవలసిందే. ‘శుచి’ అనేది అభివృద్ధి చెందిన నాగరికతకి చిహ్నం. అయితే మనకో సందేహం రావచ్చు – బైట ఎందరో అలా ఉంటున్నారు కదా! అని. బైట విషయం మనకు ఙ్ఞాతం కాదు. మన మటుకు మనం జాగ్రత్త పడితే చాలు.

అందుకే దైవమందిరాన్ని ప్రత్యేకంగా ఉంచుతాం. బైటకి వెళ్ళి వచ్చిన బట్టలతో ముట్టుకోం. స్నానం చేసి, శుద్ధ జలాన్ని పట్టుకొని, శుద్ధ వస్త్రాల్ని కట్టుకొని ‘పుండరీకాక్ష’ (భగవంతుని)నామం స్మరించుతాం. అప్పుడు శుచి వస్తుంది. తెలిసి అటువంటి వాటిని కలుపుకోకూడదు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆవరణలో ఉన్న ప్రాంతమంతా అశుచి అవుతుంది.

ఆరోగ్యరీత్యా కూడా ఆ నాలుగు రోజులూ స్త్రీకి విశ్రాంతి అవసరం. అప్పుడు కూడా ఆమెకు విశ్రాంతినివ్వకుండా, ఇంటి పనులు చేయించడం మగవాడి దౌర్జన్యమే. అప్పటి ‘ఇన్ఫెక్షన్’ ప్రభావం గురించి విఙ్ఞానశాస్త్రమూ చెప్పింది. భారతీయ విఙ్ఞానంలో భౌతిక విఙ్ఞానం, సూక్ష్మ ప్రపంచ విఙ్ఞానం కలిసి ఉంటుంది. భౌతిక విఙ్ఞానం ఇంకా ఎదుగుతోంది. ఇప్పటికే మన ఆచారాల్లో కొన్నింటి ఆరోగ్య రహస్యాలు అంగీకరిస్తున్నారు. ఇంకా ఈ సైన్స్ ఎదిగితే అన్నిటినీ అంగీకరిస్తారు. కానీ ఈ లోపలే మనం వీటిని పోగొట్టుకోకూడదు. ఈ నాలుగు రోజులూ ఆమె ఇంట్లో కలవకూడదు. ఇంటి యజమాని గానీ, ఇంకెవరైనా గానీ దీపారాధన, పూజ చేయవచ్చు.

మనచుట్టూ జగత్తులో దైవీశక్తులూ, విపరీత శక్తులూ ఉంటాయి. విపరీత శక్తుల ప్రభావం పడకుండా ఉండేందుకే శౌచాన్ని పాటించాలి.

‘ఇవి కుదరవు’ అని తప్పించుకుంటే నష్టపోయేది మనమే. ఆ నష్టానికి సిద్ధపడితే వదలవచ్చు. శాస్త్రాన్ని పాటించడం వల్ల పాటించిన వారికే ప్రయోజనం కానీ ఇంకెవరికో కాదు. మన శ్రేయస్సు కోసమే సూక్ష్మదర్శనం కలిగిన ఋషులు సదాచార నియమాలను పేర్కొన్నారు. అవి పాటించడం కొందరికి సాధ్యం కాకపోవచ్చు.

అంతమాత్రం చేత వాటిని తీసిపారేయడం తగదు కదా! నిప్పునీ, నీటినీ సమానంగా చూడగలిగే ద్వంద్వాతీత అవధూత స్థితిలో ఉన్నవారికే విధి నిషేధాలు ఉండవు గానీ, నిప్పు నీరూ, మంచీచెడూ, శీతోష్ణాలూ, సుఖదుఃఖాలూ తెలిసిన ‘దేహస్పృహ’ కలిగిన మనందరికీ విధినిషేధాలున్నాయి.

సేకరణ: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు.

Famous Posts:

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?


కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

రజస్వల దోషాలు, Rajaswala, period meaning, rajaswala in telugu, rajaswala dosha in telugu, pushpavathi niyamalu,

2 Comments

  1. Dhanyavadalu... chala manchi vishayam.... memu naluguru sisters... maa intlo maa amma modati rojunundi maku ee alavatu chesindi.... idi patistunnanduku maa relation mottam mammalni takkuva chesi choosaru ayina memu patinchadam manukoledu......

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS