Veereswara Swamy Temple Video
నిత్యకళ్యాణం పచ్చతోరణంగా శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతుంది. పెళ్లి కానీ వారు ఇక్కడ స్వామి వారి కళ్యాణం చేయిస్తే త్వరగా పెళ్లి అవుతుంది అని విశేష ప్రచారం కలదు. ఒకే పీఠం పై స్వామి వారు అమ్మవారు దర్శనం ఇస్తారు . కాకినాడ నుంచి యానాం మీదుగా ఈ ఆలయం చేరుకోవాలి . క్రింది నెంబర్ కు ఫోన్ చేస్తే ఆలయ వివరాలతో పాటు కళ్యాణం టికెట్ బుక్ చేస్కుకునే విధానం , వసతి తదితర వివరాలు తెలుసుకోవచ్చు .
మురమళ్ళ స్థలపురాణం
భరద్వాజంతర్భూత పావన వృద్ధ గౌతమీ నదీ తీరమందు ఉన్న సుప్రసిద్ధమైన ఈ దివ్యక్షేత్రంలో నిత్యకళ్యాణము పచ్చతోరణములతో విరాజిల్లుతూ "శ్రీ భద్రకాళీ సమేతంగా శ్రీ వీరేశ్వరస్వామి వారు" ప్రత్యక్ష దైవముగా ప్రకాశించుచున్నారు. శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణము జరుగు విశేషమునకు కారణమేమనగా తొలి దక్షప్రజాపతి "నిరీశ్వరయాగము" చేయసంకల్పించి ఇంద్రాది అష్టదిక్పాలకులను, ముల్లోకములలోని దేవతల నందరును, సృష్టికర్త బ్రహ్మ మరియు స్థితికారకుడు విష్ణుమూర్తిని అందరినీ ఆహ్వానించెను. తన కుమార్తెను ప్రేమతో వివాహము చేసుకొన్న వరమేశ్వరుడిని పిలువలేదు. కానీ దాక్షాయణి తన పుట్టింటికి వెళ్లుటకు నాకు ఆహ్వానము అవసరంలేదని, తన భర్తను మెప్పించి ఒప్పించి పయనమయ్యెను. అచ్చట యజ్ఞమారంభమయ్యెను. వచ్చిన కూతుర్ని పలుకరించక దక్షుడు చాలా అవమానమునకు గురిచేసెను. అది భరించలేక మగడు వద్దన్ననూ వచ్చినందుకు శిక్షగా తనకాలి బ్రొటనవేలితో భూమిపై గీసి అగ్నిదేవుని ఆహ్వానించి ఆ అగ్నిగుండములో దుమికి ఆహుతి అయ్యెను. ఆవిధంగా సతీదేవి భస్మమయినదని తెలుసుకున్న పరమేశ్వరుడు అగ్రహోద్రిక్తుడయి తన జటాజూటమునుండి ఒక జటను తీసి నేలకువేసి కొట్టెను. వెంటనే అరవీర భయంకర రూపంతో వీరభద్రుడు ఉద్భవించెను. దక్షయజ్ఞ ధ్వంసమునకుగాను ఉద్భవించిన శ్రీ వీరభద్రుడు కోటి సూర్యుల ప్రకాశంతో ఉగ్రస్వరూపమున దక్షయజ్ఞము ధ్వంసముగావించి తదుపరి శ్రీ మహావిష్ణువు కోరిక పై దక్షయాగము పూర్తిగావించుటకు సమ్మతించి దక్షుని మొండెమునకు మేకతలను తగిలించి దక్షుని బ్రతికించి ఆయనచేత వేదోక్తముగా యాగము పూర్తిచేయించిన తరువాత కూడా శ్రీ వీరభద్రుడు కోపాగ్నిని వీడనందులకు కారణము సతీదేవి యోగసక్తితో అగ్ని పుట్టించుకొని అందులో ఆహుతి అయిన కారణం అని మహామునులు, దేవతలు అందరూ గ్రహించి శ్రీ వీరభద్రుని శాంతింపజేయుటకు మునులు, దేవతలు భయకంపితులై వైకుంఠమునకు వెళ్లి మహావిష్ణువును ప్రార్థించి వీరభద్రుని శాంతింపజేయమని కోరిరి.
మహావిష్ణువు నరసింహావతారంలో శ్రీ వీరభద్రుని శాంతింపజేయుటకు వెళ్ళగా, వీరభద్రుడు విష్ణుమూర్తి నడుమును గట్టిగా పట్టుకొనెను. అప్పుడు మహావిష్ణువు నరసింహావతారములోనున్న తన లీలనచ్చటనే వదలి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రమ్మదేవునకు ఈ విషయమును తెలిపి వీరభద్రుని శాంతింప జేయుటకు త్రిమూర్తులు అందరూ ఆదిపరాశక్తిని ధ్యానించగా ఆదిపరాశక్తి ప్రత్యక్షమై కారణమేమని అడుగగా వీరభద్రుడు కోటి సూర్యుల కాంతితో అతిఉగ్రస్వరూనమును విడిచి శాంతింపక చూచుటకు అతి భయంకరముగా ఉన్నందున లోకమునకు శాంతి కలుగదని వీరభద్రుని శాంతింపజేయమని కోరగా షోడస కళలలో ఒక కళను భద్రకాళి నామముతో భూలోకమునకు వీరభద్రుని శాంతింపజేయుటకు పంపెను. భద్రకాళి అమ్మవారు తన శక్తికొలది యెంత ప్రయత్నించిననూ వీరభద్రుడు శాంతింపనందున 'శరభ శరభ అశ్శరభ శరభ అనుచు ప్రనుచు ప్రక్కన గల తటాకము నుండి బయటకు వచ్చి వీరభద్రుని చూచెను. అంతట వీరభద్రుడు కన్యరూపమున ఉన్న శ్రీభద్రకాళిని చూచి శాంతించెను. అవుడు వారిరువురకు గాంధర్వ వివాహ పద్ధతిన కళ్యాణము మునిమండలి యందు జరిపి శాంతింపజేసిరి. మహామునులందరూ గౌతమీ నదీ తీరమున ఆశ్రమములు ఏర్పరచుకొనిన ప్రదేశం మునిమండలి. (ప్రస్తుతం వాడుక నామములో ఉన్న మురమళ్ళ గ్రామము) ఆనాటి నుండి మహామునులందరూ శ్రీస్వామివారికి గాంధర్వ వివాహ పద్ధతిన నిత్యకళ్యాణము చేయుచుండిరి. ఆ పద్ధతి ప్రకారమే నేటికినీ శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణములు జరుగుచున్నవి. ఇందులకు తార్కాణముగా ఈ క్షేత్రమున భక్తులు వారి కన్యల వివాహములు ఈ దేవాలయములో చేయుచున్నారు. మరియు వేరొక విశేషము ఏమనగా కళ్యాణము స్థిరపడక జాప్యము జరుగు చున్నపుడుకూడా స్వామివారికి కళ్యాణముచేయించినయెడల వారి కన్యలకు శీఘ్రముగా అతి త్వరలో కళ్యాణము జరుగుచున్నదని లోక ప్రసిద్ధి.
శ్రీ స్వామివారికి నిత్యకళ్యాణమునకు భక్తులు వచ్చుటయేగాక అగస్త్యుడు, శుకుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు, గౌతముడు, భార్గవుడు, వ్యాసుడు, భరద్వాజుడు, మారీచుడు, కశ్యపుడు, మార్కండేయుడు, నారదుడు మొదలైన ఋషీశ్వరులు అందరూ నిత్యము వేంచేయుదురు అని పురాణము నందు కలదు. ఈ మహాక్షేత్రమునకు శ్రీ శ్రీ వీరేశ్వరస్వామివారి దివ్య క్షేత్రపాలకుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు. శ్రీ స్వామివారికి మురమళ్ళ సమీప గ్రామమున ఐ. పోలవరం మండలం కాపురస్తులు జమిందారులచే ఇవ్వబడిన భూమిపై వచ్చు. ఆదాయంతో శ్రీ స్వామివారికి నిత్య ధూప, దీప, నైవేద్యములు, నిత్య కళ్యాణోత్సవములు జరుగుచున్నవి. నేటికినీ ఆ పద్ధతి ప్రకారం శ్రీ స్వామివారికి నిత్యకళ్యాణము జరుగుచున్నది. ప్రతి రోజు 27 మంది భక్తుల గోత్రనామములతో వారి సంకల్పములతో కళ్యాణములు జరిపించబడుచున్నవి. పెండ్లికాని అబ్బాయి/అమ్మాయి స్వామివారికి కళ్యాణము జరిపించిన వెంటనే విఘ్నాలు తొలగి వారికి వివాహములు వెంటనే జరుగుట స్వామివారి యొక్క ప్రత్యక్ష నిదర్శనం. శ్రీ స్వామివారికి నిత్యకళ్యాణం చేయించెడివారు మరియు చూచెడివారు ఆయురారోగ్య సౌభాగ్య సంపదలు, సంతతి, అన్యోన్యతను పొందుటయే కాక ఏ కోరికతో ఆరాధించు చున్నారో ఆయా కోరికలు సిద్ధింప చేసుకొనుచున్నారు. దూర ప్రాంతముల వారు ముందుగా నగదు చెల్లించి పేర్లు నమోదు చేయించుకుని శ్రీ స్వామివారికి కళ్యాణములు నమోదు చేయించుకొందురు. అట్టివారికి ప్రసాదములు తపాలాశాఖ ద్వారా వారి చిరునామాకు పంపబడును.
Muramalla Temple Address:
Veereswara Swamy Temple,
Muramalla,
I Polavaram Mandal,
East Godavari.
Contact : 08856- 278136, 9490111136
Temple Official Website : https://www.sriveereswaraswamytemple.com/
Temple Offici Working Times 09:00 AM to 01:00 PM 02:00 PM to 05:30 PM
Murumalla Near by Temples:
Inavilli ( Vigneswara Swamy )